- సొంతజనంపై సర్జికల్ స్ట్రయికా?
వ్యవసాయచట్టాలు తెచ్చేముందు మమ్మల్ని సంప్రదించనక్కర్లేదా అని మొదటినుంచీ రైతుసంఘాలు అడుగుతున్నాయి. వ్యవసాయబిల్లులపై పార్లమెంటులో తగినంత చర్చ జరపనక్కర్లేదా, మేము సూచించినట్టు అంతముఖ్యమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు ఎందుకు అప్పగించలేదు, ఎందుకు తొందరపడ్డారని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి.
“వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన ఆలోచనలు ఇరవై, పాతికేళ్లుగా చర్చలో ఉన్నాయి; ఆ దిశగా ఎం. ఎస్. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులు పదహారేళ్లుగా పరిశీలనలో ఉన్నాయి. వ్యవసాయసంస్కరణలను తెస్తామని కిందటి యూపీయే ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్ ప్రతిసారీ తన ఎన్నికల ప్రణాళికలో ఆ మాట చెబుతూనే ఉంది. అలాంటప్పుడు మమ్మల్ని సంప్రదించకుండా హఠాత్తుగా చట్టాలు తెచ్చారని రైతుసంఘాలూ, చర్చ జరపలేదని ప్రతిపక్షాలూ ఎలా అంటా”యని ప్రభుత్వమూ, అధికారపక్షమూ అడుగుతున్నాయి.
రాజ్యసభలో అదే వాదాన్ని పునరుద్ఘాటించారు:
సోమవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే వాదాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ప్రభుత్వం వాదన వింటున్నప్పుడు నాకు పాతసినిమాల్లోని ఒక ఫార్ములా కథ గుర్తొచ్చింది. అన్నా-చెల్లెళ్ళు ఉంటారు. చెల్లెలికి కొడుకు పుడతాడు. ఆ తర్వాత అన్నకు కూతురు పుడుతుంది. వెంటనే చెల్లెలి కొడుక్కి అన్న కూతురికి ముడిపెట్టేస్తారు. ఆ పిల్లలిద్దరూ మొగుడూ-పెళ్ళాలన్న ముద్రతోనే పెరుగుతారు. ఓ పదిహేను, ఇరవయ్యేళ్లు గడుస్తాయి. ఈ మధ్యలో అన్నా-చెల్లళ్ళ అంతస్తుల్లో తేడా వస్తుంది. వియ్యమందే విషయంలో పునరాలోచన మొదలవుతుంది. దాంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తుతుంది. దానికి పిల్లల పరిష్కారం, మాయాబజార్ సినిమా కథ తరహాలో ఉండచ్చు, లేదా మరో తరహాలో ఉండచ్చు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసింది మధ్యలో గడిచిన పదిహేను, ఇరవయ్యేళ్ళ కాలాన్ని!
Also Read: ఉద్యమాలకు ఊతం ఇచ్చే నిర్ణయాలు
మరో మలుపూ తిరగవచ్చు:
ఒక్కోసారి ఈ ఫార్ములా కథ ఇంకోరకమైన మలుపు తిరగవచ్చు. ఉదాహరణకు, అబ్బాయి కాలేజీకి వెళ్ళాక వేరొక అమ్మాయి ప్రేమలో పడతాడు. అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళాక వేరొక అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు మాత్రం, ఇరవయ్యేళ్ళ క్రితమే నిర్ణయించినట్టుగా ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. తమ ప్రేమవిషయం తల్లిదండ్రులకు ఎలా చెప్పాలా అని అబ్బాయి, అమ్మాయి మథనపడుతుండగానే, మీ పెళ్ళికి ముహూర్తం పెట్టేశామని తల్లిదండ్రులు ‘హఠాత్తుగా’ వాళ్ళకు చెబుతారు. దాంతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఘర్షణ మొదలవుతుంది. మాకు సంబంధించిన ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని మమ్మల్ని సంప్రదించకుండా ఎలా తీసుకుంటారని పిల్లలు అడుగుతారు. మీ చిన్నప్పటినుంచీ అనుకుంటున్నదే; కొత్తగా మిమ్మల్ని సంప్రదించేదేమిటని తల్లిదండ్రులు గదుముతారు. చివరికిది ఏ మలుపు తిరుగుతుందనేది వేరే విషయం. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవలసింది మధ్యలో గడిచిన పదేహేను, ఇరవయ్యేళ్ళ కాలాన్ని!
తాంబూలాలిచ్చేశాను, తన్నుకుచావండి:
వ్యవసాయసంస్కరణలపై ఇరవయ్యేళ్లుగా చర్చ జరుగుతోందంటున్న ప్రభుత్వం ఇక్కడ తల్లిదండ్రుల పాత్రను అభినయిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డన్న అగ్నిహోత్రావధానుల పాత్రను పోషిస్తోంది. వ్యవసాయసంస్కరణల ఆలోచన ఎప్పటినుంచో ఉండవచ్చు, ఆయా పార్టీలు ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఉండవచ్చు, కానీ, మా జీవితాలతో ఎంతో గాఢంగా ముడిపడిన వ్యవసాయరంగానికి సంబంధించి ఇంత కీలకనిర్ణయాన్ని కనీసం మమ్మల్ని సంప్రదించకుండా హఠాత్తుగా ఎలా తీసుకుంటారని అడుగుతున్న రైతు సంఘాలూ; పార్లమెంటులో తగినంత చర్చ జరపద్దా అని అడుగుతున్న ప్రతిపక్షాలూ ఇక్కడ పిల్లల పాత్రను పోషిస్తున్నాయి.
ఫార్ములా కథకు అతికినట్టు పోలిక:
ఈ వివాదానికి పై ఫార్ములా కథతో ఎంత అతికినట్టు పోలిక కుదురుతోందో చూడండి. మధ్యలో పదిహేను, ఇరవయ్యేళ్లు గడిచాయి కనుకా, పిల్లలు కూడా తమకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఏర్పరచుకుంటారు కనుకా, ఒకసారి వాళ్ళకు చెప్పి, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే ముందడుగువేద్దామన్న ఆలోచన తల్లిదండ్రులలో లోపించినట్టే; రైతుల విషయంలో మోడీ ప్రభుత్వంలోనూ లోపించింది. ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన మాటతో చెప్పాలంటే, ఈ హఠాత్ నిర్ణయం రైతులపై ‘సర్జికల్ స్ట్రైక్’!
Also Read: భద్రతా దళాల పహరాలో రైతుల రాస్తారోకో
అనూహ్యంగా బూమరాంగ్:
అయితే ఇది సొంతజనం మీద సర్జికల్ స్ట్రైక్ కావడంతో ఊహించనివిధంగా బూమరాంగ్ అయింది. రైతుల నిరసన తీవ్రత చూశాక ఏదో ఒక రూపంలో వెనకడుగు వేయవలసిన అవసరాన్ని మోడీ ముందే గుర్తించి ఉంటారు. కానీ ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే ఇన్నేళ్లలో మొదటిసారి ఓటమిని అంగీకరించినట్లై తన ప్రభుత్వం ఇమేజితోపాటు వ్యక్తిగతంగా తన ఇమేజి కూడా దెబ్బతినిపోతుందని ఆయన భావించి ఉంటారు. ఒకవేళ ఓటమిని ఒప్పుకోవలసివచ్చినా అందులో కూడా తన చేయే పైన ఉండాలి కానీ, రైతులు అడిగింది చేసి వారిది పై చేయి కానివ్వకూడదు! రైతులు కోరినట్టు వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించే బదులు, ఏణ్ణర్థంపాటు వ్యవసాయచట్టాల అమలును సస్పెండ్ చేయడం అందుకే!
కొత్త చట్టాలు చేయడం కష్టం కాద:
నిజానికి చట్టాలను రద్దు చేసుకుని రైతులను, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని కొత్తచట్టాలను చేయడం ఏమంత కష్టం కాదని నిపుణులు అంటున్నారు. కానీ ఇక్కడ అసలు సమస్య సొంత ఇమేజికి జరిగే నష్టంగురించిన భయమూ, ఆపైన అహమూ. అలాకాకుండా ప్రజాస్వామికస్ఫూర్తిని తెచ్చుకుని, ఆలోచనను ‘తన’వైపునుంచి తప్పించి రైతులవైపు తిప్పి వారి మనోభావాలకు ప్రాధాన్యమిచ్చి ఉంటే నిజానికి మోడీ ఇమేజ్, ప్రభుత్వం ఇమేజ్ ఇంకా పెరిగి ఉండేవి. ఎంతసేపూ ఏకపక్షంగానే తప్ప రెండోవైపు చూడడానికి ఇష్టపడని వ్యక్తులకు అలాంటి ఆలోచన రాదు.
ఇమేజ్ కాపాడుకోవడం ముఖ్యం:
చివరికి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇమేజ్ ను కాపాడుకుంటున్నామనుకుంటూ మరింత తప్పుడు ఇమేజ్ అనే ఊబిలోకి దిగబడాల్సివస్తోంది. చిక్కుముడిని విప్పుకుంటున్నామనుకుంటూ మరిన్ని చిక్కుముడులు వేసుకోవలసివస్తోంది. రైతుల నిరసన వెనుక పాకిస్తాన్ హస్తం, ఖలిస్తాన్ తీవ్రవాదులు, మావోయిస్టులు, అంతర్జాతీయకుట్రదారులు అడుగుపెట్టింది అలాగే. ఈ జాబితా ముందుముందు ఇంకెంత పెరుగుతుందో తెలియదు. తాజాగా, ఆందోళనజీవులు, విదేశీవిచ్ఛిన్నకర భావజాలాలు(ఫారిన్ డిస్రప్టివ్ ఐడియాలజీస్-ఎఫ్. డి. ఐ) అనే రెండు కొత్త మాటలను కూడా సృష్టించి మోడీ ప్రయోగించారు. తమ పార్టీకి కూడా గతంలో ఆందోళనలు జరిపిన చరిత్ర ఉంది, ముందు ముందు కూడా తాము ఆందోళనలు జరపవలసి రావచ్చు. అయినాసరే, ‘ఇమేజి పరిరక్షణ’ అనే విఫలయత్నంలో ఆ స్పృహ ఉండదు. గతంలో తనపై ప్రతిపక్షాల దాడి పెరిగినప్పుడల్లా ఇందిరాగాంధీ ‘విదేశీహస్తం’ గురించి మాట్లాడేవారని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. రేపు మోడీగారి గురించి కూడా అదే చెప్పుకుంటాం.
Also Read: రైతుల ఆందోళనపై రాజ్యసభలో విపక్షాలు గరం గరం