అఫ్ఘాన్ లో మహిళలను అణగదొక్కాలని తాలిబాన్ మూక చూస్తోంది. తాడోపేడో తేల్చుకోవాలని మహిళాలోకం కదం తొక్కుతోంది. ఆ మూక దుశ్చర్యలను నిరసిస్తూ, పాకిస్తాన్ జోక్యాన్ని ప్రతిఘటిస్తూ చేస్తున్న నినాదాలకు కాబూల్ నగరం కదిలిపోతోంది. ఈ నిరసనల హోరు పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్నీ తాకింది. తాలిబాన్ ప్రమాణస్వీకారం రోజు చైనా -పాకిస్తాన్ ప్రతినిధులు అతిధులుగా రాబోతున్నారన్న వార్త అఫ్ఘాన్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. పోరులో పురుషుల భాగస్వామ్యం ఎలా ఉన్నా, తాము వెనకడుగు వేసేది లేదని అఫ్ఘాన్ మహిళలు ముందుకు సాగుతున్నారు.
Also read: గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు
వెంటాడుతున్న గతం
గతంలో వారు అనుభవించిన బాధలు, పొందిన అవమానాలను గుర్తుతెచ్చుకుంటూ ఆడవాళ్లు రగిలిపోతున్నారు. మధ్యయుగపు ఛాందస భావాలతో ఆధునిక మహిళను అణచివేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రతిఘటిస్తున్నారు. తాలిబాన్ వాణి మారినా, బాణీ ఏమీ మారలేదని అక్కడి దృశ్యాలు చెబుతున్నాయి. మునుపటి రోజులకు మించిన రెట్టింపు పొగరుతో క్రూర చర్యల పర్వం కొనసాగుతూనే వుంది. గతానికి భిన్నంగా ఇప్పుడు చైనా,రష్యా బహిరంగ సహకారం తోడయ్యే సరికి, తాలిబాన్ మూక మరింత ఆత్మవిశ్వాసంతో రెచ్చిపోతున్నారు. తమకు ఎదురే లేదనే భావం మరింత పెరిగింది. ఈ ధోరణి అఫ్ఘాన్ మహిళాలోకాన్ని కలచివేస్తోంది,కలవర పెడుతోంది. బెదిరింపులు కూడా ఎక్కువై పోతున్నాయని అంతర్జాతీయంగా వార్తలు హోరెక్కుతున్నాయి. నిరసనలకు దిగిన మహిళలను చెదరగొట్టడానికి కాల్పులు కూడా జరుపుతున్నారు. పాకిస్తాన్ ఐఎస్ ఐ చీఫ్ – తాలిబాన్ మధ్య వరుస భేటీలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అండతో ఆఫ్ఘాన్ లో ఉగ్రవాదం మరింతగా పెరుగుతుందనే భయం గుప్పెట్లో ప్రజలు జీవిస్తున్నారు. తాలిబాన్ వైఖరి రవ్వంత కూడా మారలేదని అక్కడి విశ్వవిద్యాలయాల్లోని దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా తరగతి గదుల్లో పరదాలు ఏర్పాటు చేశారు.
Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!
విద్యాసంస్థల్లో నిర్బంధాలు
విద్యా సంస్థలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నిఖాబ్ ధరించాలని, ఆడవాళ్లకు -మగవాళ్ళకు వేరు వేరు తరగతి గదులు కేటాయించాలని హుకుం జారీఅయ్యింది. అమ్మాయిలకు పురుషులు విద్యాబోధన చేయరాదని ఆంక్షలు విధిస్తున్నారు. ఘోర్ ప్రావిన్స్ లో ఓ మహిళా పోలీస్ అధికారి ఇంటిపై తాలిబాన్ ముష్కరులు దాడి చేశారు. ఆమె గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా, భర్త, పిల్లల ముందే ఆమెను అతిదారుణంగా కాల్చి చంపారు. ఈ దుర్ఘటన తాజాగా జరిగింది. ఇది ఒక్కటి చాలు.. వారి పైశాచికత్వాన్ని బొమ్మకట్టించడానికి. ఆమె గతంలో అఫ్ఘాన్ రక్షణ దళంతో కలిసి పనిచేశారు. అటువంటి వారందరిపై ప్రతీకారంగా దాడులు మొదలయ్యాయి. ఆ దాడుల్లో భాగంగా ఈ మహిళ ప్రాణాలను కోల్పోయింది. అయితే ఆమె హత్యకూ, మాకూ ఎటువంటి సంబంధం లేదని, అందరికీ క్షమాబిక్ష పెడుతున్నామని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అంటున్నారు. ఈ మాటలను అఫ్ఘాన్ పౌరులు నమ్మడం లేదు. ఈ తరహా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలకు దిగిన మహిళలపై పెప్పర్ స్ప్రే చల్లడం, బాష్పవాయివు ప్రయోగించడం, దాడులు చెయ్యడం, తుపాకీలతో కొట్టడం అనేకసార్లు జరిగింది. వీటన్నిటినీ లెక్కచేయకుండా అఫ్ఘాన్ మహిళలు నిర్భయంగా నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు. నినాదాలు వినిపిస్తున్నారు. అఫ్ఘాన్ మహిళాలోకానికి ప్రపంచ మహిళందరూ మద్దతు పలుకుతున్నారు. ఆచారాల పేరుతో అణగదొక్కే అరాచక పర్వం ఆగేంతవరకూ అఫ్ఘాన్ మహిళల ఆందోళనల పథం ఆగేట్టులేదు.
Also read: అయ్యో అఫ్ఘానిస్తాన్!
Also read: అఫ్ఘానిస్తాన్ పాఠాలు అనేకం
Shariya is constitution ,liberty in Burkha .Allha is male!
Shariya written by iron heart