నిజానికి ఈ వాక్యం మే 5వ తేది, శుక్రవారం, నా చేతికి అందిన లేఖ అడుగు భాగాన వుంది. ఇంగ్లిష్ లో ఇలా వుంది, “ this issue is pending since last 9 months” .
గౌరవ కమీషనర్, సర్వే & భూమి రికార్డులు, విజయవాడ వారు దయతోనాకు ఒక లేఖ పంపారు. ఆ లేఖకు అనుబంధగా మరో లేఖ వుంది. సదరు లేఖను గౌరవ రీజనల్ డిప్యూటి డైరెక్టర్(రి.డి.డి), సర్వే & భూమి రికార్డులు, కాకినాడ వారు ఏంతో బాధ్యతతో గౌరవ కమీషనర్ వారికి “మార్కు” చేసిన లేఖ అది. అయితే సదరు రి.డి.డి గారు ఎవరిని ఉద్దేశించి రాసారు? అనకాపల్లి డిస్ట్రిక్ట్ సర్వే లేండ్ ఆఫీసర్ (DSLO)కు ‘వాపోతూ’ (this issue is pending since last 9 months) రాసిన లేఖను, తాను అలా –బాగా- వాపోయినట్లు గౌరవ కమీషనర్ గారికి తెలియజేయడం కోసం, DSLOకు రాసిన లేఖను ఆయనకు కూడా పంపారన్నమాట. సదరు మహాఘనత వహించిన కమీషనర్ గారు, ‘చూశారా ! మా రి.డి.డి గారు ఎలా వాపోయారో’ అని నేను తెలుసుకోవడానికి సదరు వాపోత లేఖను, ప్రభుత్వం వారి ఖర్చు మీద నాకు రిజిస్టర్ పోస్టులో పంపారు. అసలు, సమస్య పరిష్కారం అయ్యిందా లేదా? లేకపోతు ఎందుకు కాలేదన్నది కాదు ‘కొశ్చను’. అయ్యగారు వాపోయారా లేదా అన్నది ‘పాయింటు’ .
పాలన శాస్త్రం – ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
ప్రజల ఫిర్యాదులను పాలకుడు పరిష్కరించాలి. అంటే బాధితునికి న్యాయం చేయాలి. అనాదిగా రాజ్యధర్మంలో ఒక భాగం. రాజు గారి దర్బారే అత్యున్నత న్యాయపీటం. అదే అత్యున్నత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కూడా. కొందరు దొడ్డ రాజులు కోటగుమ్మంవద్ద ధర్మ గంట పెట్టే వారని పేదరాసి పెద్దమ్మ చెప్పిన కధలలో విన్నాం.
ఆధునిక పాలన శాస్త్రంలో ఈ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఎలా ఉండాలానే దానిపై పుంఖాను పుంఖాల పరిశోధనలు, నివేదికలు వున్నాయి. ఆధునిక సాంకేతి ప్రక్రియలు, గుర్తింపు ప్రక్రియలు (ఉదాహరణకు – ఆధార్) ఉపయోగించి మరింత కట్టుదిట్టంగా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని ఎప్పటికప్పుడు పాలకులు దండోరా వేస్తూ వుంటారు.
Also read: అప్పుల ఉచ్చులో ‘రొచ్చుపనుకు’ ఆదివాసీ రైతులు
సాధారణంగా వారంలో మొదటి రోజైన సోమవారాన్ని“గ్రీవెన్స్ డే’ (ఫిర్యాదుల పరిష్కార దినం)గా జరపటం పరిపాటి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీనికి రకరకాల కొత్త పేర్లు, ముద్దు పేర్లు పెట్టి తాము ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్లు ఒక కలర్ ఇస్తూవుంటారు. గత పాలకుడు బాబుగారు ‘ప్రజల వద్దకు పాలన’, ‘రెవిన్యూ సదస్సులు’, ఇప్పుడు ‘స్పందన’, మళ్ళీ కొత్తగా ‘జగనన్నకు చెప్పుకుందాం’.
బ్రిటిష్ వారి కాలం నుండి వస్తున్నా, సోమవారం “గ్రీవెన్స్ డే’ కి ఇప్పుడున్న పేరు ‘స్పందన’. ఎవరైనా జిల్లా కలెక్టర్ కార్యలాయానికి వెళ్లి, కలెక్టర్ వద్దకు వచ్చే ఫిర్యాదుల స్వభావాన్ని గనుక గమస్తే మన పాలన వ్యవస్త ఎలా ‘బ్రేక్ డౌన్’ అయిపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ ఒక పర్యవేక్షకుడు, నిర్దేశకుడు, ప్రణాళికల రూపకర్త, బృంద నాయకుడు. చివరిగా ఒక ‘అప్పిలేట్ అధారిటి’ (అధికారి). చాల వాటికి తాను సమస్యను పరిష్కరిoచే మొదటి అధికారి కాదు. ఉదాహరణకు ఒక రేషన్ కార్డు కలెక్టర్ ఇవ్వడు. అది తాశీల్దార్ పని. నిజానికిజిల్లా పాలన వ్యవస్తలో జిల్లా కలెక్టర్ కు ప్రజలతోప్రత్యక్షంగా వ్యవరించవలసిన అధికారికి మధ్య మరొక దొంతర వుంటుంది. అంటే దిగువ నుండి చూస్తే కలెక్టర్ మూడవ అంచెకు చెందినవాడు. భూపాలనే తీసుకోండి, తాశీల్దార్ పైన రెవిన్యు డివిజనల్ ఆఫీసర్ (RDO) ఆ తరువాతనే జిల్లా కలెక్టర్. తమ సమస్య దిగువనే పరిష్కారం అయిపోతే ఎవరూ ఖర్చులు పెట్టుకొని, పనులు మానుకొని కలెక్టర్ కార్యాలయానికి రారు. అలా వస్తున్నారు అంటే అది ఇస్తున్న సంకేతం ఏమిటి? పాలకులు ఎన్నడైనా ఆలోంచిచారా?!.
ఇది చదివేవారికి అతిశయోక్తిగా అనిపించ వచ్చునేమో కాని క్షేత్రస్థాయిలో బీద ప్రజలతో పని చేసే వారి రోజువారీ అనుభవం ఏమింటoటే, అక్కడ చట్టబద్ధ పాలన అంటూ ఏదిలేదు. ఆర్దిక, రాజకీయ సమీకరణలు అనుసరించి మాత్రమే పనులు జరుగుతూవుంటాయి. అందుచేత దిగివస్తారు వ్యవస్థల మీద నమ్మకం పోయిన ప్రజలు, ముఖ్యoగా పేద ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయాని వస్తున్నారు. కలెక్టర్ అంటే పెద్ద అధికారని వారు ఇంకా నమ్ముతున్నారు. ఆ నమ్మకం పోవడానికి ఎక్కువ కాలం పట్టేలా లేదు.
Also read : ప్రత్యామ్నాయ భూములు కోరుతూ అనకాపల్లిలో దీక్షాశిబిరం
“గ్రీవెన్స్ డే’ రోజున కలెక్టర్ కు కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ వుంటే, అసలు దిగువస్థాయిలో పరిష్కారం కావలసిన ఈ సమస్య తన వరకూ ఎందుకు వచ్చిందనే ప్రశ్న జోలికి పోకుండా (దానికి జవాబు గాని పరిష్కారం గాని తన వద్ద లేదని తెలుసు గనుక) ఆయన / ఆమె ఎదో చేయబోతున్నట్లు నటిస్తున్నారని, బాధితునికి ‘భ్రమ’ అనే ఊరటను కల్పిస్తున్నారని మనకు ఇట్టే అర్ధం అయిపోతుంది.
ఎస్.ఆర్. శంకరన్ గారు చెప్పిన కధ
జిల్లా కలెక్టర్ గా ఎస్ ఆర్ శంకరన్ ఉన్న రోజులలో, ఒక మారుమూల గ్రామం నుండి దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక మధ్య వయస్కుడైన పేదవాడు కాగితం పట్టుకొని కలెక్టర్ గారి వద్దకు వచ్చాడు. దాని సారాంశం, తన సాగులో వున్న బంజరు భూమికి పట్టా ఇవ్వమని. కలెక్టర్ గారు అర్జిని స్వీకరించి సంతకం పెట్టారు. మీ వద్దకు అధికారులు వస్తారు, విచారణ చేసి పట్టా ఇస్తారని హమి ఇచ్చారు. అర్జీదారు నిష్క్రమించాడు.
కొన్ని నెలలు గడిచాయి. ఆ అర్జీదారు మళ్ళీ కలెక్టర్ ను కలిశాడు. తనకు పట్టా రాలేదని చెపుతూ మళ్ళఈ కాగితం ఇచ్చాడు. అది కొత్తగా రాసిన అర్జీ కాదు. ఇది వరకు కలెక్టర్ గారికి ఇచ్చినదే. కలెక్టర్ గారు ఒకింత ఆశ్చర్యపోయారు. అక్కడ తన సంతకం వుంది. తన సంతకం వున్న పత్రం ప్రభుత్వ రికార్డులో కదా వుండాలి? ఆయనకు ఎలా వెళ్ళింది? అదే అడిగారు ఆ దళిత అర్జీదారుని.
జరిగిన కధ ఇది, కలెక్టర్ గారు ఆ నాడు తీసుకున్న ఆ వినతిపత్రం పలు (అధికారుల) సంతకాలు పడుతూ చివరికి గ్రామ కరణం వద్దకు చేరుకుంది. ఆ కరణం ఈ అర్జీదారుని పిలిపించుకున్నాడు. బూతులు తిడుతూ, “నన్నుకాదని కలెక్టర్ దగ్గిరకు వెళ్ళే గొప్పవాడివి అయినావా”, ‘ఇదిగో నువ్వు పెట్టిన కాయితం ఆ కలెక్టరే నాకు పంపాడు” అంటూ దానిని ఆ దళిత అర్జీదారు మొహన కొట్టాడాడు. దానిని పట్టుకొని, ప్రయాణ ఖర్చులు సర్దుబాటుచేసుకొని మళ్ళీ కలెక్టర్ వద్దకు వచ్చాడు ఆ నడివయస్కుడైన నిరుపేద అర్జీదారు.
Also read : ‘MLA’ వంతంగి పేరయ్య భూమి కధ
ఇది విన్న కలెక్టర్ గారు కొన్ని నిముషాలు మౌనంలోకి వెళ్ళిపోయారు. ఎస్ ఆర్ శంకరన్, ఐఏఎస్, ధర్మాగ్రహం గూర్చిన తెలిసినవారు మాత్రమే అప్పటి ఆయన మోహకవళికలను ఊహించ గలరు. తన సిబ్బందిని పిలిచారు శoకరన్. అర్జీదారుని వారికి అప్పగించారు. తాను జరూరుగా చేయవలసిన పనులు పూర్తి చేసుకొని తన వాహనంలో ఆ అర్జీదారును ఎక్కించుకొని బయలుదేరారు అతని గ్రామానికి. దారిలో, తన సంతకం దిగువ వున్న అధికారులకు ఆ గ్రామానికి రావాలనే ఆదేశాలు వెళ్తున్నాయి. తాశీల్దార్ అతని సిబ్బంది, రికార్డులతో కలెక్టర్ గారు వచ్చేసరికి అక్కడ వుండాలి. ఒక్కసారిగా కలెక్టరేట్ లో అలజడి, తాశీల్దార్ కార్యాలయంలో భూకంపం. ఎందుకో ఏమిటో ఎవరికీ తెలీదు. కలెక్టర్ గారు అక్కడే పంచనామా చేయించి డి-పట్టాను అర్జీదారు చేతిలో పెట్టారు. ఇక అప్పుడు మొదలయ్యింది అసలు కధ. అక్కడే తాత్కాలిక కలెక్టర్ కోర్టు (కలెక్టర్ గారు ఎక్కడ వుంటే అదే కోర్టు) మొదలయ్యింది. తన ఆదేశాలపై చర్యలు తీసుకోకుండా అర్జీదారుకు ఆ వినతిపత్రం ఇవ్వడం వెనుక వున్న అధికారులపై విచారణ మొదలయ్యింది. అక్కడికక్కడే సప్సేన్షన్ ఆర్దర్సు టైప్ అవ్వడం, వారికి అందడం జరిగిపోయింది.
