వోలేటి దివాకర్
మచ్చలేని చంద్రులు…. మరకలేని జగన్లు నేటి రాజకీయాల్లో దాదాపు ఉండరు. రాజకీయ ప్రేరేపితమో… స్వయంకృతమో రాజకీయ నాయకులందరి పైనా చిన్నా పెద్ద కేసులు ఉన్నాయి…ఉంటాయి. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నైపుణ్యాభివృద్ధి కుంభకోణం లోతుల్లోకి వెళ్లదలుచుకోలేదు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసులు గానీ… టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై ఉన్న ఓటుకు నోటు, నైపుణ్యాభివృద్ధి కేసులు గానీ న్యాయస్థానాల్లో తేలే వరకు ఎవర్నీ దోషులుగా తేల్చలేము. ఈ కేసుల్లో తీర్పులు పలు విధాలుగా ప్రభావితమవుతాయి. అయితే, నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబునాయుడు జైలు ఊచలు లెక్కించడమే అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిత్యం వందల మంది నాయకులు, కార్యకర్తల మధ్య బిజీగా గడిపే చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాకులో ఒంటరి పక్షిగా ఉండటం టిడిపి శ్రేణులను బాధిస్తోంది. తమ నేత జైలుకే వెళ్లరని మొన్నటి వరకు వారు ధీమాగా ఉండేవారు.
అనుకున్నదొక్కటీ…
నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పాటు, ఎల్లో మీడియా, ఇటు నీలి మీడియా, వై ఎస్సార్సిపి శ్రేణులు ఆనందం పంచుకున్నాయి. ఈ విషయంలో ఎవరి కారణాలు వారికున్నాయి. చంద్రబాబునాయుడు కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్ పై విడుదలవుతారని టిడిపి శ్రేణులు ఎంతో ఆశాభావంతో ఉన్నాయి. ఒక పత్రిక అయితే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అరెస్టుతో పోల్చి త్వరలో వచ్చే ఎన్నికల్లో అధికారం తెలుగుదేశం పార్టీదేనని తేల్చేసింది. అయితే పార్టీ, పచ్చమీడియా ఆశించిది ఒకటైతే జరిగింది మరోటి. అరెస్టు అయిన వెంటనే ప్రజల్లో సానుభూతితో పాటు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబునాయుడు నంద్యాల నుంచి విజయవాడ ఎసిబి కోర్టు వరకు కారులో చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే సిఐడి అధికారులు హెలికాఫ్టర్ ఏర్పాటు చేస్తామన్నా వద్దన్నారు. విజయవాడ తరలించే సందర్భంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి అడ్డుకుంటారని తద్వారా రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని ఆశించారు. మరునాడు టిడిపి ఇచ్చిన బంద్ పిలుపునకు కూడా ఊహించినంత స్పందన కనిపించలేదు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే వరకు దాదాపు ఇదే పరిస్థితులు కనిపించాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయం కూడా వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. మరోవైపు జి-20 దేశాధినేతల సదస్సులో కేంద్రంలోని బిజెపి నేతలు బిజీగా ఉండటంతో చంద్రబాబు అరెస్టు వార్తకు జాతీయస్థాయిలో తగిన ప్రాధాన్యత దక్కలేదు. బిజెపిలోని టిడిపి అనుకూల నేతలు కూడా మనసారా స్పందించే అవకాశం లేకుండాపోయింది.
Also read: మన బెజవాడ బంగారం…. కాదు ప్లాటినం
మరోవై పు ఎసిబి కోర్టులో బెయిల్ సాధించేందుకు టిడిపి దేశంలోనే ఖరీదైన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను రంగంలోకి దించినా ప్రయోజనం లేకుండాపోయింది.
ఆతరువాతైనా ఆశించిన ఫలితం రాలేదు. బెయిల్ మాట పక్కన పెడితే. కనీసం గృహ నిర్బంధానికి కూడా న్యాయమూర్తి అనుమతివ్వకపోవడంతో టిడిపి శ్రేణులు ఎసిబి న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం సాగించాయి. దీంతో చంద్రబాబును జైల్లోనే ఉంచాలన్న పట్టుదలతో అధికార పార్టీ న్యాయ విభాగం రెట్టించిన ఉత్సాహంతో వరుసపెట్టి పిటిషన్లు వేస్తోంది. సిద్ధార్థ లూథ్రా కూడా ఒకదశలో సహనం కోల్పోయి ఇక కత్తి పట్టాల్సిందేనని ట్విట్టర్ వేదిక వ్యాఖ్య చేయడం గమనార్హం.
బిజెపి మైనస్ ?…..జనసేన ప్లస్…
చంద్రబాబు అరెస్టు తరువాత పార్టీకి జరిగిన లాభ నష్టాలను అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా వాదించినా బాబుకు రిమాండ్ తప్పలేదు. అరెస్టు సందర్భంగా చంద్రబాబునాయుడు సిఐడి అధికారులతో చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. నైపుణ్యాభివృద్ధి కేసులో తీవ్రత ఉన్నా…తనపై అభియోగాలకు ఆధారాలు లేవు కదా అని ఆయన వాదించారు. అయితే ఈ కుంభకోణం జరిగింది ఆయన హయాంలోనే అన్న సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. చంద్రబాబు వ్యవహారంలో బిజెపి కూడా లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
తన మరిది అరెస్టు అయిన వెంటనే ఖండించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ తరువాత మిన్నకుండిపోయారు. టిడిపి బంద్ కు మద్దతు ఇవ్వాలని ఆశించినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది. టిడిపి నుంచి వెళ్లిన వారు, తెలంగాణా బిజె పి నాయకులు మినహా, జి-20 సదస్సు తరువాత కూడా.. జాతీయస్థాయి బిజెపి నేతలు ఎవరూ చంద్రబాబునాయుడు అరెస్టును ఖండించకపోవడం గమనార్హం. వ్యవహారం బిజెపి పెద్దలకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో బిజెపి పెద్దలకు చంద్రబాబు ఇప్పటికీ ఇష్టుడు కాలేకపోయారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు చంద్రబాబు అరెస్టును ఖండించినా బంద్ కు మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసులో ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు చంద్రబాబు అరెస్టు వల్ల టిడిపి- జనసేన బంధం మరింత బలపడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించడంతో పాటు, రాజమహేంద్రవరం వెళ్లి రిమాండ్ లో ఉన్న చంద్రబాబును కూడా పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. అలాగే టిడిపి పిలుపు ఇచ్చిన బంద్ లో జనసేన పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. ఈ పరిణామాలు చూస్తే వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, జనసేన, వామపక్షాలు ఒక కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తీరు ఇలాగే కొనసాగితే టిట్ ఫర్ టాట్ తరహాలో చంద్రబాబు ఇండియా కూటమిలో చేరితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కూటమితో జట్టు కట్టే అవకాశాలు కనిపిసున్నాయి.
Also read: అందుకేనా గద్దర్ లో ఆ మార్పు?!