ఫొటో రైటప్: ఇవాన్ పావ్లోస్
సంపద సృష్టిద్దాం-01
సరికొత్త శీర్షిక ప్రారంభం
ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త ప్రయోగాలు చేసి నిరూపించేంత వరకూ మనమిది నమ్మలేక పోయాం. అంతా మన మనసులోనే ఉంటుందని. ఒక కుక్కకు ప్రత్యేక సమయంలో గంట కొట్టి ఆహారం పెట్టినప్పుడు దానిలో జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యేవి. సమయం మార్చి గంట కొట్టినప్పుడల్లా జీర్ణరసాలు ఉత్పత్తి కావడాన్ని అతడు ప్రయత్నపూర్వకంగా మార్చగలిగాడు. అంటే నియంత్రించ గలిగాడన్న మాట. శరీరంలో అలవాటు ప్రకారం భోజన వేళల్లో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. అంటే ఒక రకమైన కండిషనింగ్ జరుగుతుందన్న మాట. దానిని ప్రయత్నంతో మార్చగలమని ఈ 21వ శతాబ్దంలో ఇప్పటికి కూడా కొందరు నమ్మలేక పోతున్నారు.
మనం పుట్టకముందే మన గురించి, మన జీవిత విధానం గురించి కొన్ని ‘సిద్ధాంతాలు’ సృష్టించబడ్డాయి. మనం పుట్టిన నాటినుంచి గిట్టిన రోజు వరకూ అవి మనల్ని నియంత్రిస్తుంటాయి. అలాంటి ఒకానొక ప్రికండిషనింగ్ – డబ్బు గురించి
వ్యాప్తిలో ఉంది. ‘కుక్కను తంతే డబ్బులు వస్తాయి’ అని అన్నవాడు కుక్కను తంతే అది కరిచే ప్రమాదం ఉంది గాని, పైసలు రాలవు. ‘డబ్బు ముఖ్యమే కాని, డబ్బుకంటే కూడా ముఖ్యమైనవి ఉన్నాయి’ అన్న మనుషులకు కూడా డబ్బు లేనిదే కథ నడవదు. డబ్బు గురించిన సమస్త భ్రమలను పటాపంచలు చేసి ప్రతి ఒక్కరూ సులువుగా డబ్బు సంపాదించడానికి సమాయత్తం చేయడమే ఈ శీర్షిక ఉద్దేశం. సంపద సృష్టించాలనుకున్న సాహసవీరుల కోసం ఈ సిరీస్. పావ్లోవ్ తన ప్రయోగశాలలో గొప్ప ప్రయత్నం చేసి మనసును రీవైరింగ్ చేసి, తరతరాలుగా నడుస్తున్న గాథను మార్చేసినట్లే, అకుంఠిత దీక్షతో సంపద సమకూర్చుకోవాలని ఆలోచించే సాహసవీరులకు ఇక్కడ సరైన మార్గం దొరికినట్లే.
గతం గురించిన చింతను వీడండి
ఒంటె కథ మీకు తెలుసు కదా. తెలియని వారికోసం చెప్తాను. కొందరు కుటుంబ సమేతంగా ఎడారిలో ప్రయాణం చేయదలచి, లగేజి మోయడానికి, కొన్ని ఒంటెలను అద్దెకు తీసుకున్నారు. మొదటి రోజు రాత్రికి గుడారాలు ఏర్పాటుచేసి, ఒంటెలు పారిపోకుండా, కర్రలు పాతి ఒంటెలను కట్టారు. కాని, చివరకు ఒక ఒంటెను కట్టడానికి తాడు సరిపోలేదు. ఒంటె రాత్రిపూట ఎటైనా పోతే, డబ్బులు చెల్లించాల్సి వస్తుందని బాగా ఆలోచించి ఆ కుటుంబ పెద్ద దగ్గర్లోని ఊరికి వెళ్లి తాడు కోసం ప్రయత్నించాడు. ఎడారివాసి ఇచ్చిన సలహాకు కుటుంబ పెద్ద నివ్వెరపోయాడు. ఆయన చెప్పినట్టే – కర్రను పాతినట్టు, ఆ ఒంటె మెడచుట్టూ తాడు తిప్పి ఆ కర్రకు కట్టినట్టు నటించి, భయంభయంగానే పడుకున్నాడు. తెల్లవారి లేచి చూస్తే, కట్టిన చోటనే ఒంటెను చూసి ఆశ్చర్యపోయాడు. కట్టిన ఒంటెలన్నింటిని విడిపించినప్పుడు అవన్నీ ప్రయాణం మొదలు పెట్టాయి, గాని ఈ ఒంటె మాత్రం కదలకు మెదలక నిల్చోవడంతో బిత్తరపోయాడు. ఎంత అదిలించినా, ప్రయత్నించినా ఒంటె కదలకపోవడంతో ఆ కుటుంబ పెద్ద మళ్లీ ఆ గ్రామస్తుడి సాయాన్ని కోరుతాడు. అప్పుడాయన దాని కట్లు విప్పారా అని ప్రశ్నిస్తాడు. అసలు కట్టనప్పుడు, ఎలా విప్పగలుగుతామండీ అని కుటుంబ పెద్ద బదులిస్తాడు. దానికాయన నవ్వి, విప్పుతున్నట్టు నటించండి, అంటాడు. కుటుంబ పెద్ద తిరిగివచ్చి ఆ ఒంటె కట్లు విప్పుతున్నట్లు, పాతిన కర్రను బయటకు తీస్తున్నట్టు నటించినాక ఒంటె కదిలి తన గుంపును చేరుకుంటుంది.
