- విదేశాంగమంత్రి జయశంకర్ దౌత్యం ఫలితం
- రాయబారి సహా 120 మంది ఎయిర్ ఫోర్స్ విమానంలో రాక
కాబూల్ లో ఇరుక్కుపోయిన భారత రాయబారినీ, ఇతర రాయబార కార్యాలయ సిబ్బందినీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సురక్షితంగా ఇండియాకు తీసుకొని వచ్చింది. నిజానికి రెండు ఎయిర్ ఫోర్స్ సి-17విమానాలు ఆగస్టు 15 నాడు కాబూల్ విమానాశ్రయంలో దిగాయి. భారత రాయబార కార్యాలయ సిబ్బందినీ, వారికి రక్షణ కల్పిస్తున్న ఇండో-టిబెటన్ ఫోర్స్ సిబ్బందినీ వెనక్కి తీసుకొని రావడం ఆ విమానాల లక్ష్యం. ఆగస్టు 15-16 రాత్రి కాబూల్ విమానాశ్రయంలో పరిస్థితి గందరగోళంగా తయారయింది. వేలాది అఫ్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళాలనే ఆరాటంలో విమానాశ్రయం చేరుకున్నారు. విమానాలు ఎగిరే పరిస్థితులు లేవు. అటువంటి సమయంలో ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం 45 మంది భారతీయులతో తిరిగి విజయవంతంగా బయలు దేరింది. అప్పటికే తాలిబాన్ కాబూల్ విమానాశ్రయంపైన దృష్టి పెట్టారు. కాబూల్ నుంచి ఇండియాకు రావాలనుకునే అఫ్ఘాన్లకు వీసాలు మంజూరు చేస్తున్న సాహిర్ వీసా ఏజెన్సీ పైన తాలిబాన్ దాడి చేశారు. విమానాశ్రయానికి వస్తున్న 45 మందినీ తాలిబాన్ సెంట్రీలు ఆపు చేసి వారి దగ్గరున్న విలువైన వస్తువులను తీసుకున్నారు. అటువంటి క్లిష్టపరిస్థితులలో మొదటి ఎయిర్ ఫోర్స్ విమానం సోమవారంనాడు కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. అది ఒక సాహసం.
తక్కిన రాయబార కార్యాలయ సిబ్బంది, కాబూల్ లో భారత రాయబారి అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బయటికి కదిలే పరిస్థితి లేదు. చుట్టూ ఎటు చూసినా తుపాలకులు ధరించిన తాలిబాన్ ఉన్నారు. కాబూల్ విమానాశ్రయానికి చేరుకునే వాతావరణం లేదు. సోమవారం రాత్రి భారత విదేశాంగమంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటోనీ బ్లింకెన్ మధ్య జరిగిన సంభాషణ ఫలితంగా తక్కిన రాయబార కార్యాలయ సిబ్బందిని మంగళవారం ఉదయం కాబూల్ విమానాశ్రయానికి అమెరికా సైనికుల సహకారంతో తీసుకొని వచ్చారు. రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా మిగిలిన 120 మంది భారతీయులూ రెండో ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కి కాబూల్ నుంచి సురక్షితంగా వెనక్కి బయలు దేరారు. గుజరాత్ లోని జామ్ నగర్ విమానాశ్రయంలో ఈ విమానం క్షేమంగా దిగింది. రాయబారి రుద్రేంద్ర టాండన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ధన్యవాదాలు తెలిపారు.
🙏🙏 చక్కని సమాచారం అందిస్తున్నారు సర్. మంచి విశ్లేషణ..
Good
Good effort to bring back our people a timely action .