మంచితనం, గొప్ప వ్యక్తిత్వం కలగలిసిన మిత్రుడు ఆకిరి రామకృష్ణారావు ప్రేమాస్పదుడు. పెద్దవాడు. 78 దాటాయేమో. మనను విడిచివెళ్లారు.
రేడియో కన్న ఆకాశ వాణి అని తెలిసిన వాడు, టివి కన్న దూరదర్శన్ అని చెబుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలలో కొన్నేళ్ళు రాజ్యం ఏలిన రాజు ఆకిరి గారు.
సాయంత్రం 7.30 బులెటిన్ మొదలైతే అరగంట దాకా కదిలే డైనమిజం ఆయన. ఒక ఉదయం పత్రిక తరువాత దినపత్రికల జర్నలిజం నుంచి కాలమిస్ట్ గా మారుతున్నదశలో కొంత మధ్య సంధి కాలంలో కనీసం కావలసినంత పైసలు రావడం సాధ్యం కాని రోజులవి. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7.30 లో బులెటిన్ వార్తలు రాయడంలో నాతో మరొక జర్నలిస్టు పనిచేసేవారు. అప్పుడు ఆకిరి రామకృష్ణారావుగారు ఎడిటర్. డైనమిక్ వ్యక్తిగా మాకు తెలుసు. దాదాపు అయిదేళ్లదాకా అడపా దడపా నేను బులెటిన్ రాసే వాడిని. ఆయన ఏ కారులో వెళ్లతారా అని కనీసం నలుగురు ఎదురుచూస్తూ ఉండేవారు. వారిని వదిలేసే నాతో మామూలు నా హీరో హోండా వెనుక ఎక్కి కూర్చునేవాడు.
హైదరాబాద్ తిలక్ నగర్ లో ఒక చిన్న రెండు గదుల పోర్షన్ లో ఉండే వాడిని. నేల పైన చాప పైన చిన్న పెళ్లినాటి బల్ల మీద మా పాఠాలు చదువుకుంటున్న మా అమ్మాయి వసుప్రద, (ఇప్పుడు బిటెక్, ఎల్ ఎల్ బి లాయర్, సైనిక ఉన్నత అధికారి శ్రీమతి) నన్ను ఎప్పడికీ ఆ విషయం గుర్తుండి చెప్పేవాడు.
నల్సార్ ప్రొఫెసర్ గా నే వ్యాసాలు చదివినా, కేంద్ర సమాచార కమిషన్ గా నా తీర్పులను విన్న నా గురించి గొప్పగా చెప్పేవాడు.
ఆయన కష్టాలు ఆయనవే. ఆనారోగ్యాలు, సమస్యలు, హాస్పిటల్ బతుకులు నిజజీవితానికి. చివరికి తెల్లవారిన కాలం ఆగిపోయింది, ఆయనకు. మిత్రుల బాధలు తప్ప పంచుకునేదెవరు.
భావనారాయణ తోట ఇలా అన్నారు ‘‘ఆయన సొంత రాజకీయ అభిప్రాయాల ప్రభావం వార్తల మీద ఏ మాత్రమూ పడకుండా నిక్కచ్చిగా పనిచేసిన వ్యక్తిగా ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతారు. బులిటెన్ కు ముందు తప్పనిసరిగా వార్తలు చెక్ చేయటం ఆయనకు అలవాటు. సాధారణంగా న్యూస్ ఎడిటర్ స్థాయి వాళ్ళు తమ తరువాతి రాంక్ వాళ్ళ మీద వదిలేయటం సహజమే. అయినా, ఆకిరి గారు మాత్రం అలాంటి అలసత్వాన్ని దగ్గరకు రానిచ్చే వారు కాదని చెబుతారు..’’ అని ప్రశంసించారు.
ఆయన వేగం చెప్పుకోదగ్గది. అందరికన్న ముందుండేవాడు. దానికి ఉదాహరణ ఆకిరి: ‘‘దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన ఆయన కున్న వృత్తి నిబద్ధతను గుర్తు చేస్తుంది. 1993 సెప్టెంబర్ 30 తెల్లవారు జామున 4 గంటల సమయంలో మహారాష్ట్రలోని లాతూరులో పెద్ద భూకంపం వచ్చింది. లాతూరు మహారాష్ట్రలో ఉన్నది కాబట్టి ఆ రాష్ట్ర రాజధాని బొంబాయ్ లోని దూరదర్శన్ కేంద్రాన్ని ఢిల్లీలోని దూరదర్శన్ అధికారులు అప్రమత్తం చేశారు. అక్కడి సిబ్బంది ప్రత్యక్ష ప్రసారాలకు వాడే ఓబీ వాన్ తో బయలుదేరారు. అయితే, హైదరాబాద్ లో ఉన్న న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణారావు గారు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ ఓబీ వాన్ తీసుకొని బయలుదేరారు. బొంబాయ్ నుంచి రావటం కంటే, హైదరాబాద్ కు దగ్గర కాబట్టి తానే ముందుగా ప్రత్యక్ష ప్రసారం చేయగలనని ఆలోచించి ఆయన అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. కేవలం మూడు గంటల్లో అక్కడికి చేరుకొని ప్రత్యక్ష ప్రసారం మొదలుపెడితే ఢిల్లీలో ఉన్న అధికారులు అవాక్కయ్యారు. బొంబాయ్ కంటే హైదరాబాద్ కు లాతూర్ దగ్గరనే విషయం గ్రహించలేకపోయినందుకు నాలుక కరుచుకున్నారు. చురుగ్గా వ్యవహరించిన ఆకిరిని అభినందించారు. అప్పట్లో అటువంటి పెనుభూకంప ప్రభావాన్ని చూపగలిగే అవకాశం దూరదర్శన్ కు మాత్రమే ఉండగా వేగంగా అందించిన ఘనత ఆయనకు దక్కింది. అదే ప్రత్యక్ష ప్రసారంలో భూకంప వివరాలను హైదరాబాద్ లోని ఎన్ జి ఆర్ ఐ అధికారుల ద్వారా ఫోన్ లో చెప్పించి ఆ ప్రసారానికి మరింత వన్నె తెచ్చారాయన’’.
తలచుకుంటే చాలు ఉత్సాహం, సంతోషం, నవ్వు, మనదేశ సమస్యల చర్చ, నాతో కాసేపు అదీ ఇదీ మాట్లాడుకోవడం. విశాఖ వెళ్లిన ప్రతిసారీ ఆయన్ను కలిసి హాయిగా సంతోషంగా వెళ్లికోవడం. ఈసారి కలుచుకోవాలి అనుకోవడం.
‘‘సమాజానికి మీ వాక్కు అవసరం’’ అని నన్ను ప్రేమతో అనేవాడు ఆకిరి. మార్చ్ ఉగాది శుభాకాంక్షల తరువాత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
‘‘మంచి స్నేహితుడు. అవసరానికి ఆదుకోవడంలో ముందువెనకలు చూసే రకం కాదు. ఆయనకు దైవభక్తి మెండు’’ అని భండారు శ్రీనివాస రావుగారు, వారి బాధలు పంచుకునే పాశం యాదగిరి గారు, విశాఖ పట్టణం లీడర్ పత్రిను నిర్వహించే ప్రముఖ సన్నిహితుడు వివి రమణమూర్తి, చాలా సంవత్సరాలనుంచి తెలుసుకుంటూమాట్లాడుతూ వింటూ సలహాలు ఇస్తూ, ఇంటింటి కష్టాలలో కూడా మాట్లాడుకునే గోపినాథం మార్పుగారు, సెంట్రల్ కోర్ట్ హోటెల్ మిత్రుడు అనిల్ కుమార్ అందరికీ సానుభూతి. ఏదో చెప్పుకోవాలని ఆనుకున్నా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు లేడు. వ్యక్తిత్వం కలిగిన గొప్పవాడు ఆకిరి రామకృష్ణారావు గారికి కన్నీటి నివాళి.