• పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ప్రభుత్వానికి సవాల్
• అంత దమ్ముందా అని బండి సంజయ్ ప్రతి సవాల్
• దారుస్సలాంను రెండు గంటల్లో నేలమట్టం చేస్తామన్నబండి సంజయ్
• అక్బరుద్దీన్ వ్యాఖ్యలు అనుచితమన్న మంత్రి కేటీఆర్
ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో గ్రేటర్ ఎన్నికలు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేయడంతో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య పేలుతున్న మాటాల తూటాలు దుమారాన్ని రేపుతున్నాయి.
Also Read: నగర ప్రజలపై టీఆర్ఎస్ వరాల జల్లు
పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లు తొలగించాలని సవాల్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో ఎంఐఎం నిర్వహించిన బహిరంగ సభలో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న ప్రభుత్వానికి ధైర్యముంటే హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఉన్న పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. హుస్సేన్ సాగర్ అప్పట్లో 4,700 ఎకరాల్లో చెరువును నిర్మిస్తే ఆక్రమణలకు గురై ఇప్పుడు అది 700 ఎకరాలకు కుంచించుకు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దానిని కాపాడాల్సిన ప్రభుత్వం పేదలపై మాత్రం కన్నెర్ర చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయం కూడా నాలాపైనే నిర్మించిందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజా సమస్యలపై ఎవరు పట్టించుకోవడంలేదని విమర్శించారు.
Also Read: జీహెచ్ఎంసీ పోరులో మాటల చిటపటలు
మజ్లిస్ కు అంత దమ్ముందా
అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ఆడమన్నట్లు ఆడే మజ్లిస్ పార్టీకి దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చాలని సవాల్ విసిరారు. తాము తలుచుకుంటే రెండు గంటల్లో దారుస్సలాంను నేలమట్టం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలు అనుచితమన్న మంత్రి కేటీఆర్
పీవీ, ఎన్టీఆర్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు నేతలపై అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం ప్రజాసేవ చేసిన నేతలని కేటీఆర్ కొనియాడారు.
Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్ట్
సర్జికల్ స్ట్రైక్స్ పై వెనక్కి తగ్గని సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మేయర్ పీఠం దక్కితే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు.. పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం అనుమతి తీసుకోవాల్సిందేనన్న ఒవైసీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎందుకు మౌనం వహిస్తోందని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలా అని సంజయ్ చురకలంటించారు.
Also Read: జీహెచ్ఎంసీ వాసులకు ‘హస్తం’ వరాలు
నగర వాసుల్లో ఆందోళన
గ్రేటర్ ప్రచారంలో నేతల విమర్శలకు నగర వాసులు నోరెళ్లబెడుతున్నారు. పలు మార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ప్రజాసేవలో ఉన్న నేతలు తమ స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించడంలేదని వాపోతున్నారు. ప్రచారంలో నేతల వివాదస్పద వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఈ పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు నిరసన సెగ