- లేఖలో రాసిన అంశాలనే అజేయ కల్లం ప్రస్తావించారు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ అంటా చూశాను.
- కోర్టు ధిక్కారం కోర్టుకూ, ధిక్కరించిన వ్యక్తికీ మధ్య విషయం
- క్రిమినల్ కేసు పెట్టమని అడిగే హక్కు ఇతరులకు లేదు
- ఉపాధ్యాయకు వేణుగోపాల్ సమాధానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ, ఆయన ప్రధాన సలహాదారు అజేయ కల్లంనూ కోర్టు ధిక్కార నేరం కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని కోరుతూ దిల్లీ అడ్వకేట్, బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ రెండో విడత చేసిన విజ్ఞప్తిని భారత అటార్నీ జనరల్ కె. కె. వేణుగోపాల్ తిరస్కరించారు.
మొదట ఉపాధ్యాయ రాసిన ఉత్తరానికి 02 నవంబర్ 2020న వేణుగోపాల్ సమాధానం ఇచ్చారు. అనుమతి మంజూరు చేయడం సాధ్యం కాదని అప్పుడే తేల్చి చెప్పారు. కానీ కొత్త నిబంధనలను ఉటంకిస్తూ అనుమతి మంజూరు చేయవలసిందిగా కోరుతూ 05 నవంబర్ 2020న ఉపాధ్యాయ రెండో సారి లేఖ రాశారు. దానికి 07 నవంబర్ 2020న వేణుగోపాల్ సవివరంగా సమాధానం ఇస్తూ, కోర్టు ధిక్కారం అన్నది కోర్టుకూ, ధిక్కరించిన వ్యక్తికీ మధ్య వ్యవహారమనీ, కోర్టు లో కేసు పెట్టి విచారించాలని డిమాండ్ చేసే హక్కు ఇతరులు ఎవ్వరికీ లేదనీ స్పష్టం చేశారు.
లేఖ రహస్య పత్రం కాదు
‘‘(అజేయ కల్లం నిర్వహించిన) విలేఖరుల గోష్ఠిని నేను స్వయంగా చూశాను. భారత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖలో ఉన్న అంశాల కంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. మీడియాకు విడుదల చేసిన లేఖలోనే కోర్టు ధిక్కార నేరానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆ లేఖ ప్రతిని మీరు మీ లేఖతో జత చేశారు. నేను చదివాను. ఆ లేఖలో ఎక్కడ అది రహస్య పత్రం అని రాయలేదు. మీడియాకు విడుదల చేయడం, లేఖాంశాలను పత్రికలలో విరివిగా ప్రచురించడం జరిగిపోయింది. కనుక అదేదో రహస్య పత్రం అని చెప్పడానికి లేదు,’’ అని వేణుగోపాల్ వివరించారు. ఈ కారణం వల్ల తన నిర్ణయం మార్చుకోవలసిన అవసరం కనిపించడం లేదని అటార్నీ జనరల్ అన్నారు.
సుప్రీం కావాలనుకుంటే సూమోటోగా విచారించవచ్చు
‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోనే కోర్టు ధిక్కరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. కనుక ఎవ్వరూ అడగకుండానే సూమోటో గా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ ఆరోపణపైన విచారణ చేయవచ్చు. అది కోర్టు ధిక్కరణ చట్టం లోనూ, దాని కింద చేసిన నిబందనలలోనూ స్పష్టంగా ఉంది. విషయం అంతా ప్రధాన న్యాయమూర్తికి తెలుసు కనుక నేను మీకు అనుమతి మంజూరు చేయడం ద్వారా ఈ అంశంపైన నిర్ణయం తీసుకొనే ప్రధాన న్యాయమూర్తి అధికారాన్ని వమ్ము చేయడం భావ్యం కాదు’’ అంటూ ఉపాధ్యాయకు వేణుగోపాల్ వివరించారు. ‘‘కోర్టు ధిక్కరణ అనేది కోర్టుకూ, ధిక్కరించిన వ్యక్తికీ మధ్య విషయం, అంతే కానీ కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని అడిగే హక్కు మరో వ్యక్తికి ఉండదని మీకు తెలియంది కాదు,’’ అన్నారు. ఈ కారణాల వల్ల తన నిర్ణయాన్ని పున:పరిశీలించలేని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు.
‘అయినా మీరు కోర్టులో ఈ విషయం ప్రస్తావించవచ్చు’
అయితే, తాను అనుమతి నిరాకరించినంత మాత్రాన ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎదుట ప్రస్తావించే హక్కు ఉపాధ్యాయకు ఉంటుందనీ, ఈ హక్కును లిఖిత పూర్వకంగానైనా, కోర్టు దృష్టికి మరో విధంగా తీసుకురావడం ద్వారానైనా అమలు చేసుకోవచ్చుననీ వేణుగోపాల్ చెప్పారు. ఆయన అప్పటికీ పిటిషనర్ కనుక కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు.