- అజేయ టెస్ట్ కెప్టెన్ గా రహానే
భారత టెస్ట్ స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానే బ్రిస్బేన్ టెస్టు విజయంతో అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్ విరాట్ కొహ్లీ అందుబాటులో లేని సమయంలో మాత్రమే తాత్కాలిక కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టే రహానే తనదైన శైలిలో నాయకత్వం వహిస్తూ జట్టును విజయపథంలో నడిపించడం ద్వారా అందరి మన్ననలు పొందాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో జట్టును 2-1తో విజేతగా నిలపడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ గా తనకు లభించిన పరిమిత అవకాశాలను రహానే పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటున్నాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ లో భాగంగా కంగారూ గడ్డపై ఆస్ట్ర్రేలియాను…ప్రధానంగా బ్రిస్బేన్ గబ్బాలో ఓడించిన తీరు రహానే నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచిపోతుంది.
సిరీస్ లోని తొలిటెస్టులో విరాట్ కొహ్లీ నాయకత్వం వహిస్తే…కీలకమైన ఆఖరి మూడుటెస్టుల్లో రహానే కెప్టెన్ గా వ్యవహరించాడు.విరాట్ కొహ్లీ నాయకత్వంలో అడిలైడ్ ఓవల్ లో ముగిసిన తొలి డే-నైట్ టెస్టులో భారత్ 36 పరుగులకే కుప్పకూలి 8 వికెట్ల పరాజయం చవిచూసిన నేపథ్యంలో రహానే నాయకత్వ బాధ్యతలు తీసుకొన్నాడు. పితృత్వపు సెలవుపై విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగిరావడంతో…కెప్టెన్సీ బాధ్యతలను రహానే చేపట్టాడు. మెల్ బోర్న్ లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో కీలక శతకం సాధించడంతో పాటు జట్టుకు ముందుండి విజయాన్ని అందించాడు.
ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో తనజట్టును ఓటమి అంచుల నుంచి బయటపడేసి మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా సిరీస్ ఆశలు సజీవంగా నిలిపాడు.
ధర్మశాల టు బ్రిస్బేన్:
భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉంటూ వస్తున్నఅజింకా రహానే 2017 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో తొలిసారిగా నాయకత్వం వహించాడు. అనిల్ కుంబ్లే కోచ్ గా ధర్మశాల టెస్టులో రహానే ఆస్ట్ర్రేలియా పై 8 వికెట్ల విజయంతో బోణీ కొట్టాడు.
ఆ తర్వాత టెస్ట్ పసికూన ఆప్ఖనిస్థాన్ తో బెంగళూరు వేదికగా ముగిసిన టెస్టులో సైతం భారతజట్టుకు రహానేనే కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు భారీవిజయం అందించాడు. 2020-21 సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సైతం రహానే 8 వికెట్ల తేడాతో కంగారూలను కంగు తినిపించడం ద్వారా మూడో విజయం సాధించాడు. సిడ్నీ టెస్టును డ్రాగా ముగించడంతో పాటు…బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 3 వికెట్ల విజయంతో చరిత్ర సృష్టించాడు. తాను నాయకత్వం వహించిన మొత్తం ఐదుటెస్టుల్లో 4 విజయాలు, ఓ డ్రాతో ఓటమి ఎరుగని కెప్టెన్ గా నిలిచాడు.బ్రిస్బేన్ టెస్టు విజయంతో నాలుగు విజయాల ధోనీ రికార్డును రహానే సమం చేయగలిగాడు.
విదేశీ గడ్డపై తిరుగులేని రహానే:
నేలవిడిచి సాము చేయటంలో రహానేను మించిన ఆటగాడు ప్రస్తుత భారత బ్యాటింగ్ ఆర్డర్ లో మరొకరు కనిపించరు. విదేశీ గడ్డపై నిలకడగా రాణించడమే కాదు..జట్టుకు కొండంత అండగా నిలవడంలో రహానేకు రహానే మాత్రమే సాటి. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 69 టెస్టుల్లో రహానే విదేశీగడ్డపైన ఆడినవే 42 మ్యాచ్ లు ఉన్నాయి. మొత్తం 42 విదేశీ టెస్టుల్లో 2 వేల 900 కు పైగా పరుగులతో 45.88 సగటు సాధించాడు.
ఇక స్వదేశీటెస్టు మ్యాచ్ ల్లో రహానే సగటు 39.28గా మాత్రమే ఉంది. సాంప్రదాయ టెస్టు క్రికెట్ లో సాంకేతికంగా రాహుల్ ద్రావిడ్ ఎంతటి మొనగాడో…రహానే సైతం అంతే అత్యుత్తమ ఆటగాడని క్రికెట్ పండితులు తరచూ చెబుతూ ఉంటారు. కష్టకాలంలో జట్టుకు అండగా నిలబడటమే కాదు…తొణకని బెణకని నాయకత్వంతో రహానే అందరినీ ఆకట్టు కొన్నాడు. ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించి భారతజట్టుకు సిరీస్ అందించిన నాయకుడిగా రహానే క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాడు.