వోలేటి దివాకర్
గత 2-3 నెలలుగా నేషనల్ ఛానల్స్ చేసిన సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 24-25 పార్లమెంటు స్థానాలను గెలుస్తుందని చెబుతున్నాయని ఈ నేపథ్యంలో అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి, ఆత్మస్థయిర్యంతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏ సర్వే చేసినా రాజమండ్రి పార్లమెంటు స్థానం టాప్ లో ఉందని, లోక్ సభ స్థానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. అలాగే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మిధున్ రెడ్డి నాయకులకు సూచించారు.
Also read: కొత్త డాక్టర్ వైసిపి రోగం కుదురుస్తారా?!
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యక్తిగత సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీగా ప్రజల్లో ఎంతో అభిమానం ఉన్నందున కచ్చితంగా రానున్న ఎన్నికల్లో గతం కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
రాజమహేంద్రవరంలో సోమవారం పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నికలు 7-8 నెలలు ఉన్నాయని, ఎన్నికల తర్వాత కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని, కష్టపడిన వారికి న్యాయం చేసే బాధ్యత తమదేనన్నారు.
Also read: ఆవేశం తగ్గిస్తే… వారాహి యాత్రకు ఎదురు లేదు!
రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని అందరూ గుర్తుంచు కోవాలని మిథున్ రెడ్డి అన్నారు. కార్యకర్తలకు న్యాయం జరగాలంటే మరోసారి విజయం సాధించాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి న్యాయం చేయలని జగన్ చెప్పారని, కార్యకర్తలు అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. విపక్ష తెలుగుదేశం, జనసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో వారికి బలం లేదనే విషయాన్ని, ఓటమి భయాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పార్టీలోని అంతర్గత కలహాలను కూడా ప్రస్తావించారు. వాటిని సరిదిద్దుకోవాలని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో. 35 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవదు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను ఎద్దేవా చేస్తూ.. వారికి 35 స్థానాల్లో 35 మంది అభ్యర్థులు కూడా లేరని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో మళ్లీ నియోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహిస్తామని మిథున్ రెడ్డి తెలిపారు.
Also read: వైసీపీకి రాజమహేంద్రవరంలో సొంత కార్యాలయం!
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసు ,తూర్పు గోదావరి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.