Thursday, November 7, 2024

అహల్య శాపవిమోచనం

రామాయణమ్ 11

విశ్వామిత్ర మహర్షి చెప్పే కధలతో రోజొక క్షణంలా గడచిపోతున్నది రామలక్ష్మణులకు.

గంగావతరణం, క్షీరసాగరమధనం లాంటి కధలెన్నో చెప్పారు మహర్షి! .

గంగను దాటి నడుచుకుంటూ మిధిలానగరసమీపానికి వస్తూ ఉండగా వారి దృష్టిని ఒక ఆశ్రమము ఆకర్షించింది. అది అత్యంత పురాతనమైనది,అయినా అందంగా ఉన్నది!  చిత్రంగా అక్కడ మనుష్య సంచారం లేదు! శూన్యమావరించినట్లుగా ఉన్నది!

Also read: భగీరథయత్నం, గంగావతరణం

‘‘మహర్షీ ఈ ఆశ్రమము ఎవరిది?’’ ఎప్పటిలానే రాముడు ప్రశ్నించాడు!.

రాముడికి కధలు చెప్పటం అంటే విశేషమైన ఆసక్తి కనబరుస్తున్న మహర్షి రాముడు అడిగిన వెంటనే చెప్పసాగాడు.  ‘‘రామా! ఇది గౌతమ మహాముని ఆశ్రమము! ఆ ముని గొప్ప తపఃసంపన్నుడు! ఆయన భార్య అహల్య! అతిలోక సౌందర్యరాశి! ఆవిడ మీద ఇంద్రుడి కన్నుపడ్డది! ఒక రోజు గౌతమ మహర్షిలేని సమయంలో గౌతముడి రూపం ధరించి అహల్యచెంతచేరాడు.

ఆవిడ పొందుగోరాడు ! వచ్చిన వాడు ఎవరో అహల్యకు తెలుసు! అయినా ఆతనితో సుఖించింది! ఇంద్రుడు తిరిగి వెడుతుండగా గౌతముడి కంటపడ్డాడు. శాపానికి గురి అయినాడు. భార్యను కూడా శపించాడు! ‘‘వేల సంవత్సరాల పాటు నీవిచ్చటనే ఎవరికీ కనపడకుండా భస్మములో పడియుండి, కేవల వాయు భక్షణము మాత్రమే చేస్తూ తపస్సు చేస్తూ ఇక్కడే  వుండుము! శ్రీరాముడు వచ్చినప్పుడు నీవు పరిశుద్ధురాలవై నన్ను చేరెదవు’’ అని శాపవిమోచనము తెలిపి తాను వెళ్ళి పోయాడు.

Also read: కపిల మునిపై సగరుల దాడి

ఇదిగో! అదే ఆ ఆశ్రమము! అని చెపుతూ ఆ ఆశ్రమ ప్రాంగణంలో వారు కాలు మోపుతుండగా! ఒక అద్భుతం జరిగింది!. ఒక్కసారిగా ఆశ్రమ ప్రాంగణం ఏదో కొత్తదనం సంతరించుకున్నది! నిద్రాణమైన వస్తువులన్నీ మరల చేతనత్వం పొందాయి. తిరిగి నెమ్మదిగా జీవకళను సంతరించుకున్నాయి! దూరంగా విసిరేసినట్లుగా ఒక మూల పడి ఉన్న బూడిదకుప్పలో ఏదో కదలిక వచ్చినట్లుగా ఉన్నది.

ప్రభుమేనిగాలి పైవచ్చినంతనంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే!

ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులుకలిగే!

ప్రభుమేని నెత్తావి పరిమళించినతోనె యశ్మమొకటి ఘ్రాణేంద్రియము చెందే!

ప్రభునీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే…..

(పైపద్యం విశ్వనాధవారి కల్పవృక్షం లోనిది)

Also read: మారీచ, సుబాహుల సంహారం

శ్రీ రామచంద్రుడి శరీరం మీది గాలి సోకగనే ఒక రాయికి స్పర్శకలిగిందట, ఆయన కాలిసవ్వడి విని చెవులు పనిచేయటం మొదలుపెట్టినవట! ఆయన శరీర సుగంధము వ్యాపించినంతనే ఒకరాయికి వాసనలు తెలుస్తున్నవట! నీలమేఘశ్యాముని  రూపం కనవచ్చి రాతికి కన్నులు పనిచేయటం మొదలు పెట్టినవట.

చివరిగా ఆ శిల అహల్య ఆకారాన్ని సంతరించుకొన్నది!

ఇంతలో గౌతమ మహర్షి కూడా వచ్చి చేరాడు వారిని.

అహల్య పట్టరాని ఆనందంతో ప్రభువు రూపాన్ని చూస్తూ అలాగే శిలలాగ నిలుచుని ఆనందపారవశ్యంలో మునిగి పోయింది.

గౌతమ మహర్షి ఆతిథ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్య దిక్కుగా ప్రయాణమయినాడు. అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.

Also read: తాటకి వధ

మిధిలా నగరంలో కాలుమోపాడు కోదండపాణి. జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!  మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనక మహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి వినయంగా మహర్షి చెంత నిలుచున్నాడు. జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.

అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడింది! మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.

మహర్షీ వీరిరువురూ ఎవరు?

పద్మపత్రాల వంటి కన్నులు, అశ్వినీ దేవతల సౌందర్యం, దేవతాసమాన పరాక్రమము, గజ సింహ సమానమయిన నడక, చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు? ఎవరివారు నీతో కాలి నడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు?

Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

 జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధాన మిచ్చారు.

‘‘వీరు అయోధ్యా పురాధీశుడు దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు’’ ….. అని చెప్పి

తాటకద్రుంచి వైచి యతిదర్పితుడైన సుబాహుసాయకోత్పాటితు చేసి

గీటడిచి ధర్మ మెలర్పన్ అహల్య శాపముచ్ఛాటన

మొందజేసి కడు సమ్మద మారగ నీగృహంబునం

జాటగనున్న శంకరుని చాపము జూడగ వచ్చిరి ఏర్పడన్..

(పై పద్యం భాస్కర రామాయణంలోనిది)

Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు

తాటకను చంపినవారు వీరే , సుబాహుడిని మృత్యువు కౌగిటిలోకి తోసినది వీరే,

అహల్య శాపవిమోచనము గావించినవారు వీరే ! నీ ఇంట వున్న శివధనుస్సును చూడటానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.

ఇది వింటున్న శతానందులవారు ఆనందంతో ఎగిరి గంతువేసి ఏమిటి మహర్షీ, మా అమ్మ అహల్యకు శాపవిమోచనమయినదా? అని ఆత్రుతతో ప్రశ్నించాడు. శతానందులవారు అహల్యాగౌతముల కుమారుడు.

..

N.B

ఈ వృత్తాంతం ….సహజమయిన మానవ బలహీనతలు మనలను తప్పు చేయించినప్పటికీ ప్రాయశ్చిత్తం చేసుకొని, ఆ తప్పు చేయటం వలన కలిగిన అపరాధభావనలను ధ్యానము, తపస్సు ద్వారా తుడిచివేసుకొని మరల అంతరంగాన్ని పరిశుద్ధమైనదిగా చేసుకున్నట్లయితే చాలు అని చెపుతున్నది.

ఒక తప్పు జరిగిన వెంటనే మనిషిజీవితం నాశనం కారాదు! ప్రాయశ్చిత్తం చేసుకున్న భార్యను స్వీకరించటంలోనే గౌతమమహర్షి యొక్క విశాల హృదయం మనకు తెలుస్తున్నది.

Also read: శ్రీరామ జననం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles