అఫ్ఘానిస్థాన్ ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయారు. ఆ దేశ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే రాజ్యం తాలిబాన్ కు అప్పగించేసింది. ఇక విశృంఖ రాక్షస పాలన మొదలైనట్లే. ఆ ఛాందస, మూఢ కరకు ఖడ్గాల ఏలుబడిలో అతివలు, అబలులు అష్టకష్టాలు అనుభవించాల్సిందే. కొన్నేళ్లుగా ఎంతోకొంతగా అనుభవించిన స్వేచ్ఛ నేటితో హరీ అంది. ఇక, భారతదేశం ప్రతిక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. పాకిస్తాన్ కు కొత్త రెక్కలు వచ్చాయి. ఉగ్రవాదుల ఊడలు పెరగనున్నాయి.
Also read: స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినప్పుడే పండుగ
అంతా అమెరికా నిర్వాకమే
ఈ పాపంలో పరోక్షంగా అమెరికాకు వాటా ఉందనే చెప్పాలి. ఒకప్పుడు, పాకిస్తాన్ అండతో, రష్యాకు వ్యతిరేకంగా, తాలిబాన్ ను పెంచి పోషించింది అమెరికానే. దళాలను వాపసు తీసుకొని, నేడు తాలిబాన్ బలాన్ని పెంచింది ఆ అగ్రరాజ్యమే. ఏ క్షణంలోనైనా తాలిబాన్ చేతుల్లోకి అఫ్ఘానిస్థాన్ వెళ్లిపోతుందని అందరూ ఊహించారు. వారం రోజుల లోపే అధికారం మా కైవసమవుతుందని ఆ ముఠా చెప్పనే చెప్పింది. అంతకంటే తొందరగానే రాజ్యాన్ని లాక్కుంది. ఇంతకాలం అఫ్ఘాన్ ప్రభుత్వ దళాలకు అమెరికా అత్యాధునిక ఆయుధ సామాగ్రిని ఇచ్చింది, అద్భుతమైన శిక్షణ ఇచ్చింది. అయినా, తాలిబన్ తో ప్రతిదాడి చేయలేక పోయారు. చేష్టలుడిగి దేశాన్ని అప్పగించేశారు. అమెరికా దళాల ఉపసంహరణతోనే అఫ్ఘాన్ ప్రభుత్వం రెక్కలు విరిగిపోయాయి. అదనుచూసిన ముఠా అన్నంత పనీ చేసింది. బిన్ లాడెన్ హతంతోనే అమెరికాకు అఫ్ఘాన్ తో పని అయిపొయింది. నిజం చెప్పాలంటే తాలిబాన్ సంఖ్య కంటే అఫ్ఘాన్ దళాల సంఖ్య చాలా ఎక్కువ. తాలిబాన్ సంఖ్య 75 వేలకు మించిలేదని, అఫ్ఘాన్ సైనికులు మూడు లక్షల వరకూ ఉంటారని సమాచారం. అధికారం, సంఖ్యాబలం, ఆయుధబలం ఉండి కూడా ప్రభుత్వం తాలిబాన్ ను ఏమీ చేయలేక పోవడం విషాదం,విభ్రమం. వారు మెల్లగా ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ, దూకుడు పెంచి దేశం మొత్తాన్ని ఆక్రమించేసుకున్నారు. ఈ విషయంలో అమెరికా అంచనాలు తప్పాయా? లేక ఆన్నీ తెలిసీ,మౌనముద్ర వహించిందా? అనే అనుమానాలు కమ్ముకుంటున్నాయి. ఉగ్రవాదులను గాలికి వదిలేస్తే, అగ్రరాజ్యానికి ఏదో ఒక రోజు మళ్ళీ దాడులు,తిప్పలు తప్పవు.ఆ తరుణంలో పాకిస్తాన్ తో స్నేహం కూడా అక్కరకు రాదు.
Also read: ఈ తీరు మారదా?
చైనా, రష్యాల లాలూచీ
నేటి తాలిబాన్ విజయం వెనుక పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యా అందించిన సహకారం కూడా ఉందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. తాలిబాన్ పాలనా భయంలో మహిళలు, మైనారిటీలు, మానవహక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఆందోళనకు గురి అవుతున్నారు. సంధి కుదుర్చుకొని అధికారాన్ని పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ వారికి సందేశం పంపారు. దేశాన్ని ఆక్రమించుకొని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలనే కుట్రలో ఉన్న తాలిబాన్ కు ఈ శాంతిసందేశాలు ఎందుకు తలకు ఎక్కుతాయి? అంతర్జాతీయ సమాజాలకు అఫ్ఘాన్ ప్రభుత్వం ఎన్నో విన్నపాలు చేసింది. పిల్లలు,పౌరులు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇళ్ళు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేల కుటుంబాలు తరలి పోతున్నాయి. మమ్మల్ని అరాచకత్వంలో వదిలేయకండి.. అంటూ ఆ మధ్య అఫ్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ప్రపంచ దేశాధినేతలకు విజ్ఞప్తి చేశారు. మా దేశంలో శాంతిని నెలకొల్పండంటూ లక్షల హృదయాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. ఉగ్రవాదం పెరిగితే ఈ దుస్థితి రేపు ఏ దేశానికైనా రావచ్చు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా అంతమొందించడంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలి. ముఖ్యంగా అగ్రరాజ్యాలన్నీ కలిసి రావాలి. లేకపోతే నరమేధంకు, ఘోరకలికి ఎన్నో దేశాలు దెబ్బతింటాయి. పాపం అఫ్ఘానిస్థాన్!
Also read: మహానగరాలు నీట మునిగిపోతాయా?