రామాయణమ్ – 116
‘‘మహిష రూపములో ఉన్న దుందుభిని తరుముకుంటూ మా అన్న గుహలో ప్రవేశించిన పిదప ,నేను ఒక సంవత్సరము గుహ వద్ద కావలి ఉంటిని.
ఎంతకూ ఆయన తిరిగి రాక పోయేసరికి ఆయన మరణించి ఉండునేమో అని తలచి నేను గుహకు అడ్డముగా ఒక బండ రాయిని ఉంచి మరల కిష్కింధకు తిరిగి వచ్చి రాజ్యమును రుమను ,తారను చేపట్టి పాలించుచుంటిని.
అంత ఒక నాడు మా అన్న సజీవుడై తిరిగి వచ్చి నేను తన రాజ్యమును దురుద్దేశముతో ఆక్రమించుకున్నానని తలచి నన్ను అచటనుండి వెళ్లగొట్టెను.
Also read: వానర వీరులకు దిశానిర్దేశం చేసిన సుగ్రీవుడు, హనుమకు తన గుర్తుగా ఉంగరం ఇచ్చిన రాముడు
వెళ్ళగొట్టి ఊరకుండక నన్ను చంపుటకు ప్రయత్నించగా ఆయన వలన కలిగిన భయముతో నేను అనేక నదులు పర్వతములు, వనములు, ఇది అది అనిలేక అన్ని ప్రదేశములు ప్రాణ భయముతో పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి చివరకు ఋష్యమూకమందు తలదాల్చుకొంటిని.
‘‘అప్పుడు తెలిసినది రామా నాకు భూమండలము మీది ప్రదేశముల వివరములు’’ అని సుగ్రీవుడు వివరముగా ఆ ప్రదేశముల గురించి రామునకు తెలియచేశాడు.
…..
సుగ్రీవునిచేత ఆజ్ఞాపింప బడిన వానరులందరూ వారివారికి నిర్దేశింప బడిన దిక్కులకు వెంటనే పయనమై వెళ్ళిపోయారు.
సరస్సులు, ఉద్యానవనాలు, నదులు, డొంకలూ, చేట్టుచేమలు లేని ప్రదేశాలూ, దుర్గమారణ్యములూ అన్నీ అణువణువూ శోధించారు.
Also read: ఆకాశం నుంచి రాముడి ఎదుట దిగిన వానర సైన్యం
పగలంతా విడివిడిగా జట్లుజట్లుగా మారి అన్వేషణ, రాత్రిపూట సీతాదేవి జాడ దొరకలేదన్న విచారమూ ఈ రెంటి తో నిద్రలేకుండా గడిపారు అందరూ.
ఒక నెలరోజులు గడచునప్పటికి దక్షిణ దిక్కునకు వెళ్ళిన వారు మినహా అందరూ ప్రస్రవణ పర్వతమువద్దకు తిరిగి వచ్చి సుగ్రీవుని కలుసుకొనిరి.
అందరి నోట ఒకటే మాట సీతాదేవిని తామెవ్వరమూ చూడలేదు అని. ఇక అందరి దృష్టి, ఆలోచన, ఆశ ఒకరిమీదనే కేంద్రీకృతమైనది.
ఆయనే వాయుపుత్ర హనుమంతుడు. దక్షినదిక్కున వెదుకగా వెళ్ళిన వాడు.
Also read: రామునికి సుగ్రీవుని పాదాభివందనం
వారంతా కలసి కొండలూ, కోనలు గాలించారు. సీతాదేవి జాడ లేదు.
అడవులు, వనాలు గాలించారు. సీతాదేవి జాడ లేదు.
రాయీ, రప్పా వెదికారు. సీతాదేవి జాడ లేదు.
చెట్టూ పుట్టా వెదికారు. సీతాదేవి జాడ లేదు.
పర్వతాగ్రాలు ,దుర్గమ అరణ్యాలు జల్లెడ పట్టారు. సీతాదేవి జాడ లేదు.
నింగిలో వెదికారు.
నీటిలోకి తొంగిచూసారు.
ఎక్కడా ఆ తల్లి జాడ కానరాలేదు.
Also read: లక్ష్మణుడిని శాంతబరచిన తార
వూటుకూరు జానకిరామారావు