మరి ఇప్పుడు?
‘స్పoదన’ లో మీ ఫిర్యాదు నమోదు కావాలంటే మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. దానిని డేటాలో ఎంటర్ చేస్తేనే ‘స్పoదన’ పోర్టల్ మీకు మీ ఫిర్యాదు నమోదు అయినట్లుగా ఒక నెంబర్ మంజూరు చేస్తుంది. ఈ ఆధార్ నెంబరుతో మీకు ప్రభుత్వం నుండి వస్తున్న పధకాల సమాచారం, మీ జాతకం అంతా అధికారి చేతికి వస్తుంది. దాని ఆధారంగా మీకు మీ వాలంటీర్ నుండి ‘కబురు’ అనే లోపాయికారి హెచ్చరిక వస్తుంది. “ఏంటి? కలెక్టర్ దగ్గిరకి వెళ్లి పిటీషన్ లు పెడుతున్నావట?” అన్నది ఆ లోపాయికారీ హెచ్చరిక. అది ఆధునిక సాంకేతికతో ఫిర్యాదుల పరిష్కారం.
Also read : పేదలకు ఇళ్ళ కోసం .. పేదల భూములు ..
కొత్తవీధి, గుంటి అనే రెండు ఆదివాసీ గ్రామల సాగు రైతులు తాము పెంచిన జీడి తోటల మధ్యలో కొత్తగా సర్వే రాళ్ళు పాతి వుండటం గమనించారు. దాంతో వారు ఆందోళన చెందారు. కొంత విచారణ తరువాత, తాము గ్రామంలో లేనప్పుడు మండల సర్వేయరు తన సిబ్బందితో వచ్చి ఆ పని చేశాడని తెలుసుకున్నారు. తమ సాగు అనుభవంలో వున్న భూమిలో తమ ప్రమేయం లేకుండా, సమాచారం లేకుండా ఈ పని జరిగిందనగానే వారు కీడు శంకిoచారు.
నిజమే, వారు భయపడినట్లే జరిగింది. కొద్ది రోజులు తరువాత ఆ మండల సర్వేయరు కొందరు భూబ్రోకర్లను తీసుకొని తాను రాళ్ళు పాతిoచిన భూములను చూపడం మొదలు పెట్టాడు. సాగులో వున్న ఆదివాసీలు అడ్డంపడ్డారు. సర్వేయరు వారిని బెదిరించాడు. ఈ నేపద్యంలో నేను ఆ గ్రామాలకు వెళ్లి, సర్వే రాళ్ళు పాతిన స్థలాలను పరిశీలించాను. అవి అనకాపల్లి జిల్లా (అప్పుడు విశాఖపట్నం జిల్లా), చీడికాడ మండలం, కోనాం రెవిన్యూ గ్రామం సర్వే నెంబర్ 289లోని భూమి అని గుర్తించాము. నిజానికి సర్వేయరు వేయించిన సర్వేరాళ్ళు ఆదివాసీల జీడి మామిడి తోటల మధ్య, మెట్టు వ్యవసాయ భూముల మధ్య వున్నాయి.
దీని అర్ధం ఏమిటి? అక్కడ ఆదివాసీల సాగు వుందని అర్ధం. ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం ప్రకారం ