- భారత దిగ్గజాల దిక్కుతోచని స్థితి
- ఉద్యోగులకు స్వస్తి చెబుతున్న పెద్ద కంపెనీలు
- ఆందోళన కలిగిస్తున్న అమెరికా ఆర్థిక పరిణామాలు
కొన్ని లక్షలమందికి ఉద్యోగాలను, ఉపాధిని కలిపిస్తూ, కోట్లాది కుటుంబాలకు పెద్ద అండగా నిలుస్తున్న గొప్ప పరిశ్రమ ఐటీ. చాలా కుటుంబాల జీవనశైలిలో గొప్ప మార్పును తెచ్చిన అన్నపూర్ణ ఐటీ రంగం. ఇక విదేశాల్లో రాణిస్తున్న వారిలో మనవారిదే పైచేయి. ఈ రంగాన్ని నమ్ముకొనే విద్యారంగంలో సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ పరిశ్రమ ఎంత బాగుంటే ఎందరో జీవితాలు అంత బాగుంటాయి. ఈ నేపథ్యంలో, దేశంలో ఐటీ రంగానికి సంబంధించి ఆర్ధిక తొలి త్రైమాసికాన్ని గమనిస్తే ఆశనిరాశల నీడలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీసీఎస్, హెచ్ సీ ఎల్, విప్రో సంస్థలు మాత్రమే తమ ఫలితాలను విడుదల చేశాయి. ఈ మూడు నెలల్లో ఆర్డర్లు ఆశాజనకంగా ఉన్నాయి. వస్తున్న ఆర్డర్లుకు తగ్గట్టుగా ఆదాయం మలుచుకోడానికి వాతావరణం సంపూర్ణంగా అనుకూలంగా లేదని తెలుస్తోంది. ద్వితీయార్ధంలో రాబోయే పరిణామాలు పట్ల కూడా ఐటీ కంపెనీలు ఆశావహ దృక్పధాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రకటించలేక పోతున్నారు. ఈ మూడు నెలల్లో ఆర్డర్లు బాగా రావడం, అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త దిగివస్తూ వుండడం, ఖాతాదారులు ఐటీ ఖర్చులను పెంచుతారని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఇది ఆశాకిరణం.
Also read: ఎంత బాగుందో చూడు ‘ఈ-కళ్ళజోడు!’
నిరాశ కలిగించిన త్రైమాసిక ఫలితాలు
ఈ ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిలో మందగమనం కొనసాగొచ్చని, ఖాతాదారులు ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లడం, వాయిదా వేయడం మొదలైన పరిణామాలు రావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ త్రైమాసికంలో ఆర్డర్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన ఐటీ కంపెనీలకు కష్టకాలం ఉండదని చెప్పలేమని అంటున్నారు. ఐటీ భవిష్యత్ పై ఐటీ కంపెనీల అధిపతులు, బ్రోకరేజ్ సంస్థలు కూడా సానుకూల వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఐటీ సేవల డిమాండ్ విషయంలోనూ స్పష్టత రావడం లేదు. జీతాలు పెంచడంలోనూ, కొత్త నియామకాలను చేపట్టడంలోనూ, ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నవారికి ఆఫర్ లెటర్స్ పంపడంలోనూ మందగమనమే సాగుతోంది. ఆర్డర్లు పంపించినవారిని సైతం ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం మరో కోణం. ఈ పరిణామాలను బట్టి ప్రస్తుత ఐటీ రంగ ప్రయాణాన్ని అంచనావేయొచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల్లో కోతలు కూడా పెట్టారు. విప్రో, హెచ్ సీ ఎల్ ఉద్యోగుల సంఖ్య 11,300 తగ్గింది. టీసీఎస్ ఎవ్వరినీ తీయకపోయినా, కేవలం 523మందిని మాత్రమే కొత్తగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఎల్ టీ ఐ, మైండ్ ట్రీ వంటి కంపెనీలకు వచ్చే ఫలితాలను బట్టి ఐటీ రంగాన్ని మరికొంత అంచనా వేయవచ్చునని నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా ఈ పరిశ్రమ చల్లగా ఉండాలి.
Also read: అదృష్టవంతుడు