మనల్ని కూడా మన సమాజం ఇలాంటి పలుపుతాళ్లతోనే కట్టేసింది. అవి ఎవరికీ కనిపించవు. విచిత్రంగా కట్టినవారు కూడా కనిపించరు. తాడూ లేదు, మనిషీ లేడు. కాని మన ఆలోచనల్లోనే మనం బందీలుగా ఉన్నాం. ఆ పరిమితిలోనే మన ఆలోచనలు సాగుతాయి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆలోచనలలో బందీలుగా ఉండిపోయిన మనం, వాటిని తెంపుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాలి. ఆలోచనల బంధనాలు తెంచుకోవడానికి చాలా ప్రయత్నం జరగాలి.
అడుగు – నమ్ము – పొందు
మీరు మధ్యతరగతిలో పుడితే – చివరికి మరణించేంత వరకూ మధ్య తరగతిలోనే ఉండిపోవాలని అనుకోవడం అలాంటిదే. ఎంత ప్రయత్నించినా మధ్య తరగతి స్థాయిని దాటలేమనే ఆలోచనతో ఉంటే ఏమవుతుంది? మధ్యతరగతే గతి అవుతుంది. ఆలోచనను మార్చండి. అన్నీ ఆలోచనతోనే ప్రారంభం అవుతాయి. బలంగా ముద్రపడిన తప్పుడు ఆలోచనలను చెరిపేసి, సరైన ఆలోచనలు ఒక్కొక్కటిగా పేర్చుకోవడానికి, తలరాతను మార్చుకోవడానికి గొప్ప ప్రయత్నం జరగాలి. బలంగా నమ్మమని గట్టిగా మీ హృదయాన్ని కోరాలి. మనసూ బుద్దీ నమ్మేవరకూ చెప్తూనే ఉండాలి. అదే అదే పదే పదే. మీ అంతశ్చేతన మనసును చేరేవరకు చెప్తూనే ఉండాలి. సబ్ కాన్షస్ మైండుకు చేరిన వెంటనే మన ఆలోచనలు మారిపోతాయి.
మీరు కృత్రిమ సంకెళ్ల నడుమ బందీలుగా ఉన్నామన్న నిజాన్ని గుర్తిస్తే చాలు. వాటిని తెంచుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఎవరైనా సంపదను సృష్టించవచ్చు. దానికి తెలివితేటలు అక్కర్లేదు. కండలు పిండిచేసే శ్రమ చేయనవసరం లేదు. గొప్ప కుటుంబంలో పుట్టనవసరం లేదు. పెద్దపెద్ద చదువులు చదవాల్సిన పనే లేదు. కేవలం ఆలోచనలతోనే మీరు సంపదను సృష్టించగలుగుతారు. దానికి కావలసిందల్లా ఒక్కటే. సంపద సృష్టించాలనే కోరిక.
తప్పక చేయండి: ఊరుదాటి బయటికి ఎక్కడికి వెళ్లినా, తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి రాకండి. ఏదైనా కొని ఇంటికి పట్టుకెళ్లండి. చివరికి రూపాయి నిమ్మకాయ అయినా.
(మళ్ళీ వచ్చే గురువారం)
–దుప్పల రవికుమార్