ఫొటో రైటప్: 67 కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల నిరసన ప్రదర్శన
తెలంగాణ ఉద్యమం అనేక ఆకాంక్షలను రేకెత్తించింది. మొత్తంగా రాష్ట్ర ఏర్పాటుతో ఒక కొత్త సమాజం రూపుదిద్దుకోబోతుందనే స్థాయిలో అందరం సంబరపడ్డాం. దానికి 10 ఏండ్లు నిండబోతున్నాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ కాలములో ప్రభుత్వం అన్ని రంగాలలో మంచి అభివృద్ధిని సాధించిందనీ చెప్పుకుంటున్నది. మంచిది. అయితే ఉన్నత విద్యారంగానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? ఈ రంగంలో ముఖ్య భూమికను పోషించిన ఎయిడెడ్ కళాశాల వ్యవస్థ స్థితి ఏమిటి? అనేదానిపై ఈ వ్యాసం చర్చించే ప్రయత్నం చేస్తుంది.
Also read: లాల్-నీల్ సమస్య?
ప్రత్యేక చరిత్ర
ఎయిడెడ్ విద్యాసంస్థలకు దేశవ్యాప్తంగానే ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. జాతీయ ఉద్యమ స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలని తలంపుతో కొందరు దాతలు ఈ సంస్థలను స్థాపించారు. ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీ సీ రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు మన దగ్గర ఈ సంస్థలు అవతరించాయి. ఒకనాడు యూనివర్సిటీ కాలేజీలలో సీటు దొరుకుతుందేమో కానీ ఏడేడ్ కళాశాలలో సీటు లభించడం కష్ట సాధ్యంగా ఉండేదని పెద్దలు చెబుతారు. విద్య అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యు జి సి ద్వారా ఈ కళాశాల అభివృద్ధికి నిధులను అందించేవి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కలిపి ఇందులో పని చేసే సిబ్బందికి జీతభత్యాలను ఇచ్చేవి. ఈ రకంగా ఇవి మహావృక్షాలు లాగా పెరిగినాయి. ఇందువల్ల లక్షలాదిమంది విద్యార్థులకు నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్య లభించటమే కాక, వేలాది మందికి ఉపాధిని కూడా కల్పించాయి. అంతేకాక వీటికి సామాజిక ఉద్యమాల చరిత్ర కూడా ఉన్నది. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ను వరంగల్ లోని సికేఎం కళాశాల అందించింది. ఈ రకంగా విద్య అవసరాలను తీర్చటంలోను, సామాజిక అభివృద్ధిని తీసుకురావటములోనూ ఇవి ముఖ్యమైన భూమికను కలిగి ఉన్నాయి.
Also read: భక్తులతోనేదేవుడికిముప్పు, నాస్తికులతో కాదు!
మరణశాసనం
అయితే ఏడేడ్ వ్యవస్థకు చెదలు పట్టించే విధానం 1984లో ఆనాటి ఆంధ్ర పాలకులు చేపట్టారు. అంటే రిక్రూట్మెంట్ పై నిషేధంతో మరణ శాసనం లిఖించబడింది. అయినప్పటికీ 2000 సంవత్సరం నుండి బ్యాక్లాగ్ పోస్టులలో కొంతమందిని రిక్రూట్మెంట్ చేశారు. కానీ విద్యార్థులు సరిపోయిన స్థాయిలో ఉండటం లేదనే నేపంతో 2005 నుండి ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర కళాశాలలోకి సర్దే ప్రక్రియకు సంబంధించిన జీవోను తెచ్చారు. కానీ ఆంధ్ర పాలకులు తెచ్చిన ఈ జీవోను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తూనే, 2018 నుండి పూర్తిగా ఆ కళాశాలను సమాధి చేసే విధంగా అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని ప్రభుత్వ కళాశాలలోకి మళ్ళించారు. ఈ రకంగా ఎంతో చరిత్ర కలిగి, లక్షలాదిమంది విద్యార్థుల విద్యా వ్యాప్తికి తోడ్పడిన ఆ కళాశాలలు సమాధి చేయబడ్డాయి.
ఈ చర్య వలన ప్రభుత్వానికి సాలీనా 60 కోట్ల రూపాయలు మిగులు కలుగుతుందని కళాశాల విద్య వ్యవస్థ ప్రభుత్వానికి తెలిపింది. అందుకని ఈ ఉద్యోగులను విలీనం చేసుకోవాలని ఇటీవల ఒక ఉత్తరాన్ని కూడా రాసింది. అంతకుముందే ఉద్యోగులు తమను ప్రభుత్వ కళాశాలలో విలీనం చేయాలని కోరారు. కానీ ఏ డేట్ లో ఆస్తుల వ్యవహారాలు తేలకుండా విలీనం చేయటం సాధ్యం కాదని ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారి అభ్యర్థనను కాబట్టి ప్రభుత్వపరంగా ఈ కళాశాలపై శాస్త్రీయమైన మదింపు జరగకుండానే దాన్ని సమాధి చేయాలని ఎలా నిర్ణయం తీసుకున్నారానేది ముఖ్యమైన ప్రశ్నగా ఉంది. అలాగే ప్రభుత్వ జీవో రాకుండానే తీసుకున్న ఈ నిర్ణయానికి న్యాయబద్ధత ఉందా? పైగా ప్రభుత్వంపై పూర్తిగా భారం పడకుండా నడిచే ఈ కళాశాలను వదిలివేయటం వివేకవంతమైన చర్య అవుతుందా? తమ తప్పును సమర్థించుకోవడం కోసం 60 కోట్లు మిగులుతున్నాయని నివేదించటం ఎవరి ప్రయోజనాలను కాపాడటానికి?
Also read: భారతదేశంపైన మార్క్స్ఏమన్నారంటే….!?
యాజమాన్యాలకు ప్రయోజనం
నిజంగా ఈ చర్యతో గోతికాడి గుంట నక్కల్లాగా కూర్చున్న యజమాన్యాల రొట్టె విరిగి నీతిలో పడ్డట్టు అయింది. ఈ కళాశాలలన్నీ అన్ని పట్టణాలలో భూమి ధర ఎక్కువ పలుకుతున్న ఏరియాలో ఉన్నాయి. ఎక్కువ కళాశాలలు హైదరాబాదులోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రసిద్ధిగాంచిన కళాశాలల పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు అవుతుంది. ఉస్మానియా గ్రాడ్యుయేట్ యజమాన్యం కింద నడిచే కళాశాలలు, వివేక వర్ధిని, A.V వరంగల్లోని CKM మరియు L.B కళాశాల, వికారాబాద్ లోని అనంత పద్మనాభ కళాశాలలు వంటివి మినీ యూనివర్సిటీలుగా ఎదిగినాయి. వీటికి సాటి వచ్చే ప్రభుత్వ కళాశాలలు లేవు అంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ప్రతి కాలేజీకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అలాగే జూనియర్ ఏడేడ్ మరియు పాఠశాలల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకు అద్భుత విద్య అవకాశం కల్పించే 67 డిగ్రీ కళాశాలను సమాధి చేయటం బంగారు తెలంగాణకు ఎలా మంచిది అవుతుంది?
ఇక విభజన చట్టంలో భాగంగా మహిళ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకోసం అదనంగా ఒక్కరికి కూడా విద్యను, ఉపాధిని కల్పించలేని కోటి మహిళా కళాశాలను తెలంగాణ మహిళ యూనివర్సిటీ అని బోర్డు తగిలిస్తే సరిపోతుందా? యాదాద్రి లాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మించే శక్తి కలిగిన మన ప్రభుత్వం మన మహిళల కోసం మరో ప్రాంతంలో కొత్తగా మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసే శక్తి లేదా? అలా ఏర్పాటు చేస్తే మన తెలంగాణ మహిళా విద్యార్థులకు ఎక్కువ మందికి విద్య అవకాశాలు పెరిగేవి కదా? అలా ఎందుకు చేయలేదు?
Also read: ప్రేమికుల రోజు వర్ధిల్లాలి!
అల్లల్లాడుతున్న విశ్వవిద్యాలయాలు
నేడు ఎడేడ్ కళాశాలలే కాదూ, యూనివర్సిటీల్లో కూడా రిక్రూట్మెంట్ లేక, బ్లాకు గ్రాంటులు తగ్గిపోయి అల్లాడుతున్నాయి. మరి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు విప్లవోద్యమాలకు పోతుగడ్డలుగా చెప్పుకున్నాం కదా? ఇప్పుడు ఆ పోతుగడ్డలు ఏమైపోయాయి? ఉద్యోగ, విద్యావంతుల, విద్యార్థుల జేఏసీలు ఎటు పోయినాయి? ఉద్యమ సమయంలో అయిన దానికి, కాని దానికి ఆంధ్ర పాలకులే కారణమని చెప్పాము. ఏడేడ్ వ్యవస్థ సమాధి కావటానికి ఎవరిని బాధ్యులను చేద్దాం? మొత్తం ఉన్నత విద్యారంగంలో జరుగుతున్న నిర్లక్ష్యానికి ఎవరిని బాధ్యులను చేద్దాం? దీనికి కూడా మన దగ్గర జవాబులు ఉన్నాయా? ఈ పాపంలో ఎవరి వాటా ఎంత? ఇలాంటి దాని కోసమేనా పోడుస్తున్న పొద్దు మీద … పోరు తెలంగాణమా అనే పాటలు పాడింది. కాబట్టి అన్ని రంగాల్లో జరుగుతున్న విధ్వంసం మీద వీర తెలంగాణ రైతాంగ పోరు వారసత్వ చరిత్ర కలిగిన వారిమని చెప్పుకున్నవారు ఇప్పటికైనా నోరు విప్పాలి.
Also read: దారితప్పిన దళితోద్యమం!?
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు , 9959649097