- గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల మోహరింపు
- రంగంలోకి సర్పంచ్ లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు
- ప్రచారంతో పాటు పంపకాలకు మందస్తు ఏర్పాట్లు
- లాడ్జీలు దొరకక నేతలకు ఇబ్బందులు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. మహా నగర ఎన్నికల్లో బస్తీలన్నీ ప్రచారంతో హోరెత్తుతున్నాయి. పోలింగ్ కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో పార్టీలన్నీ బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. బూత్ స్థాయిలో ప్రతి ఓటునూ దక్కించుకునేందుకు ఆయా పార్టీలు నగరం చుట్టు పక్కల ఉన్న జిల్లాల నుంచి తమ కేడర్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో మోహరించాయి. మండలాలు, పంచాయతీల ప్రతినిధులను రంగంలోకి దింపాయి.
ఎంపీటీసీ, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు
జీహెచ్ఎంసీ పరిథిలో గల 24 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన నియోజక వర్గాలకు చెందిన పలుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులు క్షేత్ర స్థాయిలో భారీ సంఖ్యలో పనిచేస్తున్నారు. ఏ డివిజన్ పరిథిలో చూసినా, ఏ కాలనీలో చూసినా ఇతర జిల్లాలకు చెందిన కొత్త కొత్త నాయకులు కనిపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జికి కలిపి 90 నుంచి 100 పోలింగ్ బూత్ ల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అతిజాగ్రత్తగా బూత్ స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయి నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఓటరు మనసు మారితే కష్టమే
చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేసినా, కరోనాను సైతం లెక్క చేయకుండా ఓటర్లను కౌగిలించుకుని మరీ ఓట్లు అడిగారు. అయితే ఓటరును పోలింగ్ బూత్ వరకు సానుకూల వైఖరితో రప్పించిన పార్టీదే అంతిమ విజయం. ఓటు వేసే వరకూ ఓటరు మనసు మారకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అపుడే పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లవుతుంది. ఓటరును ప్రలోభాలకు గురికాకుండా ఒక్కో బూత్ కు ఒక ఎంపీటీసీని గాని ఒక సర్పంచికి గాని బాధ్యతలు అప్పగిస్తున్నారు. నలుగురు గ్రామ పంచాయతీ పురపాలక సంఘాల వార్డు సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ కమిటీలు వేశారు.
ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు
పది బూత్ లకు ఒక నాయకుడిని నియమించి బాధ్యతలు అప్పగించారు. వీరందరి పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్యే గాని నియోజకవర్గ ఇంఛార్జి గాని చూసుకుంటారు. స్థానిక కమిటీలు పూర్తిగా పనిచేయకపోయినా, ప్రత్యర్థి నాయకుల వలలో పడినా ఇతర ప్రాంత కార్యకర్తల నిఘా, ప్రచారం కలిసి వస్తాయనేది పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. అనుమానస్పదంగా ఉన్న డివిజన్ల బాధ్యతలను ఆయా పార్టీలకు చెందిన క్రియాశీలక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు అప్పగించారు. వీరికి తోడు పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన శ్రేణులను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. స్థానిక బూత్ కమిటీలకు అదనంగా 50 బూత్ లకు ఒకటి చొప్పున ఇతర ప్రాంత నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకుంది.
పంచేందుకు తాయిలాలు రెడీ
స్థానికేతర బృందాలతో ఓటర్లకు ముందుగానే తాయిలాలు పంచేందుకు నియోజకవర్గ ఇంఛార్జులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరు గుట్టుచప్పుడు కాకుండా ఆయా డివిజన్లలోని ఓటర్లకు తాయిలాలు పంచనున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. రెండు రోజులపాటు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించడంతో ముందుగానే మద్యం షాపుల వద్ద భారీగా జనం క్యూ కడుతున్నారు.
నేతలకు దొరకని లాడ్జీలు
ఎన్నికల్లో బాధ్యతలు నిర్వర్తించేందుకు గాను జిల్లాల నుండి వస్తున్న నాయకులతో లాడ్జీలు ఫుల్ అయినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాల్లో చిన్న, చిన్నలాడ్జీలలో కూడా గదులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపు వంటి పార్టీలు జిల్లాల నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాయి. వారు నగరంలో ఉండేందుకు లాడ్జీలను ముందు బుక్ చేశారు. తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలను కూడా అప్పగించాయి. దీంతో జిల్లాలకు చెందిన నాయకులు గత కొన్ని రోజులుగా నగరంలోనే తిష్ట వేశారు. జిల్లాలో ఉండే నాయకులతో పాటు వాళ్ల అనుచరులు కూడా నగరానికి చేరుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్న నాంపల్లి, కాచిగూడ, సికిందరాబాద్ రైల్వేస్టేషన్ లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.