Sunday, December 22, 2024

అల్ ఖాయిదా ఉగ్రదాడికి ఇరవై ఏళ్ళు

  • ఉదారవాదానికి సమాధికట్టిన అగ్రవాదం-ఉగ్రవాదం పోరు
  • ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అభద్రతాభావం
  • తాలిబాన్ అఫ్ఘాన్ విజయం ఉగ్రవాదానికి ఊతం
  • తాలిబాన్ తోనూ, అమెరికాతోనూ సత్సంబంధాలు కొనసాగించిన పాకిస్తాన్

ఈ రోజుకు సరిగ్గా రెండు దశాబ్దాల కిందట అల్ ఖాయిదా ఉగ్రవాదులు ప్రపంచ చరిత్రను ప్రమాదకరమైన మలుపు తిప్పారు. అల్ ఖాయిదా ఆత్మాహుతి దళానికి చెందినవారు నాలుగు అమెరికా ప్రయాణికుల విమానాలను దారి మళ్ళించారు. రెండు విమానాలను న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్)లోని రెండు శిఖరాయమానమైన ఆకాశహర్మ్యాలపై ప్రయోగించారు. ఒక విమానాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ పొలిమేరలలో ఉన్న పెంటగాన్ కార్యాలయంపైన కూల్చారు. నాలుగో విమానంలో ప్రయాణికుల ప్రతిఘటన మూలంగా పెన్సిల్వేనియాలోని ఒక పొలంలో పడిపోయింది. ఎన్నడూ జరగని, ఊహించని ఘటన జరిగింది. ఎదురులేదని అనుకుంటున్న అగ్రరాజ్యంపైన ఇస్లామిస్టు ఉగ్రవాదులు దాడులు జరిపి వేలమందిని చంపివేశారు. ఒక చిన్న దళం తెలివితేటలు లేదా చావుతెలివి ఉపయోగిస్తే అగ్రరాజ్యాన్ని అయినా అతలాకుతలం చేయవచ్చునని నిరూపించిన సందర్భం అది. ప్రంపంచాన్ని నివ్వెరబోయేట్టు, ప్రపంచానికి భీతిగొలిపేటట్టు మెరుపులాగా సంభవించిన ఘటన. అగ్రవాదానికీ, ఉగ్రవాదానికీ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

కాలమేఘం

ఆ క్షణాలలో నేను హైదరాబాద్ లో ‘వార్త‘ పత్రిక సంపాదకుడిగా నా గదిలో కూర్చొని టీవీలో విధ్వంసకర దృశ్యాలు చూస్తూ నిర్ఘాంతపోయాను. ‘ఈ సంక్లిష్ట సమయంలో మా వైపు ఉంటారో, మా శత్రవువైపు ఉంటారో తేల్చుకోండి’ అంటూ నాటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ప్రపంచ దేశాలకు తర్జని చూపిస్తూ అల్టిమేటమ్ ఇవ్వడం చూశాను. రెండు మాసాల వ్యవధిలో అఫ్ఘానిస్తాన్ పైన దాడి ప్రారంభించడం అగ్రరాజ్యం ఉగ్రరూపం చూపించదనడానికి నిదర్శనం. అప్పుడే అల్ ఖాయిదా, ఇస్లామిస్టు ఉగ్రవాదం, అమెరికా, అగ్రరాజ్యం అగ్రవాదం, నాటో దేశాల మద్దతు చర్చనీయాంశాలు అయినాయి. తెలుగు పాఠకులకు సైతం ఆసియా ఖండంలో, అమెరికాలో పరిణామాలు ఆసక్తి కలిగించిన సమయం.  ఆ రోజుల్లో దినపత్రికలలో డైలీ సీరియల్స్ ప్రచురించే పద్ధతి ఉండేది. పేరు పెట్టకుండా డైలీ సీరియల్ రాయడం ప్రారంభించాను. రచయిత ఎవరో తెలియకుండా విషయం పట్ల ఆసక్తికొద్దీ లక్షలమంది పాఠకులు చదివారు. సీరియల్ ముగించే రోజున నేనే రచయితనని పేరు వెల్లడించాను. నవలకు ‘కాలమేఘం’ అని పేరు పెట్టాను. ఎమెస్కో సారథి విజయకుమార్ ఆ నవలను ప్రచురించారు. పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం దానిని ప్రశంసించింది. ప్రస్తావన వచ్చింది కనుక నాలుగు ముక్కలు నా గురించి రాశాను. అంతే.

