Tuesday, January 21, 2025

అన్ని మతాలలో ప్రలోభం

My Confession

                        ————————-

                                                By Leo Tolstoy

                                                ————————-

                          నా సంజాయిషీ

                          ———————

                                                లియో టాల్స్టాయ్

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                              చాప్టర్ 15

                              —————

                    రైతులలోని నిరక్షరాస్యత, నేర్చుకోలేకపోవడం చూసి నేను ఎన్నిసార్లు అసూయ పడ్డానో! నాకు అసంబద్ధంగా కనిపించిన వారి ప్రసంగాలు,  వారికి ఏమాత్రం తప్పుగా కనిపించేవి కావు; వాటిని వారంగీకరించేవారు. నేను నమ్మిన సత్యాన్ని వారూ నమ్మేవారు. నాలాంటి సంతోషం లేని మనిషికే సత్యము — అబద్ధంతో  సున్నితమైన దారాలతో కలిపి అల్లబడిందని తెలుస్తుంది. దాన్ని ఆ రూపంలో నేను అంగీకరించలేకపోయాను.

               అలా నేను మూడు సంవత్సరాలు జీవితం కొనసాగించాను. ప్రారంభంలో మత సూత్రాలు చెప్పే అప్రెంటిస్ గా సత్యంతో కొంచమే సంబంధం ఉండి, నాకు స్పష్టంగా కనిపించింది మాత్రమే కనుగొన్నప్పుడు — పైన చెప్పిన సందర్భాలు తక్కువ ఎదురయ్యాయి. నాకు ఏదయినా అర్థం కానప్పుడు, “ఇది నా తప్పు, నేను పాపిని” అనుకున్నాను; కానీ నేను నేర్చుకుంటున్న సత్యాలు నాకు పూర్తిగా అవగతమైనప్పుడు, అవి నా జీవితానికి ఆధారమైనప్పుడు, అవి ఎదుర్కోవడం చాలా అణచివేతగా, బాధాకరంగా ఉంది. ఇంకా — నేను అర్థం  చేసుకోలేకపోవడం వల్ల అర్థం కాని దానికి, మనకి మనం అబద్ధం ఆడితే తప్ప అర్థం కాని దానికీ మధ్య ఉన్న గీత ఎక్కువ స్పష్టం అయింది.

Also read: బ్రతకడానికి విశ్వాసం అవసరం

                  నా సందేహాలు, బాధలు ఉన్నాగాని నేను సనాతన చర్చినే అంటిపెట్టుకొని ఉన్నాను. నిర్ణయించవలసిన జీవిత ప్రశ్నలు ఎదురయ్యాయి; ఈ ప్రశ్నలకు చర్చి చెప్పిన నిర్ణయాల  (నేను ఏ నమ్మకాలతో బ్రతుకుతున్నా నో, వాటి ఆధారాలకు పూర్తి విరుద్ధంగా) వల్ల నేను సనాతన ధర్మంతో సహవాసం అసాధ్యమని విధిలేక వదిలివేయాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలు: ముందుగా సనాతన తూర్పు చర్చికి, మిగిలిన కాథలిక్, సెక్టోరియన్ చర్చిలకు గల సంబంధాలు. ఆ కాలంలో మతంలో నాకున్న ఆసక్తి ఫలితంగా చాలామంది వివిధ ధర్మాలకు చెందిన విశ్వాసులతో నాకు పరిచయం ఏర్పడింది: వారు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు, పాత విశ్వాసులు, మొలాకన్స్ ఇంకా మిగిలినవారు. వారిలో ఉన్నతమైన నైతికత గల చాలామందిని కలిశాను. వారంతా నిజమైన మత విశ్వాసులు. నేను వారితో సోదర భావంతో ఉండాలనుకున్నాను. కానీ ఏం జరిగింది? అందరినీ ఒక విశ్వాసము మరియు ప్రేమ లోకి ఏకం చేస్తానని వాగ్దానం చేసిన బోధన, తన ముఖ్యమైన ప్రతినిధుల ద్వారా చెప్పిందేమిటంటే — ఈ ప్రజానీకం అంతా అబద్ధంలో బ్రతుకుతున్నారు; మనమే నిజమైన సత్యాన్ని కలిగి ఉన్నాం. తనతో సారూప్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండని వారు మతోన్మాదులని సనాతన చర్చి అనుకుంటుంది. అలాగే కేథొలిక్స్ మరియు ఇతరులు సనాతన చర్చిని మతోన్మాదులు అనుకుంటారు. నేను చూసినది ఏమిటంటే సనాతనులు (వారు ఇది దాచడానికి ప్రయత్నించినా గాని) — వారు మాట్లాడే పలుకులు, బాహ్య చిహ్నాలతో ఎవరైతే విశ్వాసాన్ని వ్యక్తీకరించరో- వారందరినీ శత్రువులుగా చూస్తారు; ఇది సహజంగా అంతే; మొట్టమొదటిగా ‘నువ్వు అబద్దం లో ఉన్నావు. నేను చెప్పేది సత్యం’ అని ఒక మనిషి ఇంకొక మనిషికి గట్టిగా చెప్పడం అనేది చాలా క్రూరమైన విషయం; రెండో విషయం — తన సంతానాన్ని, సోదరులని ప్రేమించే మనిషి, వారిని తప్పుదోవ పట్టించే అబద్ధపు విశ్వాసాన్ని శత్రువుగా చూస్తాడు. తత్వశాస్త్రం (మతం) లో అపారమైన జ్ఞానం ఉన్న మనిషికి ఆ  జ్ఞానంతో పాటు శత్రుత్వం కూడా పెరుగుతుంది. ప్రేమతో ఐక్యమయ్యేదే సత్యమని నమ్మే నాలాంటి వాడికి ఆ ప్రేమను కల్పించకుండా తత్వశాస్త్రం నాశనం చేస్తోందని అర్థమైంది.

Also read: జీవిత అవగాహన అసత్యం కాదు

                వివిధ మతాలు ప్రబోధింపబడే దేశాల్లో నివసించే మాలాంటి చదువుకున్న వారికి ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసింది. విద్వేషం, అధికారం, జయించలేని వైరుధ్యాలతో — కాథలిక్కులు సనాతన గ్రీకులతోను, ప్రొటెస్టెంట్లతోనూ ఎలా ప్రవర్తించేవారో మాకు తెలుసు. అలాగే సనాతనులు కాధొలిక్కులతోనూ , ప్రొటెస్టెంట్లు వారిద్దరితోను ఇలాగే ప్రవర్తించేవారు.

అలాగే పాతవిశ్వాసులు, రష్యా ఇవాంజెలికల్సు, షేకర్సు ఇంకా అన్ని మతాలలో — ప్రలోభం స్పష్టంగా కనబడటం మనల్ని తికమకకు గురిచేస్తుంది. మనకి మనం చెప్పుకుంటాం: ఇద్దరు చెప్పే విషయాలు పరస్పర వైరుధ్యంతో ఉన్నప్పుడు, విశ్వాసానికి అవసరమైన పూర్తి సత్యం ఏ ఒక్క దానిలో ఉండదనే సామాన్యమైన విషయం ప్రజలకు ఎందుకు కనిపించదో అర్థం చేసుకోలేను. ఇక్కడ ఇంకేదో ఉంది, ఏదో వివరణ ఉండి తీరాలి. ఆ వివరణ ఉందనుకొని, దానికోసం నేను చదవగలిగినదంతా చదివాను, సంప్రదించగలిగిన వారందరినీ సంప్రదించాను. నాకు ఎవరూ ఏ వివరణా ఇవ్వలేదు. అన్ని నమ్మకాల మతాధికారులు నమ్మేది ఏమిటంటే, వారు నమ్మేదే సత్యం మిగిలిన వారు తప్పు భావనలో ఉన్నారు, వారికోసం ప్రార్ధించడం మాత్రమే చేయగలం అని — ఇదే నాకు చెప్పారు. నేను వివిధ రకాల నమ్మకాలవారిని కలిసి అడిగాను; ఎవరూ నాకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. ఒక వ్యక్తి మాత్రం నాకు మొత్తం వివరించాడు — ఎలా వివరించాడంటే, నేను ఇంకెవరినీ దాని గురించి అడగలేదు. విశ్వాసిగా మారే ప్రతి అవిశ్వాసికి (మన యువత అలా మారవచ్చు) వచ్చే మొదటి ప్రశ్న, సత్యము లుధేరనిజం లేదా క్యాథలిసిజం లో లేకుండా సనాతనంలోనే ఎందుకు ఉంది? వారి చదువు వలన శ్రామిక జనులకు తెలియనిది వీరికి తెలిసేది ఏమిటంటే, ప్రొటెస్టెంట్లు, కేథోలిక్కులు వారి నమ్మకమే నిజమైనదని నమ్ముతారని. చరిత్రలో రుజువులు ప్రతీ మతం దానికి అనుకూలంగా వక్రీకరించినా, అది సరిపోదు. బోధనలని ఉన్నతంగా అర్థం చేసుకుంటే, ఆ ఉన్నతమైన ఆలోచనతో నిజమైన విశ్వాసులకు జరిగేటట్లు, వైరుధ్యాలు కరిగిపోవడం సాధ్యమే కదా! అని అనుకున్నాను. పాత విశ్వాసులతో మనం అనుసరించే మార్గంలో మనం ముందుకు వెళ్లలేమా? వారు — వారి సిలువ, భజనలు, అల్టారు చుట్టూ ఊరేగింపు భిన్నంగా ఉంటాయని నొక్కి చెబుతారు. మన సమాధానం: మీరు నైసీన్ క్రీడ్ ను, ఏడు మతకర్మలను నమ్ముతారు, మేము కూడా అంతే. అవి ఉంచుకొని, ఇతర విషయాలలో మీకు నచ్చినట్లుగా చేయండి. అనవసర విషయాలను వదిలి విశ్వాసానికి అవసరమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చి, మనం వారితో కలిసాం. ఇప్పుడు మనం క్యాథలిక్కులతో — మీరు ముఖ్యమైన ఈ, ఈ విషయాలు నమ్ముతున్నారు. ఫిలియోక్ క్లాజు, పోప్ ల విషయంలో మీకు నచ్చింది చేయండి — అనలేమా? ఇదే మాట — ప్రొటెస్టెంట్లతో కూడా  అతి  ముఖ్యమైన వాటిలో  వారితో కలియలేమా?

                          నేను సంభాషించిన మనిషి నా ఆలోచనలతో అంగీకరించాడు, కానీ అటువంటి ఆలోచనలు, మన పూర్వీకుల విశ్వాసాలను వదిలివేసినందుకు ఆధ్యాత్మిక అధికారులపై నింద వేయబడుతుందని, ఇది విభేదాలు కలగజేస్తుందని చెప్పాడు; ఆధ్యాత్మిక అధికారుల వృత్తి ఏమిటంటే — మన పూర్వీకుల నుంచి సంక్రమించిన గ్రీకో- రష్యన్ సనాతన విశ్వాసాన్ని, దాని పవిత్రతను కాపాడటం.

Also read: దైవంకోసం వెతుకులాట

                    నాకు అంతా అర్థమైంది. నేను విశ్వాసాన్ని, జీవశక్తిని కోరుతున్నాను; వారు ప్రజల దృష్టిలో కొన్ని మానవ బాధ్యతలను ఎలా సరిగా నిర్వహించాలా — అని చూస్తున్నారు. ఇంకా, ఈ మానవ విషయాలను వారు మానవ మార్గంలోనే నెరవేరుస్తారు. తప్పు చేస్తున్న సోదర ప్రజల గురించి, వారి పై కరుణ గురించి, దేవునికి వారి కోసం చేసే ప్రార్థనల గురించి వారు ఎంత మాట్లాడినా — మానవ లక్ష్యాలు నెరవేర్చడం కోసం హింస తప్పనిసరి, అది ఎప్పుడూ అనుసరించబడింది, పడుతోంది, పడుతుంది కూడా. రెండు మతాల్లోని ఇద్దరు — వారిదే నిజం, రెండవ వారిదే అబద్ధం అని అనుకుంటే, ఇతరులను తమ సత్యం వైపు ఆకర్షించడానికి వారి సిద్ధాంతాలను బోధిస్తారు. అనుభవం లేని చర్చి బిడ్డలకు, ఎవరైనా సత్యం పేరుతో తప్పుడు బోధనలు చేస్తే, చర్చికి ఆ పుస్తకాలను తగలబెట్టి, ఆ మనిషిని తప్పించడం చేయక తప్పదు. జీవితంలో అతి ముఖ్యమైనదైన విశ్వాసంలో చర్చి బిడ్డలను తప్పుదారి పట్టించే వారిని — తప్పుడు సిద్ధాంతాల అగ్నిలో కాల్చాలని సనాతనుల అభిప్రాయం. వారి శిరస్సు ఖండించడమో లేదా బంధించడమో తప్ప ఏమి చేయగలము? జార్ పరిపాలనలో, ఆ రోజులలో అతి కఠినమైన అగ్నిలో కాల్చడం ద్వారా ప్రజలు శిక్షింపబడ్డారు. మన రోజుల్లో కూడా కఠినాతి కఠినమైన ఏకాంత వాసనిర్బంధం అమలు చేయబడుతోంది.

                     జీవిత ప్రశ్నతో చర్చి రెండవ సంబంధం — యుద్ధము మరియు హత్యాకాండల గురించి.

                     అప్పుడు రష్యా యుద్ధంలో ఉంది. క్రీస్తు ప్రేమ పేరుతో రష్యన్లు తోటి మనుషులను చంపడం మొదలుపెట్టారు. దీనంతటి గురించి ఆలోచించి, ఏ విశ్వాసం యొక్క ప్రాథమిక సూత్రాలైనా హింసకాండను అసహ్యించుకుంటాయని అనుకోకుండా ఉండడం అసాధ్యం. అయినా కూడా చర్చిల్లో మన సైన్యాల విజయం కోసం ప్రార్థనలు చేయబడ్డాయి. మత బోధకులు చంపడం అనేది విశ్వాసం నుండి వచ్చే ఫలితం అని చెప్పారు. యుద్ధ సమయంలో హత్యలే కాకుండా, యుద్ధం తర్వాత జరిగే అల్లర్లలో చర్చి అధికారులు, చిన్న మరియు కఠినమైన తెగల బోధకులు, సాధువులు — నిస్సహాయులైన, తప్పు చేసిన యువతని చంపడం సమర్ధించారు. క్రిస్టియానిటీ ని ప్రకటించే వారు చేసే అన్ని పనులు నాకు చాలా భయానకంగా అనిపించాయి.

Also read: అనర్థం, అరిష్టం మనిషి జీవితం!

                 ———— ——————-

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles