కొత్త అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘనీ కాగల అవకాశం
కాబూల్ చేరిన తాలిబాన్ యోధులు
తాలిబాన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్ అఫ్ఘనిస్తాన్ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు భోగట్టా. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తాలిబాన్ కు అప్పగించి పలాయనం చిత్తగించాడు. కాబూల్ అధ్యక్ష భవనం నుంచి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందని తాలిబాన్ వర్గాలు చెప్పాయి. అఫ్రాఫ్ కజకిస్తాన్ చేరుకున్నారు. అఫ్రాఫ్ కదలికల గురించి వివరాలు వెల్లడించజాలమని అఫ్ఘాన్ అధ్యక్ష భవనం తెలిపింది.
ఆదివారం రాత్రి కాబూల్ లో పెక్కు పేలుళ్ళు సంభవించాయి. ప్రెసిడెంట్ అష్రాఫ్ గద్దె దిగి దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్ కాబూల్ నగరంలోకి ప్రవేశించాయని తాలిబాన్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా రక్తపాతం జరగకుండా నివారించడానికే తాను దేశం వదిలి వెళ్ళానని అష్రాఫ్ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు అధికారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ అష్రాఫ్ తాలిబాన్ కు కబురు పంపారు. విజయపథంలో ఉన్న తాలిబాన్ అధికారంలో భాగస్వామ్యానికి సిద్ధంగా లేదు. తన ప్రతిపాదనను తిరస్కరించడం, కాబూల్ పొలిమేరల్లోకి తాలిబాన్ యోధులు ప్రవేశించడంతో ప్రెసిడెంట్ అష్రాఫ్ రాజధాని వీడి పక్కనే ఉన్న కజకిస్తాన్ కు పలాయనం చిత్తగించాడు.
ఇది ఇలా ఉండగా, తాలిబాన్ కు తలొగ్గే ప్రసక్తే లేదని అఫ్ఘానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ప్రకటించడం ఆశ్చర్యకరమైన పరిణామం. నా గురువు, దార్శనికుడు, కమాండర్ అహ్మద్ షా మసౌద్ వారసత్వాన్ని తాను ఎన్నడూ వీడేది లేదని ఆయన ప్రకటించారు. తాలిబాన్ ఉగ్రవాదులూ, నేను ఒకే చోట ఉండటం అసంభవం అని కూడా అన్నారు. తాలిబాన్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ సంఖ్య, ఎక్కువ ఆయుధాలు కలిగిన అఫ్ఘాన్ సైన్యం తాలిబాన్ తో ఎందుకు తలబడలేకపోతున్నదనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. విఫలా రాజ్యాల అధ్యయనంలో ప్రపంచంలో కెల్లా తాను గొప్ప ప్రవీణుడని పేరు తెచ్చుకున్న అష్రాఫ్ అఫ్ఘానిస్తాన్ ను విఫల రాజ్యంగా వదిలి కాలికి బుద్ధి చెప్పారు.