ఫొటో రైటప్: మే 22న మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన ఆదివాసీలు
అనకాపల్లి జిల్లా , రావికమతం మండలం, కళ్యాణపు లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల వారికి మార్చి, ఏప్రిల్ నెలలలో చాల రేషన్ కార్డులకు బియ్యం అందలేదని స్తానిక సంఘం సభ్యులు సమాచారం ఇచ్చారు.
రికార్డు ఏమి చెపుతుంది?
అయితే, పౌర సరఫరాల శాఖ వారి వద్ద వున్న డేటా ప్రకారం రేషన్ ఇచ్చినట్లు ఉందా లేక ఇవ్వనట్లు ఉందా? ఎందుకంటే దానిని బట్టి ఏమి జరిగిందో మనకు ఒక అంచనా వస్తుంది. మా సహచర మిత్రుడు చక్రిని సంప్రదించాo. తాను రేషన్ షాప్ నెంబర్ కావాలని అడిగాడు. అది అందజేసిన వెంటనే మాకు మార్చి, ఏప్రిల్ నెలలలో ఆ డిపో నుండి రేషన్ అందనివారు, అందిన వారి డేటా వచ్చేసింది.
Also read: రూ. 2,33,04559 అప్పుల సాలెగూడు నుండి బయటపడిన రోచ్చుపనుకు ఆదివాసీలు
ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులోకి వస్తున్నది. అయితే అది ఎక్కడ దొరకుతుంది, ఎలా దొరకబుచ్చుకోవాలి, ఆ సమాచారాన్ని హక్కులను నిలబెట్టడంలో ఎలా వాడుకోవాలానే అంశంలో మాత్రం సామాజిక ఉద్యమకారులు బాగా వెనకబడి వున్నారు.
జడ్జిగారి సూచన
ఆదివాసీలు, పేదల తరపున కేసులు వాదించే కె.ఎస్. మూర్తి గారు తనకు ఒక హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన సంగతి చెప్పారు. ‘మూర్తీ! మీరు RTI పెట్టడం కుర్రవాళ్ళకు నేర్పారు, బాగుంది. మరో అడుగు ముందుకు వేయాలి. డేటా మైన్ (తవ్వడం / సేకరించడం) నేర్పాలి” అన్నారట.
సివిల్ సప్లయిస్ వెబ్ సైట్ నుండి మార్చి, ఏప్రిల్ కీ రిజిస్టర్స్ చక్రి బృందం తవ్వి తీసింది. మా పని చాల సులువయ్యింది. ఎవరికి రేషన్ అందలేదో కార్డు నెంబర్, పేర్లతో సహా మా చేతికి చిటికలో సమాచారం వచ్చెసింది.
Also read: నాలుగు క్వార్టర్స్ బ్రాంది బాటిల్స్ – (మైనస్) ‘అత్యాచారం’ కేసులు = ??!!
ఆ డేటా షీట్స్ ప్రకారం చూస్తే మార్చి నెలలో 279 కార్డులకు, ఏప్రిల్ నెలలో 317 కార్డులకు రేషన్ అందలేదని నిర్దారణ అయ్యింది. ఆ జాబితాలను గ్రామ సంఘ సభ్యులకు పంపి సర్వే చేయమని కోరాము. డేటా కరెక్ట్. దీనిని బట్టి మాకు అర్ధమైనది ఏమిటంటే, రేషన్ ఇచ్చినట్లుగా రికార్డులో చూపించ లేదు. అలాంటప్పుడు రేషన్ డిపో డీలర్ వద్ద మిగులు వుండాలి, కాని లేదు.
మళ్ళీ చక్రిని సంప్రదించాం. తాను food rights మీద పని చేస్తున్న వారిని నుండి భోగట్టా లాగాడు. అటు నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే, ఆహార భద్రత చట్టం అనుసరించి, బకాయిపడిన రేషన్ ఉచితంగానైనా ఇవ్వాలి లేదా నష్టపరిహారమైన ఇవ్వాలి. మేము రేషన్ ఇవ్వమని అడుగుదామనే నిర్ణయానికి వచ్చాం.
నేను అనకాపల్లి JC గారికి ఒక వినతిపత్రం తయారు చేసుకొని వారి పేషిలో ఇచ్చి రసీదు తీసుకున్నా.
మే 22న అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA), రావికమతం మండల శాఖ ఆదివాసీలను సమీకరించి మండల రెవిన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. వినతిపత్రం ఇచ్చి రసీదు తీసుకున్నారు.
శుక్రవారం, అనగా 09-06-2023, సాయింత్రం స్థానిక ఆదివాసీ కార్యకర్తల నుండి ఫోన్. మార్చి, ఏప్రిల్ నెలల బకాయి రేషన్ ఉచితంగా ఇస్తున్నారని. ఫోటోలు కూడా తీసి పంపారు.
అధికారుల చొరవ
అయితే ఉద్యమo చేయడం వలననే బకాయి రేషన్ వచ్చేసిందని చెప్పడం అంటే నాణానికి ఒకవైపే చూపడం అవుతుంది. స్థానిక తాశీల్దార్(MRO), డిప్యూటి తాశీల్దార్ (DT) ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. స్పెషల్ రిపోర్ట్ రాశారు. సమీక్షా సమావేశాలలో విడవకుండా ప్రస్తావించారు. జిల్లా యంత్రాంగం కూడా స్పందించిoది.
నేను స్తానిక తాశీల్దార్ గారిని అభినoదిస్తూ ఒక మెసేజ్ పెట్టాను. అది ‘తాను చేయవలసిన పని’ అని, ‘తన బాద్యత’ అని తిరుగు జవాబు ఇచ్చారు. ‘అధికారి’లో మనిషి అనే వాడు ఆమాత్రం మిగిలి వుంటే చాలుకదా!
చట్టం ఇచ్చిన హక్కులను తెలుసుకొని వాటిని రాబట్టుకోవడం, నిలబెట్టు కోవడంద్వారనే ప్రజాస్వామిక చైతన్యం వెళ్లివిరుస్తుంది కదా! “బోధించు … సమీకరించు … పోరాడు” అంటూ అంబేద్కర్ చెప్పిన మాటలకు అర్ధం ఇదే కదా!!
Also read: ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు