మృతి చెందిన పగటి కలలు,
దుఃస్వప్న కాష్టాలుగా మనసులో
పేర్చుకొని మిగిలి పోతాయి.
అప్పుడప్పుడు ఒక గత స్మృతి మెరుపులా మెరిసి,
తీక్షణ జ్వాలగామారి గుండె ను కాల్చేటప్పుడు
ఒక అశ్రు ధార ఆ చితి మంటలపైకి పారి
మెల్ల మెల్లగా ఆర్పడానికి ప్రయత్నిస్తుంది.
పచ్చిక మైదానంలో మంద పవనాల సాధు స్పర్శ
సాంత్వన చేకూర్చదు.
చల్లని యమునా జలం లో ముంచిన చేయి
భగ్గు న మండుతుంది.
కాలిక్రింది ఇసుక రేణువులు సుడిగాలి కి రేగినపుడు
శతకోటి శంకరులు ప్రమథ గణాలతో కలిసి
నా చుట్టూ ప్రళయ నర్తన చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఆకాశంలో విరిసిన ఇంద్రధనుస్సు
ఒక్కసారిగా నల్లని ఏడు పడగల నాగుగా మారిపోతుంది.
భయంతో నా గది తలుపులు, కిటికిలు మూసి,
ఆ వేడిలో, స్వేద తప్తుడనై, చీకటి ఇచ్చిన అభయం తో
ఓదార్చే ఒంటరితనపు నిశ్శబ్ద నిస్వనాలు వింటూ
కాలం గడిపేస్తాను.
అయినా గుండె లోతులలో మెలికెలు తిరుగుతున్న
ఒకింత ఆశ వ్యధా కుడ్యాల వెనుకనుండి
అప్పుడప్పుడు నవ్య కాంతి కై తొంగిచూస్తుంది.
Also read: అక్షర క్షేత్రం
Also read: చవుడు భూమి
Also read: పాత కథ
Also read: చరిత్ర
Also read: భాష్పాంజలి