Sunday, December 22, 2024

అజరామర అక్షరాగ్ని శిఖరం, అఖండమైన ప్రజా కవిత్వం అలిశెట్టి ప్రభాకర్!

అలిశెట్టి ప్రభాకర్. పేరు కాదిది, తెలుగు కవిత్వంలో పెల్లుబికిన అగ్ని శిఖరం. ఒకతరం యువతరం గుండెల్లో లావాలా ఎగసిన అక్షరాల నిత్యాగ్నిగుండం. పీడితులు, బాధితుల పక్షాన నిలవడమే కలం కర్తవ్యమని తెగేసి నిర్దేశించిన నిఖార్సైన కలం ఖడ్గం. అభాగ్యజీవులకి తోడుండేదే నిజమైన అక్షరమని పిలుపిచ్చిన తిరుగులేని నిరసన గళం, ఇవన్నీ వెరసి అలిశెట్టి ప్రభాకర్. విలక్షణ కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్, భావోద్యమశీలి, తాత్వికుడు, స్వాప్నికుడు అన్నీ. భాష పై బహుశా మరే కవికీ లేనంత బలమైన పట్టు. భావాల సుడిగుండాల్లో తనకంటూ స్పష్టమైన కసరత్తు. ఇక అభివ్యక్తి మాటకొస్తే అలిశెట్టి దరిదాపుల్లోకి వచ్చే కవుల్ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఎవరూ అనక్కర్లేదు కానీ అలిశెట్టి అక్షరాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిన మహాకవి! ఎవరూ ఒప్పుకోనవసరం లేదు కానీ అలిశెట్టి కవిత్వానికి కవాతు నేర్పిన యుగకవి!

Also read: జీవితం మంచి కోసం వెచ్చించడమే మతం: శాస్త్రీయ, హేతువాద, సామ్యవాది వివేకానందుడు

“నా గుప్పెట్లో మండుతున్న ఎన్నో గుండెలు/ ఒక్కొక్కదాన్లో దూరి, వాట్ని చీరి, రక్తాశ్రువులు ఏరి పరిశీలిస్తాను నేను” అంటూ ‘నా కవిత’ లో ప్రకటించుకున్న ప్రభాకర్, “నను తొలిచే బాధల ఉలే నను మలిచే కవితా శిల్పం” అంటూ తాను ఎవరి పక్షమో బల్లగుద్ది మరీ చెప్పుకున్న కవితా సైనికుడు. తెలుగు కవిత్వంలో పీడితుల వైపు నిలబడి అత్యంత పదాల పొదుపుతో అదుపు లేని అక్షరాగ్నిని దశాబ్దాల పాటు నిరవధికంగా కురిపించిన అద్వితీయ కవిత్వం అలిశెట్టిది. అందుకే, “దేశాన్ని పోగొట్టుకున్న గర్భ శోకం నుంచే మళ్ళీ నేనొక వీరుణ్ని కలగనాలి/ దిక్కులు కూలిన దుఃఖం నుంచే/ దిగంతాల అంచులు దొరకని ఆక్రోశం నుంచే/ మళ్ళీ మళ్ళీ కుప్పకూలిపోతున్న మరణశయ్యమీంచే, నన్ను నేను ఆయుధంగా మలుచుకోవాలి/ శరీరం శిథిలాయుధమైనా/యోధుడిగా మును ముందుకే కదిలి/కదనరంగాన్ని వశ పర్చుకోవాలి” అని తిరుగులేని విశ్వాసాన్ని భావోద్రేకంతో వెలువరిస్తాడు!

Also read: చీకటి రాత్రులు – వేకువ వెలుగులు

పీడిత ప్రజలవైపు నిలిచిన కవి

తెలుగు కవిత్వంలో వెనకడుగు వేయని ధీమాతో పీడిత ప్రజల వైపు తొలి నుంచీ  నిలిచిన కవి అలిశెట్టి.”కన్నీళ్ళని ఏ భాషలోకి అనువదించినా, విషాదం మూర్తీభవించిన స్త్రీయే సాక్షాత్కరిస్తుంద”ని రాసిన అలిశెట్టి, వేశ్య కవితలో “తను శవమై, ఒకరికి వశమై/ తనువు పుండై, ఒకడికి పండై/ ఎప్పుడూ ఎడారై, ఎందరికో ఒయాసిస్సై” అంటాడు. ప్రపంచంలో ఏ భాషా కవిత్వం లోనూ ఇంతటి సూక్ష్మమైన పదాలతో స్త్రీ హృదయంలోని లోతైన భావ సంఘర్షణను చిత్రించిన కవిత ఇప్పటిదాకా రాలేదనీ, ఇక పై రాబోదని నా అభిప్రాయం. అంతేకాదు,”అన్నం మెతుకునీ, ఆగర్భ శ్రీమంతుడ్నీ వేరు చేస్తే, శ్రమ విలువేదో తేలిపోదూ..?” అన్నప్పుడు ప్రభాకర్ మొత్తం శ్రమ దోపిడీ సారాన్ని ఒక్క వాక్యంలో ఇమిడ్చిన తీరు ఆశ్చర్య పరుస్తుంది. అంతటి ప్రతిభా వంతుడు కనుకనే అతడ్ని కవిత్వ మాంత్రికు డంటారు. నవ్య కవితా వస్తువుని నిర్దేశించిన అలిశెట్టి తాను నమ్మిన దార్శనికతనే కవిత్వంలో ప్రవేశపెట్టి ప్రకంపనలు సృష్టించాడు!