అమెరికా అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేయడం దుస్సాహసం. అఫ్ఘానిస్తాన్ చరిత్రనూ,  ఆ దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మగౌరవాన్నీ, ఎవ్వరికీ లొంగి ఉండని, ఎవ్వరికీ తలవంచని ధీరత్వాన్నీ, ప్రాణాలను లెక్కచేయని మొండితనాన్నీ అర్థం చేసుకుంటే జూనియర్ బుష్ అంత తెగించేవారు కాదు. అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర నుంచి మొఘలాయి చక్రవర్తులూ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారులూ, సామ్రాజ్య నిర్మాతలూ, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ నియంతలూ అఫ్ఘానిస్తాన్ ని జయించలేకపోయారు. ఇరవై ఏళ్ళు అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకొని, 2.26 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసి, సుమారు 2,500 మంది అమెరికా, నాటో సైనికులను బలి చేసి  అమెరికా సాధించింది  ఏమిటి? అఫ్ఘానిస్తాన్ లో మహిళల హక్కులను పునరుద్ధరించారు. వైద్య, విద్యారంగాలలో వికాసం తీసుకొని వచ్చారు. మహిళల చేత ఉద్యోగాలు చేయించారు. బుర్ఖా వీడని మహిళల చేత లాఠీలు పట్టించారు. తుపాకులు ధరింపజేశారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కుల రుచి చూపించారు. అక్షరాస్యత పెంచారు. ఇవన్నీ చేస్తూనే అమెరికా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న లక్షల డాలర్లు తిరిగి అమెరికా ఆయుధ వ్యాపారులకే, బడాకంపెనీలకే చేరే విధంగా చేశారు. 2.26 ట్రలియన్ల లో 2.02 ట్రిలియన్లు అమెరికా ఆయుధ బేహారులకే చెల్లించారు. అఫ్ఘానిస్తాన్ ప్రజలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆకలితో, దారిద్ర్యంలో అలమటిస్తున్నారు. సగటు అఫ్ఘాన్ పౌరుడు రోజులు రెండు డాలర్ల కంటే తక్కువే తన జీవనానికి ఖర్చు చేస్తున్నాడు.

సర్వత్రా అభద్రతాభావం

న్యూయార్క్ లో రెండు ఆకాశహర్మ్యాలను పేల్చివేసి ఎంతమందిని క్షణాలలో అల్ ఖాయిదా ఉగ్రవాదులు చంపారో, అంతమందినీ పదిహేను, ఇరవై సంవత్సరాలలో తాలిబాన్ ఉగ్రవాదులు అఫ్ఘానిస్తాన్ లో చంపివేశారు. కొన్ని వేలమంది అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వేలమంది తాలిబాన్ హతమైనారు. అమెరికాలో, పాశ్చాత్య దేశాలలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో ఉదారవాదం వెనకంజవేసింది. మితవాదులూ, మతవాదులూ, ఒంటెత్తుపోకడపోయే ఛాందసులూ ముందుపీటీలోకి వచ్చి చేరారు. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దేశం ఎంత పెద్దదైనా, ఎంత ధనికమైనదైనా, ఎంత పెద్ద సైన్యం ఉన్నా,ఎన్ని మారణాయుధాలు ఉన్నా భద్రత లేదని నిరూపించారు. సెప్టెంబర్ 11ను సాకుగా చూపించి అమెరికా విదేశాలపైన యుద్ధాలు చేయడం ప్రారంభించింది. అల్ ఖాయిదా సంహారానికి అఫ్ఘానిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది.  రసాయనిక ఆయుధాలు ఉన్నాయంటూ ఇరాక్ పైన బాంబుల వర్షం కురిపించింది. లిబ్యా జోలికి వెళ్ళి అక్కడ ఎన్టీసీ మిలిటెంట్ల ద్వారా గడాఫీని మట్టికరిపించింది. అరబ్ దేశాలు కూడా సంక్షోభానికి గురి కాకతప్పలేదు. ఈజిప్టులో విప్లవం వచ్చింది. ఆఫ్రికాలో సంక్షోభం చుట్టుముట్టింది. అల్ ఖాయిదా కంటే ఉగ్రమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ (ఇఎస్ఐఎస్) ఉద్భవించింది. అది ముజాహిదీన్ లకంటే, అల్ ఖాయిదా కంటే, తాలిబాన్ కంటే ఉగ్రమైనదనీ, క్రూరమైనదనీ నిరూపించింది. ప్రజాస్వామ్య సంస్థాపనే తమ ధ్యేయం అని చాటుకునే అమెరికా, దాని మిత్రదేశాలు  సౌదీ అరేబియా నుంచి ఈజిప్టు వరకూ నిరంకుశ ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకోవలసి వచ్చింది.

ఈ లోగా లాదెన్ అఫ్ఘానిస్తాన్ లో లేడని మొదట్లోనే తెలిసిపోయింది. తిరిగి పాకిస్తాన్ సహకారంతో పాకిస్తాన్ రాజధాని సమీపంలో ఒసామా బిన్ లాదెన్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పంపిన కమాండోలు చంపివేశాయి. ఆ పని అయిన వెంటనే అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా తప్పుకున్నా ఒక పద్ధతిగా ఉండేది. పాకిస్తాన్ బహుచమత్కారమైన, ప్రమాదభూయిష్టమైన, కత్తిమీద సాముచేసే దౌత్య విన్యాసాలు చేసింది. చేస్తూ ఉంది.  సుమారు లక్షమంది తాలిబాన్ కు ఆతిథ్యం ఇస్తూనే, వారు అమెరికా సైనికులపైన గెరిల్లా పోరాటం సాగించడానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తూనే ఇటు అమెరికా కూడా తనపైన ఆధారపడే విధంగా చేసుకోగలిగింది.

శత్రువుతో రాజీపడిన అమెరికా

ఇంతా చేసి తాలిబాన్ దెబ్బకు తట్టుకోలేక, తాను నియమించిన అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తనపైన దాడులు చేస్తున్న తాలిబాన్ తోనే, దాడులు చేయిస్తున్న పాకిస్తాన్ సహకారంతోనే దోహాలో చర్చలు జరిపింది అమెరికా. ఈ వ్యూహానికి మూలమైన  ట్రంప్ హయాంలోనే తాలిబాన్ కు అఫ్ఘానిస్తాన్ ను అప్పగించి తప్పుకోవడానికి అమెరికా పాలకులు ఒప్పందం కదుర్చుకున్నారు. గందరగోళ పరిస్థితులలో అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా, నాటో సైన్యాలను ఉపసంహరించుకున్నారు. రెండు అగ్రరాజ్యాలుగా ఉన్నప్పుడు వాటిలో ఒక అగ్రరాజ్యమైన సోవియెట్ యూనియన్ నూ, సోవియెట్ యూనియన్ పతనం తర్వాత ఒకే ఒక అగ్రరాజ్యంగా ఏకచ్ఛద్రాధిపత్యం చెలాయిస్తున్న అమెరికానూ ఓడించిన తాలిబాన్ ల ఆత్మవిశ్వాసం హద్దుమీరి తలపొగరుగా కనిపిస్తోంది. రెండు అగ్రరాజ్యాలకు సమాధి కటటిన ఘనత తమదేనని సంబరం చేసుకున్నారు. మళ్ళీ షరియాను మక్కికి మక్కీ అమలు చేస్తామనీ, దిక్కున్న చోట చెప్పుకోమని తాలిబాన్ స్పష్టం చేశారు. ఇరవై సంవత్సరాల కిందట  ఏ షరియా అమలు జరిగిందో అదే షరిగానూ అక్షరాలా అమలు చేస్తారని తాజా అఫ్ఘానిస్తాన్ ఏలిక ముల్లా అబైతుల్లా అఖుండ్ జాదా ప్రకటించారు. మహిళల పరిస్థితీ, హజారాల సంగతీ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి.

లోగడ తాలిబాన్ అధికారంలో ఉన్న 1996-2001 కాలంలో పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకునేందుకు గట్టి ప్రయత్నం కూడా జరగలేదు. ఈ సారి పంజ్ షీర్ ను కూడా స్వాధీనం చేసుకున్న తాలిబాన్ మునుపెన్నడూ లేనంత బలంగా, శక్తిమంతంగా ఉంది. ఇది వరకు తాలాబాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి రెండు మూడు దేశాలు మినహా ఏ పెద్ద దేశమూ గుర్తించలేదు. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యా, ఇరాన్,సౌదీ అరేబియా వంటి అనేక పెద్ద దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇండియా బీష్మించుకొని కూర్చోవలసిన సమయం కాదు. దౌత్యనీతిని ప్రదర్శించాలి. అమెరికా బాటలో నడవడానికి స్వస్తి చెప్పాలి. స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి. తాలిబాన్ ప్రభుత్వంతో వ్యవహారం చేయాలి.

ప్రపంచం నోట నానిన మాట ‘సెప్టెంబర్ 11’

రెండు దశాబ్దాలలో ‘‘సెప్టెంబర్ 11’’ అనే మాటను పాలకులూ, ప్రతిపక్ష నాయకులూ, మీడియా సారధులూ, టీవీల యాంకర్లూ, రాజకీయ పార్టీల ప్రతినిధులూ, వ్యాఖ్యాతలూ కొన్ని లక్షలసార్లు  ఉచ్ఛరించి ఉంటారు. ఆలకించి ఉంటారు. రాసి ఉంటారు. చదివి ఉంటారు. ఆ రోజు చరిత్రను విభజించిన దినం. సెప్టెంబర్ 11 ముందూ, సెప్టెంబర్ 11 తర్వాతా అని చరిత్ర పాఠాలు చెప్పుకోవలసిన పరిస్థతి వచ్చింది. శనివారం ఆ దుర్ఘటనకు ఇరవయ్యో వార్షికం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక విడియో సందేశం అమెరికా పౌరులకోసం విడుదల చేశారు. ఐకమత్యమే మహాబలం అంటూ ఐకమత్యాన్ని ప్రదర్శించవలసిందిగా అమెరికా పౌరులకు బైదన్ విజ్ఞప్తి చేశారు. ‘‘నా మటుకు నాకు అదే సెప్టెంబర్ 11 గుణపాఠం. మనం బలహీనంగా ఉన్న సమయంలో జరిగిన తోపులాటలో మనలను మనుషులుగా నిలబెట్టింది సమైక్యతే. అమెరికా ఐక్యతకోసం పోరాడాలి. ఐకమత్యమే మనకు మహాబలం,’’ అని బైదెన్ అన్నారు.   

‘‘ఒక వైపు ఒసామా బిల్ లాదెన్ ను వేటాడి హతం చేశాం. మరో వైపు న్యూయార్క్ లోని మన్ హాటన్ లో కూలిపోయిన రెండు ఆకాశహర్మ్యాల స్థానంలో బ్రహ్మాండమైన శిఖరాలను నిర్మించుకున్నాం. రెండు వారాల కిందటే చిట్టచివరి అమెరికా సైనికుడు కాబూల్ ని వదిలి అమెరికా వచ్చేశాడు,’’ అని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

ఎక్కడబడితే అక్కడ చిచ్చు

అగ్రవాదానికీ, ఉగ్రవాదానికీ మధ్య పోరు మాత్రమే కాదు, ఉగ్రవాదం ఎక్కడబడితే అక్కడ పోరాటం చేసింది. అగ్రవాదం ఏదేశం మీద పడితే ఆ దేశంపైన దాడి చేసింది. ఉగ్రవాదం లక్ష్యాలలో ఇండియా ప్రధానమైనదే అయినా ఎక్కువ మూల్యం చెల్లించకుండానే ఇంతవరకూ నెట్టుకొచ్చింది. ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకోవడం ఒక కారణమైతే, ఉగ్రవాదంపైన పోరాటం పేరుతో అమెరికా, పాశ్చాత్య దేశాలతో కలసి రంగంలోకి దిగకుండా నిగ్రహించుకోవడం ఒక కారణం. ఇందుకు ఇండియాలో దాదాపు ఇరవై శాతం జనాభా ముస్లింలు కావడం కూడా ఒక కారణం.

తాలిబాన్ విజయం సాధించడం ఇండియాకు శుభవార్త కాదు. మతఛాందసవాదులకూ, ఉగ్రవాదాన్ని బలపరిచేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇండియా వంటి దేశాలలో కూడా మతావాదం బలపడుతుంది. ఉదారవాదం బలహీనం అవుతుంది. ఇరవై సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి కంటే అధ్వానమైన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. కశ్మీర్ లో తాలిబాన్ ఏమి చేస్తారో, వారి చేత పాకిస్తాన్ ఏమి చేయిస్తుందోనని భయపడవలసిన రోజులు దాపురించాయి. రెండు దశాబ్దాల కిందటి కంటే ఇప్పుడు అభద్రతాభావం పెరిగింది. అఫ్ఘానిస్తాన్ పరిణామాలను స్వప్రయోజనాలకోసం దేశీయ రాజకీయాలలో విజయం సాధించడానికి వినియోగించవచ్చుననే ధోరణి ప్రమాదకరమైనది. ఇంటాబయటా ప్రతీపశక్తుల విజృంభణ కారణంగా బిక్కుబిక్కుమని బతికే రోజులు దాపురించాయి.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles