అమరావతి : అగ్రిగోల్డ్ కేసు విచారణను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ బుధవారంనాడు ఏపీ అడ్వకేట్ జనరల్ దరఖాస్తు చేయబోతున్నారని తెలంగాణ హైకోర్టులో మంగళవారంనాడు ఏపీ ప్రభుత్వ న్యాయవాది శంసన్ తెలియజేశారు. 23 ఆస్తులలో జాయింట్ వెంచర్ ల ద్వారా అభివృద్ధి చేసి రూ. 2040 కోట్లు 15 నుంచి 60 మాసాలలో సమకూర్చడానికి అనుమతించవలసిందిగా అగ్రీగోల్డ్ సంస్థ హైకోర్టును అభ్యర్థిస్తూ దరాఖాస్తు చేసినట్టు ఆ సంస్థ తరఫు న్యాయవాది ఎల్. రవిచందర్ తెలియజేశారు. అటాచ్ చేసిన ఆస్తులు విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పటిషన్లను ఉపసంహరించుకోవడంతో వాటిని హైకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్ ముందు ఈ కేసు విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ చేసుకున్న తాజా దరఖాస్తుపైన హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలూ, కేంద్ర ఆర్థిక శాఖ, ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ కూ, పిటిషనర్ ఆండాళ్ రమేష్ బాబుకూ నోటీసులు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న అభ్యర్థనపైన దాఖలు కాబోయే పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. అయితే, అగ్రిగోల్డ్ కేసు బదిలీపైన న్యాయపరమైన నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నదని జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, అమర్ నాథ్ గౌడ్ బెంచ్ ఇప్పటికే స్పష్టం చేసింది.