- నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్టే రాజకీయాలలో నీతి ఉంది
- మహారాష్ట్ర కొత్త మంత్రులలో 75 శాతం మందిపైన కేసులు
- ఒక వైపు సంపన్నుల రుణమాఫీలు, మరోవైపు ఉచితాలపై అనుచిత వ్యాఖ్యలు
“అంతా మిధ్య తలంచి చూచిన..” అన్నాడు ఆ మధ్య ఓ మధ్య యుగపు కవి. “కేంద్రం మిధ్య” అని ఎన్టీఆర్ అన్న మాటలు సార్వకాలిక సత్యాలుగా మిగిలిపోయాయి. “ఎన్నికల్లో గెలుపుఓటములు ఒక బ్రహ్మపదార్ధం” అన్నాడు ఓ సీనియర్ పాత్రికేయుడు. ఈ వాక్కులన్నింటికీ చిరంజీవత్వం కలిగించేలా సాగుతున్న ధోరణుల పట్ల బాధ్యత కలిగిన పౌరులు బావురుమంటున్నారు. కోట్లకు పడగలెత్తినవారి కోట్లాది రూపాయల రుణ మాఫీలు, పేదోడిపై పన్నుల మోతలు, అప్పులు చెల్లించలేని బలహీనుడిపై దౌర్జన్యాలు, సంక్షేమ పథకాల మాటున ఓటర్లను అధికారికంగా కొనుక్కుంటూ మళ్ళీ వాళ్ళపైనే పన్నుల రూపంలో వడ్డనలు జరిపే సంస్కృతి సర్వత్రా వ్యాపించిన నేటి కాలం భవిష్యత్తుపై భయాలను రేపుతోంది.
Also read: బాబోయ్ బీహార్!
రాజకీయాలను శాసిస్తున్న అవినితిపరులు
పథకాల రూపంలో అందుతున్న తాయిలాలకు కొందరు బద్ధకస్తులుగా మారిపోతున్న వైనం సమాజాన్ని వెక్కిరిస్తోంది. “ఆల్ ఈజ్ వెల్” అంటున్నారు. అంతా బాగుందంటున్నారు. మరి అంత అవినీతి, అక్రమ సొమ్ము, నేరప్రవృత్తి కలిగిన నేతల రాజకీయ, అధికార భాగస్వామ్యం ఎందుకు పెరుగుతుందో తెలియడం లేదు. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే శివసేన -కాంగ్రెస్ – ఎన్ సీ పీ సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం కూలిపోయింది. ఆ స్థానంలో బిజెపి -షిండే శివసేన సంకీర్ణం కొత్తగా అధికారంలోకి వచ్చింది. మొన్న 9వ తేదీ నాడు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రులలో 75శాతంమందిపై కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ( ఏ డి ఆర్ ) వెల్లడించింది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఆ నాయకులే స్వయంగా వెల్లడించారని ఈ సంస్థ అంటోంది. వీరిలో 65శాతం మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ లో మంత్రులంతా కోటీశ్వరులేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీహార్ లో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా వచ్చిన నివేదికల ఆధారంగా చూస్తే ఎంపికైన శాసనసభాసభ్యుల్లో 68శాతం మంది నేరచరితులని తెలుస్తోంది. వారిలో ఎక్కువమంది తీవ్ర నేరచరిత్ర కలిగినవారే ఉన్నారు. ఇలా చాలా రాష్ట్రాల్లో ఇలాగే ఉన్నాయనే కథనాలు వస్తున్నాయి. రాజకీయ క్షేత్రం నేరచరితులమయమై పోతున్న నేపథ్యంలో, చట్టాలు చేయవలసినవారి నుంచి గొప్ప పాలనను, సంస్కృతిని ఆశించడం హాస్యాస్పదమని అర్థం చేసుకోవాలి. పాలనలో ఎవరున్నా… సీబిఐ, ఈడీ , ఇన్ కం టాక్స్ వంటి వ్యవస్థలను ప్రతీకారాలకు పెద్ద ఆయుధాలుగా మలుస్తున్నారనే విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి తప్ప వేరు మాటలు వినపడడం లేదు. అదే సమయంలో, పన్నులు ఎగవేసి నల్లధనం పోగుచేసేవారి సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోందని ఇన్ కం టాక్స్, మొదలైన సంస్థల దాడుల వేళ బయటపడుతోంది. పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు వచ్చాక కూడా నల్లధనం తీరులో ఏమీ మార్పు రాలేదు. తాజాగా మొన్న గురువారం నాడు మహారాష్ట్రలో పలు సంస్థల నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు 390కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేశారు. భారీ మొత్తంలో నగదు,ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్దస్థాయిలో నోట్ల కట్టలు,కేజీల కొద్దీ బంగారం,వజ్రాలు, ఆస్తి పత్రాలు దొరికిపోయాయి.
Also read: వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు
కుడిఎడమల దగాదగా!
ఇలా ఎందరో పన్ను ఎగవేతదారులు కోట్లను పోగుచేసుకుంటున్నారు. ఎవరో కొందరు దొరుకుతున్నారు, లేదా దొరకబుచ్చుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. దొరకని దొరలే ఎక్కువమంది ఉంటారు. కచ్చితంగా పన్ను కట్టేవారు కేవలం ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కట్టలేక అష్టకష్టాల పాలయ్యేది బలహీనులే.కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే బడాబాబులు రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పెద్ద పదవులు పొందుతూ రక్షణా వలయంలో సురక్షితంగా ఉన్నారు. పెద్దపెద్దవారి పెద్దస్థాయి రుణాలను మాఫీ చేయడం ద్వారా వారు మరింత స్వేచ్ఛను హాయిగా అనుభవిస్తున్నారు.అధికారంలో ఉన్న అవినీతిపరులపై కొరడా ఝళిపించాలి, అక్రమార్కులపై సత్వరమే విచారణ జరిపి శిక్షలు వేయాలి, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనకుండా దూరంగా ఉంచాలని న్యాయమూర్తులు పదే పదే గుర్తుచేస్తున్నా ఆచరణలో ఫలితాలు ఆమడదూరంలో ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల రుణాల మాఫీ వల్ల పెద్దలు మరింత పెద్దలవుతున్నారు, పేదలపై పన్నుల భారం పెరిగిపోతోందన్నది కటికనిజం. పన్నుల విధానాలలోను, చట్టాలలోను ఎన్నో సంస్కరణలు రావాలని మేధావులు చేస్తున్న సూచనలు అరణ్యరోదనలు అవుతున్నాయి. కుడిఎడమల దగాదగా అన్నట్లు మేడిపండు చందంగా ఉన్న వ్యవస్థల మధ్య అంతా మిధ్య తలంచి చూచిన.. అన్న కవి వాక్యాలు అక్షరసత్యాలు. రేపటి పట్ల ఆశావహంగా ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
Also read: మణిపూర్ లో మంటలు రగిల్చిన విద్యార్థులు