Sunday, December 22, 2024

అమరశిల్పి అక్కినేని

తెలుగు జన హృదయాలను దోచుకున్న ‘నటసమ్రాట్’ అక్కినేని నాగేశ్వరావు. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం. తానే గీసుకున్న అందమైన ‘చిత్రం’. ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు.  ప్రపంచాన్ని,జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి జీవించిన నిత్య అధ్యయనశీలి. చదువులంటే ఎంతో ఇష్టం. చదువుకున్నవారంటే అంతులేని గౌరవం. తను రాసిన ‘అ ఆలు..’చదివితే చాలు, అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది. ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల. తొమ్మిది పదుల నిండుజీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు. కళాప్రపూర్ణుడు. భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం. సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు, వాగ్గేయకారులు, మహాభక్తులు, కళాకారుల పాత్రలకు పెట్టింది పేరు. కాళిదాసు,తెనాలి రామకృష్ణ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. జయదేవుడు, విప్రనారాయణుడు ఈయనే ఏమో అని భ్రమ కలుగుతుంది. చాణుక్యుడు అచ్చూ అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం.”స్పర్ధయాన్ వర్ధతే విద్య” అనే ఆర్యుల వాక్కు అక్కినేనికి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. ఎన్టీఆర్ వంటి విద్యాధికుడు, పరమ ఆకర్షణా స్వరూపుడు అటువైపు ఉండగా… తన ఉనికిని కాపాడుకుంటూ, తన విశిష్ట ముద్ర వేసుకోడానికి, ఎంత తపన పడ్డాడో,  జగ్గయ్య  వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు, సావిత్రి వంటి ప్రతిభా భాస్వంతులు ఉన్న కాలంలో దీటుగా నిలబడడానికి ఎన్ని ధీరోదాత్తమైన ఆత్మదీపాలు వెలిగించుకున్నారో అడుగడుగునా, ఆణువణువునా తనను తాను భద్రంగా కాపాడుకోవడానికి, గెలుపుగుర్రంపై స్వారీ చేయడానికి చెప్పలేనంత తపన పడ్డారు. ఆ తపనే తపస్సు.

సన్మానితుడు అక్కినేని, హీరో అక్కినేని

ఎన్ని ప్రక్రియలకో ఆద్యులు

హైస్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి మహాకవుల పాత్రలు వేయడం బహు సాహసం. వేసి గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం. నిజజీవితంలో దైవభక్తి ఎరుగని మనిషి, పరమ భక్తులైన తుకారాం,విప్రనారాయణలుగా జీవించిన తీరు అనన్య సామాన్యం. అమరశిల్పి జక్కనగా ఆయన వేసిన ముద్ర ఆయనకే చెల్లింది. తెలుగు సినిమాలో డాన్సులు మొదలు పెట్టిన మొట్టమొదటి హీరో ఆయనే. ద్విపాత్రాపోషణం ఆయనతోనే మొదలైంది. ‘నవరాత్రి’ సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. ఆయనే తొలి నవలా నాయకుడు కూడా. ఇక ప్రేమికుడు, భగ్నప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లాయి. ‘దేవదాసు’గా ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. హీరోకు ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు. ఆయన హెయిర్ కట్, మీసకట్టు, డ్రెస్ ను కొన్ని లక్షలమంది అనుకరించారు. ఆయన స్టైల్ కొన్ని తరాలను శాసించింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఎక్కడో రామాపురం/ వెంకటరాఘవాపురం అనే కుగ్రామంలో జన్మనెత్తాడు. దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. పల్లెల్లో పొలాల్లో పనిచేసుకుంటూ, నాటకాలలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ తన నటప్రస్థానాన్ని ప్రారంభించారు. స్త్రీ పాత్రలు వేసి  తొలినాళ్ళల్లోనే అందరినీ ఆకర్షించారు. పాటలు, పద్యాలు పాడి, డాన్సులు చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఘంటసాల బలరామయ్య చలువతో తన ప్రగతికి మెట్లు కట్టుకున్నారు. 16 ఏళ్ళ వయస్సులోనే (1940)  ‘ధర్మపత్ని’తో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 20ఏళ్ళ ప్రాయంలోనే ‘సీతారామ జననం'(1944)తో మొట్టమొదటగా కథానాయకుడు అయ్యాడు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. అప్రతిహతంగా ఏడు దశాబ్దాల పాటు మహాప్రస్థానం సాగింది. తొమ్మిదిపదుల వయస్సులోనూ ‘మనం’లో జీవించి మెప్పించారు. జీవితంలో తుది శ్వాస వరకూ నటించిన అరుదైన చరిత్రను లిఖించుకున్నారు. నటుడుగా విజృంభించడమే కాక, ‘అన్నపూర్ణ’ బ్యానర్ లో ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. తెలుగునేలపై చిత్రపరిశ్రమ ప్రభవించడానికి కృషిచేసి, సాధించినవారిలో అక్కినేనివారిది అగ్రశ్రేణి.

అక్కినేనితో కుమారుడు నాగార్జన, మనుమలు

విశ్వనాథ్ కు ప్రోత్సాహం

కె. విశ్వనాథ్ గారిలో దర్శకత్వ ప్రతిభ ఉందని తొలిగా గుర్తించినవారు అక్కినేని. కేవలం గుర్తించడమే కాక ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడుగా అవకాశమిచ్చి, ప్రోత్సహించినవారు కూడా ఆయనే.అలా.. ఎక్కడ ప్రతిభ, పాండిత్యం వుంటే అక్కడ గుర్తించి, ఆ ప్రతిభామూర్తులను ప్రోత్సహించి, గౌరవించిన కళాహృదయుడు, ప్రతిభాపక్షపాతి అక్కినేని. మహాదాత కూడా. గుడివాడలో కళాశాల నిర్మాణానికి, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చివేసిన త్యాగశీలి. తన ప్రతిభ పట్ల, రేపటి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంతటి దానం చేశారు. ఆ కాలేజీకి అక్కినేని నాగేశ్వరావుపేరు పెట్టుకున్నారు. కేవలం గుడివాడ కాలేజీకే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ మొదలు ఎన్నో విద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. ఎందరికో, ఎన్నింటికో గుప్తదానాలు కూడా చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే పాత్రత ఎరిగి దానం చేసే విజ్ఞత ఆయన సొత్తు. ‘అపాత్రాదానం’ చేయకూడదన్నది ఆయన నియమం. తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోడానికై కవులు,మేధావులతో గడిపేవారు. సత్ సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం. 50ఏళ్ళ వయస్సులోనే గుండె దెబ్బతిన్నది.అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని పునరుత్తేజం పొందారు. అప్పటి నుంచి జీవనశైలిని ఎంతో మార్చుకున్నారు. తన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోడానికి ఋషి వలె కృషి చేశారు. గొప్ప సాధన చేశారు. గుండె చాలా తక్కువ శాతం మాత్రమే పనిచేసేది. అచంచలమైన మనోధైర్యం, విచక్షణతో హృదయాన్ని ధృడంగా నిలుపుకున్నారు. ఆ తీరు అన్యులకు సాధ్యపడదు. సునిశితమైన పరిశీలన, చురుకైన చూపులు, పాదరసం వంటి మెదడు, నిలువెల్లా రసికత, గుండెనిండా పట్టుదల, నిత్య కృషీవలత్వం అక్కినేని సుగుణాలు,సులక్షణాలు. అకడమిక్ గా తాను పెద్ద చదువులు చదువుకోలేదనే స్మృతితో పిల్లలను బాగా చదివించారు. చదివించడమే కాక, ఎంతో క్రమశిక్షణతో పెంచారు. శ్రమ విలువ తెలియాలన్నది ఆయన సూక్తి. సినిమా జీవితంలోనూ, నిజ జీవితంలోనూ తన బలాలు, బలహీనతలు బాగా ఎరిగి నడుచుకున్నారు. తాను ఎక్కడ రాణించగలనో తెలిసి అక్కడ విజృంభించారు. ఎచ్చట గెలవలేనో ఎరిగి అచ్చట విరమించుకున్నారు.

Also read: సప్తఖండాలలో వద్దిపర్తి అవధానం

రాజకీయాలకు దూరం

రాజకీయాల్లో అనేకసార్లు అవకాశాలు వచ్చినా  చిరునవ్వుతో తప్పించుకున్నారు. కానీ, రాజకీయాలను సునిశితంగా పరిశీలించడం ఎన్నడూ మానలేదు. రాజకీయ నాయకులతో విస్తృతంగా సంబంధాలను పెంచుకున్నారు. ఆయనకి అదొక ‘ఆట’విడుపు. ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డ్ సృష్టించాయి. నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవు. ఆయనను చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకూ, కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సమ్మాన్ వరకూ, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఆన్నీ వరించాయి. ఒక్క ‘భారతరత్న’ తప్ప,  ఘనగౌరవాలన్నీ దక్కించుకున్నారు. ‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ స్థాపించారు. దాదా సాహెబ్ ఫాల్కేతో సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు. దేవానంద్ మొదలు రేఖ వరకూ ఎందరో ప్రజ్ఞాప్రముఖులు “ఏ ఎన్ ఆర్ నేషనల్ అవార్డు”ను అందుకున్నారు. అక్కినేని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. “బండరాళ్లను సైతం అరగించుకో గలిగిన కాలంలో డబ్బులు లేవు.డబ్బులున్న నేడు ఆరోగ్యం లేదు” అంటూ జీవన సారాన్ని చెప్పిన తత్త్వవేత్త అక్కినేని. అక్కినేని వలె జీవించడం, జీవితాన్ని సాధించడం అందరికీ సాధ్యపడేది కాదు. నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే నడచి వెళ్లిన అక్కినేని ‘అమరజీవి’గా అనంతమైన కాలంలో అఖండగా వెలుగుతూనే ఉంటారు.

Also read: తెలుగు సాహిత్య విశ్వరూపం విశ్వనాథ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

  1. రాజకీయాలకు దూరంగా ఉన్న కారణంగానే అక్కినేని చివరి వరకూ వివాదరహిత పెద్ద మనిషిగా ఆయన అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles