- లోక్ సభలో వెల్లడించిన నితిన్ గడ్కరీ
- వాహనదారుల ఖాతానుంచి నేరుగా టోల్ చెల్లింపు
- ఆందోళనలో టోల్ సిబ్బంది
ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దీని స్థానంలో జీపీఎస్ ఆధారంగా టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నట్లు గడ్కరీ తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా 93 శాతం మంది వాహనదారులు ఫాస్ట్ టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అయితే మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్ కట్టేందుకు ఇష్టపడుతున్నారని ఫాస్ట్ టాగ్ మాత్రం ఉపయోగించడం లేదని గడ్కరీ తెలిపారు. ఫాస్ట్ టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఫాస్ట్ టాగ్ ద్వారా ఆన్ లైన్ లో టోలో చెల్లింపు వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ లేని వారి నుంచి రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నారు.
Also Read: కాలుష్య కాసారం భారతావని
జీపీఎస్ ద్వారా టోల్ చెల్లింపు:
ఇటీవలి కాలంలో అన్ని వాహనాల్లో వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ వస్తున్నందున టోల్ వసూలుకు కూడా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్ ఆధారంగా టోల్ చెల్లించే సదుపాయాన్ని అమలు చేయనుంది. జీపీఎస్ ఆధారంగా వాహనం కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలోనే వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జీలు పడతాయి.
ఆందోళనలో టోల్ ప్లాజా సిబ్బంది:
టోల్ చెల్లింపు వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల టోల్ ప్లాజాలలో పనిచేసే సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో వినియోగదారులకు మేలు జరుగుతోందని అదే సమయంలో తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడొంతుల మందికి పైగా ఉపాధి కోల్పోయారని ఇక టోల్ ప్లాజాలు పూర్తిగా ఎత్తివేస్తే మరికొంత మంది ఉపాధి కోల్పోతారని టోల్ ప్లాజాలో పనిచేసే సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Also Read: సామాజిక మాధ్యమాలకు ముకుతాడు