- 2021 వేలం జాక్ పాట్ కొట్టిన మోరిస్
- ఏడాది ఏడాదికీ పెరుగుతున్న వేలం ధర
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ వేలం కొత్తపుంతలు తొక్కుతోంది. 2008 సీజన్లో ప్రారంభమైన ఆటగాళ్ల వేలం సీజన్ సీజన్ కూ సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టిస్తోంది. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ మినీవేలంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ సరికొత్త రికార్డు ధరతో నిలిచాడు. గత 13 సీజన్లలో లేని ధరను దక్కించుకొన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
గత సీజన్ వరకూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు 7 కోట్ల రూపాయల ధరకు ఆడిన మోరిస్ ను ఫ్రాంచైజీ విడిచి పెట్టింది. దీంతో 75 లక్షల కనీస ధరతో వేలంలో నిలిచిన మోరిస్ అనూహ్యంగా 16 కోట్ల 20లక్షల రూపాయల ధర సాధించాడు. జైపూర్ ఫ్రాంచైజీకి చెందిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వేలం ద్వారా మోరిస్ ను సొంతం చేసుకొంది.
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ నాయకత్వంలో మోరిస్ 2021 సీజన్ లీగ్ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ గత 13 సీజన్ల రికార్డుల ప్రకారం అతధిక ధర దక్కించుకొన్న క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ( 2014 లో 14 కోట్లు, 2015లో 16 కోట్లు), 2017 సీజన్లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 14 కోట్ల 50 లక్షల ధరను , 2020 సీజన్ వేలంలో కంగారూ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 15 కోట్ల 50 లక్షల రూపాయల ధరను దక్కించుకొంటే ప్రస్తుత సీజన్ మినీ వేలంలో క్రిస్ మోరిస్ 16 కోట్ల 20 లక్షల ధరతో సరికొత్త రికార్డు నెలకొల్పడం విశేషం. భారత స్టార్ క్రికెటర్లు, వివిధ ఫ్రాంచైజీల ఐకాన్ ప్లేయర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీలను మించి క్రిస్ మోరిస్ పారితోషికం అందుకోనున్నాడు.