సంపద సృష్టిద్దాం 20
ఎక్కడా బహుళ అంతస్తుల మేడలాగా, ఒక పలుగదుల ఇంటి మాదిరిగా కనిపించక పోయినప్పటికీ మన మెదడు పనితీరులో కొన్ని భాగాలుగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక శాస్త్రవేత్తలు మెదడును మూడు భాగాలుగా గుర్తించారు. బాహ్య చేతన (కాన్షస్ మైండ్), అంతశ్చేతన (సబ్ కాన్షస్ మైండ్), సుప్త చేతన (అన్ కాన్షస్ మైండ్) అనే భాగాలుగా విభజించినప్పటికీ అదెక్కడా కనిపించదు. దాని పనితీరును బట్టే ఈ వింగడింపు. మనం ఈ ప్రపంచంలో వినేవి, చూసేవి, మాట్లాడేవి, చదివేవి, తెలుసుకునేవి, విశ్లేషించేవి అంతా బాహ్య చేతన కిందకు వస్తుంది. మనం నిద్రపోయాక జరిగేదంతా సుప్తచేతనలో జరుగుతుంది. మన కలలు ఆ కోవలోకి వస్తాయి. నిద్రకూ మెలకువకు మధ్య బోర్డర్ లైన్‌లా ఉండేది అంతశ్చేతన. అది చాలా శక్తిమంతమైనదని శాస్త్రవేత్తలు సైతం నమ్ముతారు.
Also read: కాపీక్యాట్ మార్కెటింగ్
టైం మనీ ట్రాప్
ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటి గురించి విపులంగా వివరించాడు. సముద్రంలో వేలాడుతూ కనిపించే ఐస్‌బర్గ్ లో మనకు బయటకు కనిపించేది 20 శాతం మాత్రమే నీటిలో మునిగివుండి మనకు కనిపించని 80 శాతం అసలు ఐస్‌బర్గ్. ఈ ఉదాహరణను చాలాసార్లు తన రచనలలో ఫ్రాయిడ్ ప్రస్తావిస్తాడు. అయితే ఆయన చెప్పిన ఇడ్, ఈగో, సూపర్‌ఈగోలు నైతికతకు సంబంధించినవి. సంపద సృష్టించాలనుకుంటున్న సాహసవీరులకు కావలసింది అంతశ్చేతనకున్న అసమాన శక్తిసామర్ధ్యాలను తెలుసుకుని దానిని వినియోగించుకోవడం. మన మనసులో కనిపించని ఆ ఎనభై శాతం అంతశ్చేతనను మనం సరిగ్గా వాడుకోవడం ఎలాగో 1963లో జోసెఫ్ మర్ఫీ తన ‘‘మీ అంతశ్చేతనకున్న శక్తి’’ (ది పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షస్ మైండ్) అన్న పుస్తకంలో వివరించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ సబ్జెక్టులో ఇదే అత్యుత్తమైన పుస్తకంగా పరిగణిస్తున్నారు. మనం దేనినైనా ప్రగాఢంగా విశ్వసిస్తే మన అంతశ్చేతన దానిని కొంత కాలానికి వాస్తవరూపంలోకి మారుస్తుంది అనంటాడు ఈ పుస్తకం రాసేనాటికి చర్చిలో పెద్ద ఉద్యోగిగా ఉన్న మర్ఫీ. అయితే మన విశ్వాసాలు వాస్తవాలుగా మారాలంటే మనం కేవలం ఆలోచిస్తే సరిపోదు. వాటిని అదేపనిగా ఊహించుకుంటూ ఉండడం (విజువలైజేషన్), వాటి గురించి అదే పనిగా సానుకూల దృక్పథంతో మాట్లాడుతుండడం (అఫర్మేషన్) వలన అవి వాస్తవంగా మారుతాయని అనేక ఉదాహరణలిస్తాడు.
Also read: పరోక్ష ఆదాయం
ఒక వైద్యునిపట్ల మనకు ప్రగాఢమైన విశ్వాసముంటే ఆయన చక్కెర బిళ్ల ఇచ్చినా జబ్బు నయమైపోవడాన్ని ప్లాసెబో ఎఫెక్ట్ అంటాం. ఈ పుస్తకం సారాంశంగా చెప్పదగిన నాలగవ విషయం ఏమంటే ఇతరుల పట్ల ఆవేదన గాని, ఆందోళన గాని, అసూయ గానీ మనకు ఉండకూడదు. మన గురించి మాత్రమే మనం ఆలోచించాలి. మనకు ఎంత కావాలంటే అంత ఈ విశ్వంలో అందుబాటులో ఉంది. మన పూర్తి ఫోకస్ మనకు కావలసిన దానిపైన మాత్రమే ఉంచాలి. మన జీవితంలో సందిగ్ధ సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ అంతశ్చేతనను సరైన నిర్ణయాలు తీసుకోనివ్వండి. అవి శతశాతం మీకు సంతోషాన్నిస్తాయి. ఒక తోటమాలి మాదిరిగా మన మనసులలో ఏ ఆలోచనల విత్తనాలు మనం నాటుతున్నామో ఆ ఎరుకను నిరంతరం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతశ్చేతనకు ఆలోచించడం రాదు. దానికి వివేచన, విశ్లేషణ శక్తి లేదు. ఆ పని చేయాల్సింది మన బాహ్య చేతన. కాబట్టి, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా బాహ్యచేతనలో చేసుకుంటే అవి యధాతథంగా అంతశ్చేతనలోకి చొరబడతాయి. ‘నేను ఆ ఇల్లు కట్టలేను, ఈ వస్తువు కొనలేను, ఆ కారు కొనలేను, ఈ అప్పు తీర్చలేను, ఆ మనిషిని కలవలేను, ఈ విధంగా చేయలేను’ అని అనుకుంటూ గడిపితే జరిగేది ఖచ్చితంగా ఇదే. చేతనను అనుసరించి, అంతశ్చేతన ఆ ఆజ్ఞలను తీసుకుంటుంది. జీవితమంతా అవి సాధ్యం కాకుండా పోతాయి. అవి అందని ద్రాక్షపళ్లుగా మిగిలిపోతాయి.
Also read: అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం
అడుగు – నమ్ము – పొందు
అందుకే మన నోటినుంచి నెగటివ్ వాక్యాలు రాకూడదు. మనసులో నెగటివ్ ఆలోచనలు చేయకూడదు. దానివల్ల మనకు వ్యక్తిగతంగా చెడే తప్ప ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇది తెలుసుకోక చాలామంది తమ గురించి చాలా అద్భుతంగా ఆలోచిస్తూ విజువలైజ్ చేసుకుంటారు గాని, కాసేపటి తర్వాత ఎదుటివారి గురించి దహించుకుపోతారు. దానితో అంతశ్చేతన స్వభావం, తీరుతెన్నులు మారిపోతాయి. మరీ ముఖ్యంగా పాజిటివ్ ఆలోచనల రిపిటీషన్ చాలా అవసరం. పదేపదే సానుకూల ఆలోచనలు చేస్తుండాలి. నిరంతరాయంగా సానుకూల ఆలోచనల పునశ్చరణ జరగాలి. అందుకే జోసెఫ్ మర్ఫీ చేతన, అంతశ్చేతన జమిలిగా పనిచేస్తాయని వివరిస్తాడు. మనలో అంతర్లీనంగా ఈ సానుకూల ఆలోచనల మార్పు రావాలంటే నిరంతరం మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలని ఆయన సూచిస్తాడు. స్వీయపరిశీలన చేసుకోవాలంటే మౌనాన్ని ఆశ్రయించాలి. ఆ దారి మనల్ని ధ్యానం వద్దకు చేరుస్తుంది. మర్ఫీ చెప్పేదిదే: నీగురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి నువ్వేం అనుకుంటున్నావు? నీవు నమ్మిందే నీకు జరుగుతుంది, అంతే.
Also read: బిజినెస్‌మేన్
సంపద గురించి భావిస్తేనే సంపద సృష్టి జరుగుతుంది. ఎప్పుడూ ఇదే గుర్తుంచుకోవాలి. డబ్బు సంపాదించడంలో ఉండే కష్టం గురించి ఆలోచిస్తే కష్టపడడమే మనకు మిగులుతుంది. డబ్బు గురించి మాత్రమే ఆలోచించడం, డబ్బు అందిన తరువాత మన మారిన జీవనశైలి గురించి ఆలోచించడమే డబ్బును మనవద్దకు చేరుస్తుందని ప్రతిపాదిస్తాడు. అయితే సంపద సృష్టి ఒక స్వార్థపూరిత చర్య కాకూడదంటాడు మర్ఫీ. మనలోని అంతర్గతంగా దాగివున్న కళలను వెలికితీయడానికి, మన జీవన పరమార్ధం తెలుసుకోవడానికి, ఇతరుల విజయంలో మనం కాస్త సహకరించడానికి, పరుల సంక్షేమం కోసం కాస్త వెచ్చించడానికి మన సంపద ఉపయోగపడినప్పుడు మాత్రమే ఆ సంపద పరిపూర్ణతను సంతరించుకుంటుందని హితవు పలుకుతాడు.
తప్పక చేయండి: లూయీస్ హే మనకోసం ప్రత్యేకంగా తయారుచేసిన అఫర్మేషన్స్ వింటున్నారా? ప్రతిరోజూ నిద్ర లేవగానే లేదా పడుకునేటప్పుడు ఒక ఐదు నిమషాలు వింటే చాలు. తెలుగులో అలాంటి అఫర్మేషన్స్ మీరు ఎవరివైనా విన్నారా? వింటే వాటి వివరాలు నాకు వాట్సప్ చేయండి.
Also read: డైరీ రాద్దామా!..
– దుప్పల రవికుమార్