Also read: అభివృద్ధి – ఆదివాసులు – హింస

అచ్చులో వెల్లడైన అక్షరలావా

ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) కవితా సంపుటాలు అంతర్లీనంగా రగులుతున్న అలిశెట్టిలోని అక్షర లావాని అచ్చు రూపంలో వెల్లడించిన కొన్ని పుస్తకాలు మాత్రమే.ఇంకా అచ్చు కానివీ, ఆర్దిక ఇబ్బందులతో, అస్థిరమైన జీవనయానంతో , అనారోగ్యం తో నిత్యం పోరాటం చేస్తూ అలిశెట్టి పోగొట్టుకున్న కవితలకు లెక్కే లేదు. కేవలం కవిగానే గాక, జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్ లో స్టూడియో శిల్పి, హైద్రాబాదులో చిత్రలేఖ స్టూడియోలు పెట్టి జీవిక కోసం జీవన అస్థిత్వం కోసం ఆరాట పడ్డాడు. కళాత్మకమైన జీవన తాత్వికతలోకి కవిత్వాన్ని ప్రవేశపెట్టాడు. బహురూపాల వ్యవస్థ వర్ణాల్ని బతుకు పోరాటంలో దర్శించిన భావుకుడు. కవితా వినీలాకాశం లో చెమటచుక్కల్ని చక్కగా  ఆవిష్కరించిన దార్శనికుడు అలిశెట్టి ప్రభాకర్ !

అందుకే, “లోపభూయిష్టమైన వ్యవస్థే వ్యక్తుల్ని తుపాకులుగా తీర్చిదిద్దుతుందన్న “అలిశెట్టి, “ఉదాసీనంగా ఉండే కన్నీళ్ళే ఉప్పొంగే నదులైనప్పుడు, దండాలు పెట్టే బాంచెన్ బతుకులు దండకారణ్యాలై రగులుకోవా..!” అంటాడు. అంతేకాదు, “ఎన్నికల బరిలో దిగాలో, నక్సల్బరిలో దూకాలో ..క్షణం క్షణం రణం! సందిగ్ధా వస్థలో జనం!!” అంటూ మార్గ నిర్దేశం చేస్తూ,”అడుగంతా తడిసిన కన్నీటి సముద్రం/ ఉపరితలమంతా వెలసిన నెత్తుటి ఆకాశం/మధ్యన వెలిగే మహోజ్వల మానవ నేత్రమే పోరాట సూత్రం..” అని సామాజిక సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తాడు. సాహిత్యం, సామాజికం, సాంస్కృతికం, కళలు, రాజకీయం, సినిమా… ఇలా చెప్పుకుంటూపోతే అలిశెట్టి అక్షర కొరడాతో చాచిపెట్టి కొట్టని ఒక్క వ్యవస్థ కూడా లేదు. అన్యాయలు, అక్రమాలతో అనుదినం దిగజారిపోతున్న సమాజాన్ని తన అవిశ్రాంత అక్షర రణంతో మానవీయం చేయాలని చివరివరకూ తపించినవాడు అలిశెట్టి!

Also read: ‘మతాతీత మానవత్వమే మన మార్గం’

మరణం కాదు నా చివరి చరణం

అందుకే ప్రేమని, విప్లవాన్ని కూడా ప్రేమించాడు. బతుకుని, చావుని సమానంగానే స్వీకరించాడు. ‘మరణం నా చివరి చరణం కాద’ని ధిక్కారం నిండిన గొంతుతో దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించాడు. జయధీర్ తిరుమలరావు, నిజాం వెంకటేశం, బి. నర్సన్ ల సంపాదకత్వంలో 2013లో వెలువడిన అలిశెట్డి ప్రభాకర్ కవిత పుస్తకం ప్రచురించబడి కూడా పదేళ్ళవుతోంది. జయంతి, వర్ధంతులు కూడా ఒకే తేదీన జరుపుకునే (12-1-1954 – 12-1-1993) ఏకైక తెలుగు కవి బహుశా అలిశెట్టేనేమో. తెలుగు కవిత్వంలో అగ్గిని పుట్టించగల అజేయమైన అక్షరాయుధాల్ని సృష్టించి, శ్రమజీవుల ప్రవక్తగా కవిత్వాన్ని నిర్వచించి, పదాల్లో ప్రేమ కురిపించి, వాక్యాలతో మానవతా వారధుల్ని నిర్మించిన అలిశెట్టి కవిత్వాన్ని పాఠ్యాంశాలుగా పెట్టడం, ప్రగతిశీల ప్రజాతంత్ర అభ్యుదయ శక్తులు అలిశెట్టి అక్షరాలకి మరింత విస్తృతి కల్పించి ఎక్కడికక్కడ కవితా పఠనాలు, సంవాదాలు, సమాలోచన సమావేశాలు జరపడం ద్వారా ప్రభాకర్ ని మరింతగా ప్రజానీకంలోనికి తీసుకు వెళ్ళడమే అజరామర నవయుగ కవితాక్షర శిఖరంగా మన తరం అలిశెట్టికి ఇచ్చే నిజమైన ఆత్మీయ నివాళి కాగలదు !

 (2013 లో మొదటిసారి మొదలుకుని 2017 మూడో ముద్రణ వరకూ నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన 362 పుటల అలిశెట్టి కవిత్వం పుస్తకం సాఫ్ట్ కాపీ నెట్ లో అందుబాటులో ఉంది. నా వాట్సప్కి రిక్వెస్ట్ పెట్టినా కూడా  సాఫ్ట్ కాపీ పంపగలను. రేపు జనవరి 12 మహాకవి, ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా, ఆ అజరామర అక్షరయోధుడికి చిరు నివాళిగా చాన్నాళ్ళుగా అనుకుంటున్న ఈ  చిన్న రైటప్!)

Also read: ఒకానొక ప్రస్థానం గురించిన ప్రస్తావన

– గౌరవ్

(అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి జనవరి 12)

   

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles