హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ అంశం మంగళవారం విచారణకు వచ్చింది. ఇటీవల సుప్రీం ధర్మాసనం కూడా సమస్య సత్వర పరిష్కారం దిశగా సూచన చేసిన నేపథ్యంలో, తెలంగాణ న్యాయస్థానం కూడా విచారణలో వేగం పెంచింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సమర్పించిన అఫడవిట్ ను పరిశీలించి సానుకూలంగా స్పందించింది. వచ్చే మంగళవారానికి తీర్పును వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్ యాజమాన్యం 2019 జులై 18 వ తేదీన వేసిన అఫడవిట్ లో జాయింట్ వెంచర్ల రూపంలో నిధులను సమకూర్చి, నాలుగు సంవత్సరాల పరిధిలోపలే అన్ని బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని తెలిపింది. తాజాగానూ మరో అఫడవిట్ సమర్పించింది. వివిధ దశల్లో నిధులను సమకూర్చుతామని దాని సారాంశం. మొదటి దశలో 23ఆస్తులకు గాను, 4,413 ఎకరాల్లో లే ఔట్లు, టౌన్ షిప్స్ ద్వారా 2,041కోట్ల 84లక్షల రూపాయలను సృష్టిస్తామని తెలిపింది. వీటి విలువ ఎస్సార్ వాల్యూ ప్రకారం 287కోట్ల రూపాయలుగా ఉంది.
ఓపెన్ మార్కెట్ ప్రకారం 780కోట్ల రూపాయల విలువ చేస్తుంది. దీన్ని వెంచర్లుగా మరలిస్తే తొలి దశలో 2041కోట్ల రూపాయలు జమకాగా, మిగిలిన ఆస్తులను కూడా అదే విధంగా అభివృద్ధి చేసి, వివిధ దశల్లో పూర్తి బకాయిలను చెల్లిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ఈ దిశగా మొదటి దశలో 105కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో కోర్టులో చెల్లిస్తామని తెలియజేసింది. సుమారు 10 కంపెనీలు ఈ వెంచర్లను చేపట్టనున్నాయి. ఆయా సంస్థల నుండి లెటర్ అఫ్ ఇంటరెస్ట్ లను అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు సమర్పించింది.
మిగిలిన ఆస్తుల అభివృద్ధి, నిధుల సేకరణ గురించి ఈ నెలాఖరుకు మరో అఫడవిట్ దాఖలు చేయనున్నట్లుగా సంస్థ తరపున న్యాయవాదులు ఎల్. వి. రవిచంద్ర, కె.జానకిరామిరెడ్డి ధర్మాసనానికి నివేదించారు. మొత్తంగా, 6నెలల నుండి 4సంవత్సరాల లోపు పూర్తి బకాయిలు చెల్లించే ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. తెలంగాణ కస్టమర్స్, ఏజెంట్ల సంఘం పలు విన్నపాలు చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను ఈ అంశంపై కౌంటర్ వేయవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన బాధితుల సంఘాలకు కూడా వారి అభిప్రాయాలను తెలియజేయమని ఆదేశించింది. జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ అమరనాథ్ గౌడ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో మాట ఇచ్చినట్లుగా ఇప్పటికే 263కోట్ల రూపాయలను ఎ పి ప్రభుత్వం అందించింది. రెండవ విడతలో మరో 200కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తంమీద అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేగంగా పడుతున్నట్లు అర్ధమవుతోంది.
Also Read : అగ్రిగోల్డ్ కేసు ఏపీ హైకోర్టుకు బదిలీ చేసే విషయంపైన త్వరలో నిర్ణయం