- అఘాడీ ఉంటుందా, చెదిరిపోతుందా?
- శరద్ పవార్ పార్టీని పునర్నిర్మించగలుగుతారా?
- రెండు ప్రతిపక్షాలను చీల్చిన బీజేపీ వ్యూహాలు
స్వాతంత్ర్యానంతరం రాజకీయాల రూపురేఖలు రకరకాలుగా మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నాలుగున్నర దశాబ్దాలలో వచ్చిన పరిణామాలు, మారిన సంస్కృతి మాటల్లో చెప్పలేనది. మరీ ముఖ్యంగా, ఈ రెండు దశాబ్దాల్లో విపరీత ధోరణులు పెల్లుబుకుతున్నాయి. విలువలు అనే మాట పూర్తిగా పడిపోయింది. ఏదో విధంగా అధికారంలోకి రావడం ఒక్కటే ముఖ్య గమ్యం. ఇక పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2019లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైన తీరునే అక్రమ సంబంధాలకు అతిపెద్ద ఉదాహరణగా వర్ణిస్తారు. జీవితంలో గతంలో ఎన్నడూ కలవని పార్టీలు ఏకమైన దుర్ముహూర్తమది. కాంగ్రెస్ -శివసేన కలిసిపోవడాన్ని ఏ రీతిన వర్ణించాలని అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు. కేవలం అధికారం కోసం, ముఖ్యమంత్రి కుర్చీలాటలో భాగంగా బిజెపి – శివసేన బంధం బద్ధలై పోయింది. ఎన్డీఏ నుంచి విడిపోయిన శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా నిలిచాయి. శివసేన అగ్రనేత ఉద్దవ్ థాక్రేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాయి. తాము కూడా తలో కాసిన్ని పదవులు తీసుకొని ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. దీనికి ముందు జరిగిన ఎపిసోడ్ లో గవర్నర్ సహకారంతో బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, బలనిరూపణలో విఫలమయ్యారు. అదే సమయంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఆశీనులయ్యారు. బలప్రదర్శనలో వెనకబడిపోవడంతో ఇద్దరూ కుర్చీ దిగిపోక తప్పలేదు.అదే అదనుగా చూస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే భిన్న ధృవాలైన కాంగ్రెస్, ఎన్సీపీని కలుపుకున్నాడు.
Also read: శాంతి మంత్రం -రక్షణ తంత్రం
బలహీనపడిన అఘాడీ
ఈ అపవిత్ర కలయికకు ‘మహా వికాస్ అఘాడీ’ అనే ఓ అందమైన పేరు పెట్టారు. ఈ కృత్రిమ కలయిక ఎక్కువ కాలం నిలబడదని అందరూ అంచనా వేశారు. ఈ అఘాడీని బిజెపి ముక్కలు చేస్తుందని, అధికారాన్ని లాక్కుంటుదని ఎందరో జోస్యం చెప్పారు. చివరకు అదే జరిగింది. ఏకనాథ్ శిందే రూపంలో శివసేన రెండుగా విడిపోయింది. విడతీసింది ఎవరన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఎన్సీపీ వంతు వచ్చింది. అజిత్ పవార్ రూపంలో ఈ పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. అజిత్ పవార్ మళ్ళీ ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నాడు. తనతో పాటు మరో 8మంది మంత్రులుగా పదవులు సంపాయించుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొమ్ములు తిరిగిన రాజకీయ యోధుడు. అయినప్పటికీ బిజెపి పెద్దలు రచించినట్లుగా చెప్పుకొనే వ్యూహానికి పెద్దదెబ్బే తిన్నారు. సొంత అన్న కొడుకు చేతిలోనే ఈ కృత్యం జరిగింది. దిల్లీ పథకరచన అలా జరిగింది. 2019 అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగేళ్లలో అజిత్ పవార్ మూడు సార్లు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజకీయాలను చక్రం తిప్పాలని చూస్తున్న కురువృద్ధుడు శరద్ పవార్ సొంత ఇంటినే నిలబెట్టుకోలేకపోయారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే లాగా, శరద్ పవార్ కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
Also read: గీతాప్రెస్ కు గాంధీ పురస్కారం
శరద్ పవార్ అనుభవానికి పరీక్ష
రాజకీయ అంశాలు రాజకీయంగానే తేల్చుకోవాలని శరద్ పవార్ కు తెలియంది కాదు. 53మంది సభ్యులున్న ఎన్సీపీలో 29మంది తన వైపే ఉన్నారని అజిత్ పవార్ చెప్పుకుంటున్నారు. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, మరో నేత ప్రఫుల్ పటేల్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. బిజెపి ఆకర్షమంత్రతో పాటు, ఈ అంశం అజిత్ లో అసంతృప్తిని రేపింది. వీటన్నిటి పర్యవసానమే మహారాష్ట్రలో ఈ ముసలం. ఇంతకూ ఏక్ నాథ్ శిందేను ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంచుతారన్నది కూడా సందేహమే. మొత్తంగా చూస్తే మహారాష్ట్ర మోడల్ మిగిలిన చోట్ల కూడా ప్రయోగించి తన అధికారాన్ని, బలాన్ని పెంచుకొనే పనిలో బిజెపి పడిపోయిందనే మాటలు గట్టిగానే వినపడుతున్నాయి. ఇంతకీ మన బంగారం మంచిదైతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అన్న మాట ప్రతి పార్టీకి వర్తిస్తుంది. సంవత్సర కాలంలోనే సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది.ఈలోపు ఇలాంటి విన్యాసాలు ఎన్ని చూడలో?
Also read: ఎన్నికల బాగోతంలో ‘ఉత్తర’రామాయణం