Sunday, December 22, 2024

బాబ్రీ కూల్చివేతలో అడ్వాణీ ప్రమేయం లేదు: లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు

  • ‘జైశ్రీరామ్’ అంటూ నినదించిన అడ్వాణీ
  • బీజేపీ విశ్వాసాన్నీ, నా నమ్మకాన్నీ కోర్టు తీర్పు ధ్రువీకరించింది: అడ్వాణీ
  • మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, మరి 29 మంది నిర్దోషులే
  • నిందితులు బాబ్రీ కూల్చివేతను నిరోధించేందుకు ప్రయత్నించారు.

కె. రామచంద్రమూర్తి

బాబ్రీ మజీద్ విధ్వంసం కేసులో లాల్ కృష్ణ అడ్వాణీకీ, మురళీ మనోహర్ జోషీకీ, ఉమాభారతికీ, కల్యాణ్ సింగ్ కీ, మరి 28 మంది నిందితులకీ ఊరట లభించింది. అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కొందరు హిందూ ‘సంఘ విద్రోహులు’ కూల్చివేశారనీ, వారి చర్యను అడ్డుకోవడానికి ఈ కేసులోని నిందితులు ప్రయత్నించారనీ లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎస్. కె. యాదవ్ బుధవారంనాడు తీర్పు చెప్పారు. జడ్డి తీర్పు చదివినప్పుడు అడ్వాణీ (92), జోషీ (87), ఉమాభారతి (61) కోర్టులో లేరు. సీబీఐ ప్రవేశపెట్టిన ఆడియో, విడియో సాక్ష్యాధారాలు ఆరోపణలను రుజువు చేసే విధంగా లేవని న్యాయమూర్తి తెలిపారు.

అడ్వాణీ సంతోషాతిరేకం

రామజన్మభూమి ఉద్యమం పట్ల తనకూ, బీజేపీ ఉన్న విశ్వాసాన్ని లక్నో సీబీఐ కోర్టు ధ్రువీకరించిందని అడ్వాణీ న్యయమూర్తి తీర్పు స్వాగతిస్తూ వ్యాఖ్యానించారు. తీర్పు వినగానే అడ్వాణీ ‘జైశ్రీరామ్’ అంటూ నినాదం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి దారిని సుగమం చేస్తూ 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సీబీఐ కోర్టు కూడా దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉన్నదని అడ్వాణీ అన్నారు. ఆగస్టు 5 రామజన్మభూమికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడం ఈ ఉద్యమం కొనసాగింపుగానే భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలోని కోట్లాది ప్రజలలాగనే తాను కూడా రామమందిరం నిర్మాణం పూర్తి కావడంకోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

దాదాపు 28 సంవత్సరాల కింద బాబ్రీ మసీదును కార్ సేవకులు కూల్చివేసినప్పుడు దేశ ప్రధానిగా పి.వి. నరసింహారావు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్నారు. అంతకు ముందు అడ్వాణీ రామజన్మభూమి అభియాన్ పేరుతో ఉత్తరాది రాష్ట్రాలలో రథయాత్ర చేశారు. రథ యాత్రను బిహార్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్వాణీనీ, మరి కొందరినీ అరెస్టు చేసింది. అప్పుడు బిహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఈ రోజు లాలూ గడ్డి కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలులో ఉన్నారు.

బాబ్రీ కూలుతుంటే పీవీ ఏం చేశారు?

బాబ్రీమసీదు కూలిన  రోజు పీవీ నరసింహారావు ఏమి చేశారో, ఎటువంటి చర్యలు తీసుకున్నారో నాడు ఆయనతో కలసి పని చేసిన ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్, న్యాయకోవిదుడు పి. చంద్రశేఖరరావు (అప్పుడు ఆయన కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి) వివిధ ఇంటర్వూలలో వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నాయర్ మాత్రం బాబ్రీ విధ్వంసం మొదలు కాగానే పీవీ కళ్ళు మూసుకొని పూజలో కూర్చున్నారనీ, విధ్వంసం పూర్తయిందని ఎవరో చెవిలో చెప్పిన తర్వాత కళ్ళు తెరిచారనీ రాశారు. ఇది అభూత కల్పన అని చెబుతూ, ఇంత అన్యాయంగా ఎట్లా రాశారని ఈ రచయిత కులదీప్ నాయర్ ను ప్రశ్నిస్తే తనకు మధులిమాయే ఈ సంగతి చెప్పారని సమాధానం చెప్పారు.

బాబ్రీ మసీదు విధ్వంసం దరిమిలా దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో సుమారు 3000 ప్రజలు మరణించారు. బాబ్రీ విధ్వంసం తాలూకు పరిణామాలపై దర్యాప్తు చేసన లిబరహాన్ కమిషన్ ఎదుట పీవీ హాజరైనారు. పీవీని నిర్దోషిగా కమిషన్ ప్రకటించింది. ఈ వ్యవహారంలో తన పాత్రనూ, ఇతరుల పాత్రనూ వివరిస్తూ పీవీ ‘అయోధ్య’ పేరుతో ఒక గ్రంధం రాశారు. అది చదివినవారికి నాటి సంక్లిష్ట పరిస్థితులలో ప్రధానిగా పీవీ తన చేతిలో ఉన్నదంతా చేశారనే నమ్మకం కలుగుతుందని పీవీ వ్యాఖ్యానించేవారు. 23 డిసెంబర్ 2004న చివరి శ్వాస విడిచే వరకూ పీవీ అన్నికేసులలోనూ నిర్దోషిగా బయటపడ్డారు.

అడ్వాణీ, కళ్యాణ్ సింగ్ హామీ

వివాదాస్పద కట్టడాన్ని ముట్టుకోబోమని పీవీకి అడ్వాణీ స్వయంగా హామీ ఇచ్చారు. కళ్యాణ్ సింగ్ న్యాయస్థానానికి పూచీ పడ్డారు. అవసరమైతే వినియోగించుకోవడానికి వీలుగా ఫైజాబాద్ లో బాబ్రీమసీదు సమీపంలో వందలమంది కేంద్ర సాయుధ పోలీసులను సిద్ధంగా ఉంచారు. వారిని కళ్యాణ్ సింగ్ వినియోగించుకోలేదు. బాబ్రీమసీదుపైకి ఎక్కి దాన్ని పడగొడుతున్న కార్ సేవక్ లను ఉద్దేశించి ‘ఏక్ ఢక్కా ఔర్ దో’ (ఇంకో దెబ్బ వేయండి) అంటూ బీజేపీ నాయకురాలు ఉమాభారతి ప్రోత్సహించారంటూ అప్పట్లో వార్తాపత్రికలు రాశాయి. ఇటువంటి ఆధారాలను సీబీఐ సేకరించలేకపోయిందని భావించాలి. బాబ్రీ విధ్వంసం తర్వాత కేంద్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వాన్నీ, మరి మూడు బీజేపీ పాలిత ప్రభుత్వాలనీ బర్తరఫ్ చేసింది. విధ్వంసకారులపైన ప్రభుత్వం రెండు కేసులు పెట్టింది. ఆ తర్వాత మరి 47 కేసులు పడ్డాయి. అడ్వాణీ, తదితరులు నిర్దోషులంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, తదితరులపైన క్రిమినల్ కుట్ర కేసు పెట్టాలంటూ 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఈ కేసును ప్రతిరోజూ విచారించాలనీ, న్యాయమూర్తి యాదవ్ ని బదిలీ చేయకుండా అదే స్థానంలో, అదే హోదాలో కొనసాగించాలనీ సుప్రీంకోర్టు అదే సంవత్సరం ఆదేశించింది. పోయిన నవంబర్ లో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా అయోధ్య స్థల వివాదంపైన తుది తీర్పు వెలువరించింది. అయోధ్య స్థలానికి బదులుగా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్డు కేంద్ర ప్రభుత్వాన్నీ, యూపీ ప్రభుత్వాన్నీ ఆదేశించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles