Thursday, November 21, 2024

అఖిలేష్, ప్రియాంక వాగ్యుద్ధం

  • మూడుగా చీలుతున్న యోగీ వ్యతిరేక ఓట్లు య
  • యూపీలో బీజేపీకే విజయావకాశాలు

‘‘అఖిలేష్ యాదవ్ యూపీలో కాంగ్రెస్ కు సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం’’ అన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ. మూడేళ్ళ కిందట యూపీలో కాంగ్రెస్ ను పునర్మించే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ చెల్లి ప్రియాంకకు అప్పగించారు. అప్పటి నుంచీ తన బాధ్యతను పట్టించుకొని కృషి చేసి ఉంటే అఖిలేష్ అటువంటి వ్యాఖ్యానం చేయడానికి సాహసించి ఉండేవారు కాదు.

యూపీలో కాంగ్రెస్ ను పునరుద్ధరించడానికి అవసరమైన సానుకూల పరిస్థితులు అన్నీ ఉన్నాయి. రాహుల్ కంటే ప్రియాంక బాగా ఉపన్యాసం చెప్పగలరు.  అమితాబాచన్ తల్లి శిష్యరికం చేయడం వల్ల హిందీలో ధాటిగా మాట్లాడగలరు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వారి ఆలనాపాలనా తాను స్వయంగా చూసుకోనక్కరలేదు. మాయావతి అంత ఉత్సాహంగా లేరు. కనుక అఖిలేష్, ప్రియాంక మొదటి నుంచి కలసి కట్టుగా పని చేసి ఉంటే యోగి ఆదిత్యనాథ్ ఆట కట్టించడానికి కొంత అవకాశం ఉండేది. అది లేకపోగా, అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, ప్రియాంక నాయకత్వంలోని కాంగ్రెస్ కీచులాడుకుంటున్నాయి.

‘‘ఈ సారి కాంగ్రెస్ పోటీలో లేదు. ప్రకటనల కోసమే (అడ్వర్టయిజ్ మెంట్) కోసమే వారు ఇక్కడ ఉన్నారు. వారికి సున్నా సీట్లు రావచ్చు,’’ అంటూ అఖిలేష్ పోయినవారం వ్యాఖ్యానించారు. అఖిలేష్ యాదవ్ నడిపిన ప్రభుత్వం కులప్రాతిపదికపైన, నేరస్థ స్వభావంతో నడిచిందని ప్రియాంక విమర్శించిన తర్వాత ప్రతివిమర్శగా అఖిలేఖ పై విధంగా వ్యాఖ్యానించారు. కుల, మత రాజకీయాలను ముందుకు తీసుకువెడుతున్నారంటూ అఖిలేష్ యాదవ్ నూ, మాయావతిని ప్రియాంక నిందించారు. ఇదంతా ఎన్నికల ప్రచారంలో భాగం.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బిజ్నోర్ లో 19 ఏళ్ళ కుర్రవాడు చనిపోవడాన్ని ప్రస్తావించి ప్రియాంక,  ‘‘ ఆ యువకుడి ఇంటికి వెళ్ళి అతడి కుటుంబ సభ్యులను పలకరించారా అని అఖిలేష్ ని అడగదలచుకున్నాను’’ అని ఎత్తిపొడిచారు. 2017లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. రాహుల్ గాంధీనీ, అఖిలేష్ నీ ‘‘యూపీకే లడకే’’ అనే నినాదంపైన ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ యూపీ అంతటా పర్యటింపజేశారు. రెండు పార్టీలూ ఘోరంగా ఓడిపోయాయి. బీజేపీకి ఘనవిజయం లభించింది. తన ఓటమికి కాంగ్రెస్ తో పొత్త పెట్టుకోవడం కూడా కారణమని అఖిలేష్ భావిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ తన బలం కంటే ఎక్కువ సీట్లు బేరం చేసి తీసుకొని దారుణంగా ఓడిపోయిందని పరిశీలకులు అన్నారు. అఖిలేష్ యాదవ్ కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు.

ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ సమాజ్ వాదీ పార్టీకి అనుకూలమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆమె కాంగ్రెస్ ను బలహీనపరిచి తన పార్టీని విస్తరించి బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీకి దగ్గర కావడాన్ని కాంగ్రస్ సహించలేకపోతోంది.

ఇది ఇలా ఉండగా, బీజేపీని ఓడించేందుకు బుద్ధిపూర్వకంగానే అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ ఒక పథకం ప్రకారం సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ వేసుకుంటున్నారనీ వాదించే రాజకీయ పరిశీలకులు ఉన్నారు. ప్రస్తుతం యూపీలో బ్రాహ్మణులు యోగీ ప్రభుత్వంపైన ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత కులమైన ఠాకూర్లకు పెత్తనం అప్పగించారనీ, ఠాకూర్లు తమకు ఇవ్వవలసిన గౌరవం, ప్రాముఖ్యం ఇవ్వడం లేదనీ బ్రాహ్మణులు కోపంగా ఉన్నారు. వారికి ఠాకూర్ల కంటే యాదవ్ లంటే ఆగ్రహం ఎక్కువ. కాంగ్రెస్, ఎస్ పీ కలిసి కూటమి కడితే ఇష్టం ఉన్నా లేకపోయినా వారు బీజేపీకే విధిగా ఓటు చేస్తారు. కూటమికి వేయరు. ఎందుకంటే ఆ కూటమి నాయకుడు అఖిలేష్ యాదవ్ కనుక. అందుకని కాంగ్రెస్, ఎస్ పీలు విడివిడిగా పోటీలో ఉంటే కాంగ్రెస్ కు వేయడానికి బ్రాహ్మణులు మొగ్గు చూపవచ్చు. అది ఒక వ్యూహం అయితే కావచ్చు. అందుకనే కాంగ్రెస్ ను వదిలేసి చరణ్ సింగ్ మనవడు (అజిత్ సింగ్ కుమారుడు)తో, ఇతర చిన్న పార్టీలతో అఖిలేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ కు వంద సీట్లు కేటాయించడం కంటే చిన్నాచితకా పార్టీలన్నిటికీ కలిపి వంద సీట్లు కేటాయించినా నష్టం లేదనీ, కాంగ్రెస్ కు బలం తగ్గిపోయిందనీ, ప్రియాంక వల్ల ఆ పార్టీ ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదనీ అఖిలేష్ అంచనా.

మాయావతి, ప్రియాంక వేరు కుంపట్లు పెట్టుకొని అఖిలేష్ మరో కూటమి ఏర్పాటు చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటర్లు మూడు భాగాలుగా చేలీ అవకాశం ఉన్నది. అప్పుడు బీజేపీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles