ఆకాశవాణిలో నాగసూరీయం – 6
ఆచంట జానకిరాం, దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గుర్రం జాషువా, మొక్కపాటి నరసింహశాస్త్రి, శ్రీరంగం గోపాలరత్నం, కందుకూరి రామభద్రరావు, వోలేటి వెంకటేశ్వర్లు, శారదా శ్రీనివాసన్, గొల్లపూడి మారుతీరావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ… ఈ జాబితాలోని వ్యక్తులందరిలో కనబడే ఏక సూత్రత ఏమిటి?
ఈ మహానుభావులంతా కొంత కాలమైనా ఆకాశవాణి సిబ్బందిగా చరిత్ర సృష్టించారు! నిజానికి ఈ కోవలోనే ఇంకా చాలా పేర్లున్నాయి!! ఇక ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్నవారి పేర్లు తీసుకుంటే అది తెలుగు కళా, విజ్ఞాన, సంస్కృతీ కళాకారుల నిఘంటువు కాగలదు!
మద్రాసులో తెలుగు ఆకాశవాణి
పారతంత్ర్య వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ; తెలుగు పత్రికలు వ్యావహారిక భాషలోకి ప్రవేశిస్తున్నవేళ; సినిమా తెలుగు మాటలు నేర్చుకుని ప్రజల భాష పట్టుకుంటున్న వేళ; ఆంధ్రపత్రిక దినపత్రిక, కృష్ణాపత్రిక, శ్రీసాధన వంటి వారపత్రికలు స్వాతంత్ర్య జ్వాలలను చిమ్ముతున్న వేళ; తెలుగు రచయిత నవనవోన్మేషంగా చూపులకు కొత్త రెక్కలు తొడుగుతున్న వేళ …
…………… రేడియో తెలుగు పలికింది!!
అది 1938 జూన్ 16….
మద్రాసులో తెలుగు ఆకాశవాణి మొదలైంది!
15 ఆగస్టు 2021 న ‘డెక్కన్ క్రానికల్’లో ఒక ఆసక్తికరమైన వ్యాస శీర్షిక కనబడింది! “టెంపుల్స్, ఆకాశవాణి, యూట్యూబ్” అంటూ 74 సంవత్సరాలలో సంగీతరంగపు తీరు తెన్నులను విశ్లేషిస్తూ శైలజా ఖన్నా రాసిన వ్యాసమది. సంగీతం ఎవరి తోడ్పాటుతో ఆదరింపబడుతూ వచ్చిందో చర్చించిన వ్యాసమిది. రాజాశ్రయం, దేవాలయాలు ద్వారా సంగీతం విలసిల్లింది 1950 దాకా; తర్వాత ఆకాశవాణి ప్రవేశించి మూడు, నాలుగు దశాబ్దాలు గొప్ప సేవ చేసిందని వివరించారు. మరో రెండు దశాబ్దాలకు దూరదర్శన్ కూడా తోడయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, కొత్త టెక్నాలజీ ఉప్పెనలా ముంచుకొచ్చింది. యూట్యూబ్ ఆధారంగా సంగీతం ప్రాచుర్యాన్ని, ఆదాయాన్ని గడిస్తోందని సాగింది ఆ విశ్లేషణ. అవసరమైన వాళ్ళు ఆ వ్యాసాన్ని నెట్ ద్వారా ఇప్పుడు కూడా చదువుకోవచ్చు.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఒక దశ దాకా వ్యక్తులూ, వారి అభిరుచులు ప్రధానం కాగా; తర్వాత టెక్నాలజీ, వినియోగించే తీరు కీలకం కావడం. రేడియో ప్రవేశించినపుడు మన సమాజం ఎలా ఉండేది? బొమ్మలు తెలుగు మాట్లాడే, కదిలే వ్యవహారంగా సినిమా ప్రవేశించి, స్థిరపడి ప్రాచుర్యం పొందింది. అంతే! అయితే, పట్టణాలలో పొలిమేర గ్రామాలలో థియేటర్లు, టెంట్లు ఉండేవి గానీ, మిగతా గ్రామసీమల్లో సినిమా గురించి సమాచారమే నోటి మాటగా ఉండేది. పత్రికలు కూడా అంతగా వ్యాప్తి చెందలేదు. అటువంటి సమయంలో రేడియో ప్రవేశించింది. మాట్లాడే యంత్రంగా ఆకర్షించింది! దూరాన్ని జయించిన వినోద సాధనమయ్యింది!!
“రేడియో రెక్కల గుర్రం వంటిది, అది వెళ్ళలేని చోటు లేదు…” అంటూ మహాకవి, ఆకాశవాణి ఒకప్పటి ఉద్యోగి, ప్రఖ్యాత సినిమా గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్య ‘రేడియో- గోపీచంద్’ అనే వ్యాసంలో వివరిస్తారు. “…అంత విద్యావంతుడై కూడా మేధావులను మేల్కొలిపేట్టు రాయగలిగి కూడా, రాయలేని, చదువు రాని, నిఘంటువులెరుగని, విజ్ఞానం లేని పల్లియుల కోసం రాయాలనే తహతహ ఎప్పుడూ ఉండేది. కనుకనే అతడు రేడియోలో గ్రామస్తుల కార్యక్రమాలు నిర్వహించడంలో గౌరవాన్ని, గర్వాన్ని అనుభవించేవారు… సునిశిత భావనాశక్తియే గాక, అతనికి సామాన్య శ్రోత యెడగల సానుభూతి, సామాన్యునికి గల సంస్కారం ఎలాంటిదో తెలుసుకోగల శక్తి ఎక్కువ తోడ్పడ్డాయి. ఎంత గంభీరమై, ఉదాత్తమై, జటిలమై, దుర్గమమై, దుర్బోధకమైన విషయాన్నైనా సులభంగా, సుగమంగా, సున్నితంగా చిన్న చిన్న మాటలతో, సూటిగా, సురభిళంగా, సుఖంగా చెప్పడం అతనికి వచ్చు…” అని త్రిపురనేని గోపీచంద్ రేడియో సామర్థ్యం గురించి దాశరథి గొప్పగా విశ్లేషిస్తారు!
గోపీచంద్ గురించి…
8 సెప్టెంబరు 1910న జన్మించిన గోపీచంద్ కొంతకాలం ఇన్ ఫర్ మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి 1957లో ఆకాశవాణిలో చేరారు. అప్పటికే ‘అసమర్థుని జీవయాత్ర’ నవల వెలువడి ఒకదశాబ్దమైంది, సినిమారంగంలో ప్రవేశించి రైతుబిడ్డ వంటి సినిమాలకు పనిచేయడం మొదలై రెండు దశాబ్దాలైంది. కనుక ఆయనకు రచన, సినిమా, భావవ్యాప్తి అనే విషయాల మీద పూర్తి ఆకళింపు ఉంది. అదే విషయాలను దాశరథి వ్యాఖ్యలో మనకు కనబడుతుంది.
2 నవంబరు 1962న అర్థాయుస్సుతో కనుమూసిన గోపీచంద్ సాధించిన రేడియో విజయం మామూలుది కాదు. దీనికి కారణం ఏమిటంటే విశేషమైన తపనా, విలక్షణమైన సృజనా, కొత్త టెక్నాలజి కల్పించిన అవకాశాలను అధిరోహించాలనే పట్టుదలా, తగిన పాండిత్యం, నాయకత్వం లక్షణాలు ఆ తరం రేడియో మహనీయులందరికీ ఉన్నాయి! గోపీచంద్ కున్న లక్షణాలలో (దాశరథి చెప్పినట్టు) ఎన్నో కొన్ని ఉన్నవారే చరిత్రను సృష్టించారు. రేడియో మాధ్యమ రీతులను, రేడియో సృజనకళాధీశులను అర్థం చేసుకోవాలంటే ఆ భావ ప్రసార విధానపు లోతుపాతులు మనకు కొంతైనా ఆకళింపు కావాల్సి వుంటుది!
రెక్కల గుర్రం తీరుతెన్నులు
దాశరథి మాటల్లో రేడియో రెక్కల గుర్రం తీరు ఇలా ఉంటుంది ( పైన పేర్కొన్న వ్యాసం లోనే) :
“…రేడియో రెక్కల గుర్రం వంటిది. అది వెళ్ళలేని చోటు లేదు. వినడానికి చెవి ఉండాలే గాని అవలీలగా వినిపిస్తుంది. ఈ మాధ్యమాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, దీన్ని క్రమబద్ధంగా వాడుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. “రేడియోకి రాయడమేమంత పని. ఇదిగో! రాసేస్తాను క్షణంలో” అని కొందరనవచ్చు. “రేడియోలో ఉన్న ప్రత్యేకతలేమిటి? రంగస్థలానికి బోలెడు నాటికలు రాశాను. ఇదీ అలాగే” అని మరికొందరనుకుంటారు. కానీ తీరా రాయడానికి పూనుకున్నప్పుడు – “రేడియో కొరకరాని కొయ్య బాబో! దీన్ని లొంగదీయడం ఐరావతాన్ని ఆరోహించడం లాండి” దని తెలుసుకుంటారు.
పుస్తకంలా మళ్ళీ వెనుక పేజీలు తిప్పి చదువుకోవడానికి వీల్లేదు. రంగస్థలం వలె వేషాలు, అలంకరణలు చూచి అర్థం చేసుకుందామంటే ఇక్కడి ‘కంటికి’ పనిలేదు. శ్రోత నయనం ద్వారానే అంతా చూడాలి. అది మనోనయనానికి అందాలి.
రేడియో రచన తేలిక కాదు
రేడియో రచన విజయవంతంగా సాగాలంటే పుస్తక రచనలో ఉండగూడని కొన్ని ‘దోషాలు’ ఇందులో ఉండాలి. ఆ ‘దోషాలు’ ఇందులో ‘గుణాలు’! పునరుక్తి పుస్తకంలో ఉండగూడదు. రేడియో రచనలో పునరుక్తి సహాయపడుతుంది. వినేవారికి సుబోధకంగా ఉండడానికి పుస్తకంలో అనవసరమైన వివరణలు – కొన్ని అవసరం అవుతాయి. శబ్దం ద్వారానే రూపకల్పన చేయాలి కనుక కొన్ని సందర్భాలలో అర్థం స్ఫురించని శబ్దాలు వినిపించాలి. ఇదొక ప్రత్యేకమైన కళ..”
దాశరథి విశ్లేషణను ఒకటికి నాలుగుసార్లు చదివితే , ఆ భావనల లోతు అందుకో గలిగితే – అదే రేడియో మాధ్యమానికి నీరాజనం …ఆకాశవాణి ఆఖండహారతి…. ఆయా మహనీయులకు రేడియో వీర తిలకం.
… అవుతుంది! అలాగే రేడియో వినడం లో నాణ్యత కూడా పెరిగి, కళాస్వాదన హృదయ సంస్కారాన్ని మెరుగు పరుస్తుంది!!
— డా నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్-9440732393