Sunday, December 22, 2024

అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

                                                                                                                      ఇది స్వామి నారాయణ్ మందిరం. అంటే విష్ణు మందిరం అనుకుంటారేమో. కాదు. నారాయణ్ అనే పేరుగల ఓ స్వామిజీ మందిరం. అయన్ను భగవంతుడిగా భావించి పూజించే భక్తులు చాలా మంది వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో స్వామి నారాయణ్ మందిరాలు వున్నాయి.

ఆది శంకరాచార్య లాగే నీలకంట్ అనే పేరుగల 11 సంవత్సరాల కుర్రవాడు ఇల్లు వదలి, తన జాడ తెలుసుకుని ఎవరూ తనని వెనక్కి తీసుకురాకుండా, గంగానదిలో దూకేస్తాడు. తాను బ్రతక వలిసి ఉంటే దేవుడే తనని రక్షిస్తాడని అతని భావన. ఎక్కడో ఒడ్డ్డు చేరి అక్కడనుండి కాలినడకన హిమాలయాలకు చేరుతాడు. ఈ బాల సన్యాసిని గడ్డ కట్టించే చలికాని, క్రూర మృగాలుకాని, ఇతన్ని నిర్జించాలని ప్రయత్నించిన తాంత్రికులుగాని ఏమీ చేయలేరు.

స్వామిా నారాయణ్ మందిరం

హిమాలయాలనుండి దక్షిణ యాత్రకు బయలుదేరి అనేక క్షేత్రాలు దర్శిస్తూ కన్యాకుమారి చేరి అక్కడనుండి బయలుదేరి సంపూర్ణ భారతదేశ యాత్ర పూర్తి చేస్తాడు. మంచిగా ఉండమనే ప్రభోధంతో పాటు అహింసను, భయరాహిత్యాన్ని బోధిస్తాడు. నీలకంట్ కు ఓ గురుతుల్యుడు నారాయణ్ గా నామకరణం చేస్తాడు. 

Also read: “అమ్మ”

అక్షరధాం మందిరం ఓ అద్భుతం. దానికి సాటిరాగల మరో కట్టడం భారత దేశంలో మరెక్కడా లేదేమో. కర్నాటక రాష్ట్రoలోని బేలూరు, హళ్ళిబేడు లలో అమరశిల్పి జక్కన్న చెక్కిన అపురూప శిల్ప సంపద కాని, రాజస్తాన్ లోని మౌంట్ ఆబుపై ఉన్న భిల్ వారా జైన మందిరాలు కాని దీనికి సాటి రావు. కొంత మంది తాజ్ మహల్ కంటే అందమైనదని అంటారు. అక్షరధాంలు ప్రపంచ వ్యాప్తంగా చాలా వున్నాయి. (గుజరాత్ లోని అక్షరధాం పై జరిగిన ఉగ్రవాద దాడి ఎవరూ మర్చిపోలేరు.)

స్వామీ నారాయణ్ విగ్రహం

మందిరం ముందు మండే ఎండలో నేలమీది పాలరాళ్ళు  కాళ్ళను బొబ్బలేక్కించే సమయంలో వాటి మధ్యలో ఉన్న చాక్లెట్ రంగురాళ్ళు మీ కాళ్ళకు చల్లగా తగుల్తాయి!

చాలా విశాలమైన ప్రదేశంలో మందిరం, తోట, జలయంత్ర సహిత విశాల కుండం; ప్రాచీన  నలంద, తక్షశిల విద్యాలయాల ప్రాంగణాలను తలపిస్తాయి. మందిరంలోని ప్రతి అడుగు కోట్ల రూపాయల ఖర్చుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఏడు వేల మంది శిల్పులు ఐదు సంవత్సరాలపాటు కష్టపడితే తయారైన మందిరం అది. మందిరం బయట, లోపల అద్భుత శిల్ప సంపద కనిపిస్తుంది. మందిరంలో ఫోటోలు తీయడం నిషిద్ధం. కాని ఆ మందిరంలోని అనేక దృశ్యాలు మన మనసుపై చెరగని ముద్రలు వేస్తాయి.

Also read: “కష్టం – సుఖం”

మందిరంలోకి వెళ్ళడానికి టికెట్ లేదు కాని ఓ ప్రత్యేకమైన ప్రాంతం చూడడానికి మాత్రం టికట్ కొనాలి. ధర ఎక్కువే అయినా తప్పకుండా చూడవలసిన అద్భుతం. లోపలికి  వెళ్ళగానే కొన్ని విశాలమైన గదులు ఉంటాయి. ప్రతిగదిలో సౌండ్ అండ్ లైట్ షో ఉంటుది. అక్కడ కనిపించే రోబోలు సజీవ మనుషులు కాదని నమ్మడం కష్టం. అవి రోబోలని తెలియకముందు నిజమైన మనుషులను నిలబెట్టి మాట్లాడిస్తూ బొమ్మలు, విగ్రహాలు అని ఆబద్ధం చెబుతున్నారేమో అనిపిస్తుంది. ఆ గదులన్నీ దాటిన తర్వాత ఓ సినిమా షో స్వామి నారాయణ్ జీవితం గురించి తెలియజేస్తుంది.

విదేశీ ప్రముఖుడితో ప్రధాని నరేంద్రమోదీ

తరువాత ఓ పడవలో కూర్చోబెట్టి సొరంగ మార్గంలో ప్రాచీన భారతంలోకి తీసుకెళతారు. రెండువైపులా ప్రాచీన భారత గొప్పతనానికి కారణ భూతులైన అనేక మంది మహానుభావులు పనిచేసుకుంటున్న దృశ్య కావ్యాలు కనిపిస్తాయి. తల అటు తిప్పితే ఇటు చూడలేక, ఇటు చూస్తే అటు దృశ్యం చూడలేక అప్రమత్తంగా త్వరత్వరగా అటూ ఇటూ చూసుకుంటూ వెళ్ళాలి. అనేక విషయాలు, పశ్చిమ దేశ శాస్త్రజ్ఞులు కనిపెట్టినట్లుగా చెప్పబడేవి, అంతకంటే కొన్ని వందల, వేల సంవత్సరాల ముందే మన వాళ్ళు కనుగొన్నారని వారి మూర్తులతో సజీవ సాక్ష్యాలను చూపిన్స్తుందీ సంస్కృతిక యాత్ర. భరతముని, చరకుడు, వరాహమిహిరుడు, వ్యాసుడు, పతంజలి లాంటి వారు అనేకమంది కనుపిస్తారిక్కడ. ప్రాచిన భారత గొప్పదనం గురించి తెలిసిన వారికి అద్భుతంగా అనిపించే ఈ అనుభవం అది తెలియని వారికి ఇదంతా నిజమేనా లేక కలా అనే ద్వైతంలో పడేస్తుంది.

కొస మెరుపు: ఎంత అపురూప శిల్ప కళా వైభవమున్నా ఈ మందిరంలో భక్తిభావం కలగక పోవడం విశేషం.

Also read: నవరాగం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles