• ఆరో భారత స్పిన్నర్ గా రికార్డు
• రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ కు 5 వికెట్లు
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో పాల్గొనటం క్రికెటర్లకు ఓ కలగా జీవితలక్ష్యంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వందలమంది అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్నా అతికొద్దిమందికి మాత్రమే తమ జాతీయజట్ల తరపున, అదీ టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కుతుంది. అయితే..అరుదైన టెస్ట్ క్యాప్ దక్కినా సద్వినియోగం చేసుకొనేవారు కొందరైతే సద్వినియోగం చేసుకోలేక తెరమరుగయ్యేవారు మరికొందరు. చెన్నై రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన గుజరాతీ స్పిన్ ఆల్ రౌండర్, 27 ఏళ్ల అక్షర్ పటేల్ మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తో సహా ముగ్గురిని పడగొట్టిన అక్షర్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 5 వికెట్లు సాధించాడు. ఈ ఘనత సంపాదించిన 9వ క్రికెటర్ గా, ఆరవ భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
Also Read: చెపాక్ టెస్టులో అశ్విన్ రికార్డుల మోత
రెండో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్:
అక్షర్ మొత్తం 21 ఓవర్లలో 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దిలీప్ దోషీ తర్వాత అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు పడగొట్టిన భారత రెండో లెఫ్టామ్ స్పిన్నర్ గా అక్షర్ నిలిచాడు. అరంగేట్రం టెస్టులోనే 5 వికెట్ల మైలురాయిని చేరిన భారత స్పిన్నర్లలో లెగ్ స్పిన్ దిగ్గజాలు వివి కుమార్(1960-61), నరేంద్ర హిర్వాణి(1987-88), అమిత్ మిశ్రా(2008-09), దిలీప్ దోషి(1979-80), ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (2011-12) ఉన్నారు. దేశవాళీ క్రికెట్ లో గుజరాత్ కు ప్రాతినిథ్యం వహించే అక్షర్ పటేల్ కు భారత్ తరపున 38 వన్డేల్లో 45 వికెట్లు, 11 టీ-20ల్లో 9 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. హోం గ్రౌండ్ అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఈ నెల 24 నుంచి జరిగే కీలక డే-నైట్ టెస్టులోనూ అక్షర్ పాల్గొనటం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: చెన్నై రెండో టెస్టులో భారత్ భారీ విజయం