- 15 నెలల తర్వాత సూపర్ సెంచరీ
- చెపాక్ లో ఎట్టకేలకు టెస్టు శతకం
- స్వదేశీగడ్డపైన సప్తశతకాల హిట్ మాన్
భారత క్రికెట్ హిట్ మాన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విమర్శకులకు తనదైన శైలిలో భారీశతకంతోనే సమాధానం చెప్పాడు. తన కెరియర్ లో ఎట్టకేలకు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా టెస్టు సెంచరీ నమోదు చేశాడు.
15 నెలల తర్వాత శతకం :
క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన అతికొద్దిమంది భారత క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నరోహిత్ చెన్నై వేదికగా ఇంగ్లండ్ తో ప్రారంభమైన డూ ఆర్ డై టెస్టులో రోహిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని చెపాక్ పిచ్ పైన పరుగుల మోత మోగించాడు. యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే డకౌట్ గా వెనుదిరగడంతో జట్టుకు మంచి స్కోరు అందించే బాధ్యతను తనపైనే వేసుకొన్నాడు. వన్ డౌన్ పూజారాతో కలసి రెండో వికెట్‌కు దూకుడుగా ఆడి 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. నయావాల్ పూజారా, కెప్టెన్ కొహ్లీ ఒకరి తర్వాత ఒకరు అవుటైనా రోహిత్ సంయమనంతో బ్యాటింగ్ కొనసాగించాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో కట్, స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో రోహిత్ శర్మ దూకుడు పెంచాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం తుదిజాబితా సిద్ధం
128 బాల్స్ లోనే
రోహిత్ కేవలం 128 బంతుల్లోనే 14 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 100 పరుగుల మైలురాయిని చేరాడు. వన్డేల్లో మాదిరిగా ధాటిగా ఆడిన రోహిత్ కు టెస్టు కెరియర్ లో ఇది ఏడవ సెంచరీ కాగా 15 నెలల విరామం తర్వాత సాధించిన తొలి టెస్టు శతకంగా రికార్డుల్లో నమోదయ్యింది. అంతేకాదు ఇప్పటి వరకూ సాధించిన ఏడు శతకాలు స్వదేశీ గడ్డపైనే సాధించినవే కావడం విశేషం. 2019 అక్టోబర్‌లో రాంచీలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన చివరి సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా రోహిత్ 212 పరుగుల ద్విశతకం బాదాడు.
రెండో టెస్టుకు ముందు ఆసీస్ పర్యటనలోనూ రోహిత్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. ఆస్ట్ర్రేలియా సిరీస్ లోని చివరి రెండుటెస్టులు మాత్రమే ఆడిన రోహిత్ వరుసగా 26,52, 44,7 స్కోర్లకు అవుటయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ 6,12 పరుగులు స్కోర్లకే వెనుదిరిగాడు. గత మూడు టెస్టులు కలిసి 24 సగటుతో 147 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ ను తప్పించి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను చేర్చుకోవాలంటూ విమర్శలు వచ్చిన తరుణంలోనే రోహిత్ 161 పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. రోహిత్ మొత్తం 231 బాల్స్ ఎదుర్కొని 18 బౌండ్రీలు, 2 సిక్సర్లతో భారీశతకం సాధించడం విశేషం.
క్రికెట్ చరిత్రలో 150కి పైగా స్కోర్లతో భారీశతకాలు బాదడంలో రోహిత్ తర్వాతే ఎవరైనా అని మరోసారి చెపాక్ ఇన్నింగ్స్ తేలిపోయింది. ప్రస్తుత చెన్నైటెస్టు తొలిఇన్నింగ్స్ వరకూ తన కెరియర్ లో 36 టెస్టులు 60 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 7 శతకాలు, 11 అర్థశతకాలతో సహా 2400కు పైగా పరుగులు సాధించాడు.
ఇదీ చదవండి: చెపాక్ లో రోహిత్ షో