సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియాలో నెలకొల్పిన సోలార్ విద్యుత్ ప్లాంటు నుండి 30 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఓపెన్ యాక్సిస్ కోసం తెలంగాణ ట్రాన్స్ కో, నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, సింగరేణి సంస్థల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధలో శుక్రవారం (జనవరి 8) మూడు సంస్థలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో సింగరేణి మణుగూరు ప్లాంటు నుండి టిఎస్ ట్రాన్స్ కో లైన్ల ద్వారా అనుసంధానం చేసిన 30 మెగావాట్ల విద్యుత్తును మణుగూరు, ఇల్లందు ఏరియాల్లో వినియోగించుకోవడానికి, మిగులు విద్యుత్తును ట్రాన్స్ కో కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరింది.
స్థానిక అవసరాలకే మణుగూరు విద్యుత్:
మణుగూరు ప్లాంటుకు సంబంధించి పాతికేళ్ల ఉత్పత్తి ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రాథమికంగా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం కుదుర్చుకొన్నారు. రెండేళ్ల తర్వాత ఈ ఒప్పందాన్ని తిరిగి రెన్యూవల్ చేస్తూ ఉంటారు. మణుగూరు సోలార్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్తులో 90 శాతం విద్యుత్తును మణుగూరు ఏరియా స్థానిక అవసరాలకే వినియోగించనుంది. వాడుతున్న విద్యుత్తులో 65 శాతం కంపెనీ సిబ్బంది, కార్యాలయాల అవసరాలకు వాడుతుండగా మరో 25 శాతం సోలార్ విద్యుత్తును పారిశ్రామిక అవసరాల కోసం గనుల్లో వినియోగిస్తున్నారు. ఇంకా మిగిలిన 10 శాతం విద్యుత్తును ఇల్లందులో గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు.
ఇదీ చదవండి:సింగరేణి అధికారులకు పిఆర్‌పి చెల్లింపుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
మణుగూరు సోలార్ విద్యుత్ తో కోటి రూపాయలకు పైగా ఆదా:
మణుగూరు ఏరియాలో సింగరేణి సంస్థ తన పారిశ్రామిక అవసరాలకు నెలకు 40 లక్షల యూనిట్లు, గృహ అవసరాలకు 10 లక్షల యూనిట్లు ట్రాన్స్ కో విద్యుత్తు వినియోగిస్తోంది. అయితే 30 మెగావాట్ల సోలార్ ప్లాంటు ప్రారంభమయ్యాక పారిశ్రామిక అవసరాలకు వాడే 40 లక్షల యూనిట్లలో 33 లక్షల యూనిట్లను సోలార్ ప్లాంటు ద్వారానే సేకరించనుంది. అలాగే గృహ అవసరాలకు వాడే 10 లక్షల యూనిట్లలో 9 లక్షల యూనిట్లను కూడా సోలార్ ప్లాంటు నుండే వాడుకోనున్నది. సోలార్ విద్యుత్తు వాడకంతో నెలకు కోటి 20 లక్షల రూపాయల దాకా విద్యుత్తు ఖర్చులను ఆదా చేయనుంది.
సంస్థ ఛైర్మన్&ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు డైరెక్టర్ ఇ&ఎం శ్రీ డి.సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని ఏరియాలలో కలిపి 300 మెగావాట్ల సోలార్ ప్లాంటుల నిర్మాణం వేగంగా సాగుతోందనీ, ప్లాంటులన్నీ విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తే సింగరేణి కంపెనీకి ఏడాదికి సుమారు 100 నుండి 120 కోట్ల రూపాయల వరకూ ఆదా చేయొచ్చని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (వర్క్ షాప్స్ & ఎనర్జీ మేనేజిమెంట్) శ్రీ ఎన్.నాగేశ్వర్ రావు, ఎస్.ఇ. శ్రీ సి.హెచ్.ప్రభాకర్, టి.ఎస్. ట్రాన్స్ కో (కమర్షియల్ & ఆర్.ఎ.సి.) సి.ఇ. శ్రీ వివేకానంద్, ఎస్.ఇ. శ్రీ కరుణాకర్, టి.ఎస్. నార్తరన్ పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీ నుండి సి.జి.ఎం. శ్రీ మధుసూధన రావు, ఎ.ఇ. శ్రీ శ్రీపాల్ (వరంగల్) పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సింగరేణిలో ఉద్యోగాల జాతర