అఫ్ఘాన్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. రోజురోజుకు హింస పెరుగుతోంది, తాలిబాన్ ఆగడాలు శృతి మించుతున్నాయి. అక్కడ పరిణామాలు భారత్ కు తలనొప్పిగానే మారేట్లు ఉన్నాయి. ప్రస్తుతం 85 శాతం అఫ్ఘాన్ భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబాన్ తాజాగా చేసిన ప్రకటన మారుతున్న చిత్రపటాన్ని అద్దంలో చూపిస్తోంది. మూడు దశాబ్దాల నుంచి శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. ఆగస్ట్ 31కల్లా తమ మిలటరీ మిషన్ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. ఇప్పటికే దళాల ఉపసంహరణ ప్రక్రియ చాలా వరకూ జరిగిపోయింది. మరో తరం అమెరికన్లను అఫ్ఘాన్ కు పంపే ప్రసక్తే లేదంటూ అమెరికా చేతులేత్తేసింది.
Also read: వైఎస్ ఆర్ టీపీ ఆవిర్భావం
నంగనాచి పాకిస్తాన్
అఫ్ఘాన్ లో పరిస్థితి దిగజారుతోందని పాకిస్తాన్ నంగనాచి మాటలు మాట్లాడుతోంది. పాకిస్తాన్ భయమంతా కాందిశీకులను భరించాల్సి వస్తుందని తప్ప వేరు కాదు.అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ కు అడ్డుఆపులేకుండా పోయింది. చెలరేగిపోతున్నారు. సరిహద్దు నగరం ఇస్లాం కలాను కూడా తాజాగా ఆక్రమించారు. ఇరాన్ సరిహద్దు నుంచి చైనా సరిహద్దు వరకూ మొత్తం తాలిబాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా -తాలిబన్ మధ్య ఏదో ఒప్పందం కుదిరినట్లు అనిపిస్తోంది. అందుకే, ఆమెరికా తోకముడిచి వెళ్లిపోయింది. అఫ్ఘాన్ ప్రజలను, భారత్ వంటి దేశాలను మీ చావు మీరు చావండని అమెరికా తాత్పర్యంగా అర్ధమావుతోంది. రేపో మాపో తాలిబాన్ చేతుల్లోకి అఫ్ఘాన్ వెళ్ళిపోతుంది. దళాల ఉపసంహరణతో, ఈ చర్యకు అమెరికా పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ అంతంతోనే తమ ముఖ్యమైన మిషన్ పూర్తయిందని అమెరికా భావించింది. కానీ, అల్ ఖైదా పూర్తిగా అంతమవ్వలేదనే స్పృహ కోల్పోయింది. గతంలో అఫ్ఘాన్ పై రష్యా ఆధిపత్యాన్ని నిలువరించడానికి పాకిస్తాన్ ద్వారా నిధులు సమకూర్చి అప్పటి ప్రభుత్వ వ్యతిరేకులైన తాలిబాన్ ను అమెరికా ప్రోత్సహించిందని ప్రపంచదేశాలకు తెలుసు. ఇప్పుడు కూడా అవసరమైతే పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని వాడుకుంటుంది.
Also read: మంత్రమండలి విస్తరణ ఎన్నికల కోసమే!
తాలిబాన్ తో అమెరికా చర్చలు
తాలిబాన్ తో చర్చల పర్వం డోనాల్డ్ ట్రంప్ సమయంలోనే మొదలైంది. ఇప్పటికి ఆ మిషన్ విజయవంతమయ్యింది. అఫ్ఘాన్ లో అష్రాఫ్ ఘనీ పాలన అంతమొందే తరుణం ఆసన్నమైంది.ఆ దేశంలో ఎవరు అధికారంలో ఉన్నా, అశాంతి తాండవించినా, ఇస్లామిక్ ఉగ్రవాదం శృతిమించి సాగినా, భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు ఎదురైనా ఆమెరికాకు వాటన్నిటితో ఎటువంటి పనిలేదు. తన స్వార్థం, తన ప్రయోజనాలు తనవే అన్నట్లుగా ఉంది. ఇటు భారత్ తో -అటు పాకిస్తాన్ తోనూ సంబంధాలను పెంచుకుంటూనే ఉంది. ఉగ్రవాదం ముదిరితే మళ్ళీ అమెరికాకు దెబ్బపడక తప్పదు. చైనాకు వ్యతిరేకంగా దేశాలను ఏకం చేస్తే సరిపోదు, ఉగ్రవాదాన్ని అణచివేయకపోతే రాబోయే కాలంలో వచ్చే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఆ దిశగా ఇప్పటికైనా అలోచించాలని పరిశీలకులు, నిపుణులు చేసే హెచ్చరికలను అమెరికా పెడచెవిన పెట్టడమే పెద్ద విషాదం. ప్రస్తుతం జమ్మూలో వరుసగా జరుగుతున్న సంఘటనలు భావి ప్రమాదఘంటికలను మ్రోగిస్తున్నాయి. తాలిబాన్ తాజా చర్యలకు అఫ్ఘాన్ ప్రజలేకాక, సరిహద్దు దేశాలైన తజకిస్థాన్,ఉజ్బెకిస్థాన్ ప్రజలు కూడా హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే తజకిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్ లోని చాలా జిల్లాలు తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఉజ్బెకిస్థాన్ లోని వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు సాధించడానికి తాలిబన్ ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. వారి ఛాందస ప్రవర్తనకు అఫ్ఘాన్ ప్రజలు గతంలో అల్లాడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితులు రాబోతున్నాయని ఉలిక్కిపడుతున్నారు. తాలిబాన్ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ ఉగ్రవాదం పెరగడం, అంతర్గత భద్రతలు ప్రమాదంలో పడడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాదం నుంచి శాశ్వత స్వేచ్ఛ దిశగా ప్రపంచదేశాలు చర్యలను తీవ్రతరం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది. అఫ్ఘాన్ తాజా పరిణామాల నేపథ్యంలో, భారత్ వేసే అడుగులు కీలకం.
Also read: భారత్ మెడకు తాలిబాన్ ఉచ్చు