- పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ
- అఫిడవిడ్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశం
- తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా
వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కుమార్ జర్మనీ పౌరుడేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వాన్ని 2023 వరకు ఆయన పొడిగించుకున్నారని హోంశాఖ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివరాలను కేంద్ర హోంశాఖ మెమో రూపంలో సమర్పించడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పు బట్టింది. పూర్తి వివరాలతో అఫిడవిడ్ దాఖలు చేయాలని కేంద్రాన్ని మరోసారి ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.
మెమో దాఖలుపై హైకోర్టు ఆగ్రహం
చెన్నమనేని పౌరసత్వంపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై పలు మార్లు విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నవంబర్ 18న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అయినప్పటకీ కేంద్రం తరపు న్యాయవాది పాత మెమోనే మళ్లీ సమర్పించడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ద్వంద్వ పౌరసత్వంపై పిటీషన్
చెన్నమనేని రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్ భారత పౌరతసత్వాన్ని రద్దు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చెన్నమనేని రమేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గత కొద్ది నెలలుగా చెన్నమనేని పౌరసత్వంపై విచారణ కొనసాగుతోంది.
జర్మనీ పాస్ పోర్ట్ తో ప్రయాణం
జర్మనీ పౌరసత్వంతో వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నమనేని రమేష్ పై హైకోర్టులో సుదీర్ఘకాలంగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వం చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఆయన పౌరసత్వం పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 2019 డిసెంబర్ మూడో వారంలో చెన్నై నుంచి జర్మనీ వెళ్లిన చెన్నమనేని రమేష్ జర్మన్ పాస్ పోర్టు పైనే ప్రయాణం చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే కేసు పెండింగ్ లో ఉండగా చెన్నమనేని రమేష్ జర్మనీ వెళ్ళిన విషయాన్ని అఫిడవిట్లో పేర్కొనక పోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం పలుమార్లు చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో స్టేలు తెచ్చుకుంటూ చెన్నమనేని కాలం వెళ్లదీస్తున్నారు. కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను హైకోర్టు సమర్థిస్తే ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లకుండా పోతుంది.
పౌరసత్వం రద్దయితే ఉపఎన్నిక తప్పదా ?
చెన్నమనేని పౌరసత్వం రద్దయితే వేములవాడ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కూడా రద్దవుతుంది. దీంతో వేముల వాడ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వేములవాడలో విపక్షాలు ఇప్పటికే ఉపఎన్నిక దిశగా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Play with the ideas and emotions of the people is the order of the day so far people are ignorant and fools…i.e; the definition of politics.Downtrodden/bahujans are always available with frustrations and can be fooled easily and they believe that they can loose nothing but their bondings.In all the movements their sacrifices are reaped by the upper castes.people need education but that is regulated by the upper castes . This trend needs a dynamic change with rational thinking.
With reference to ee’canvas’pai…..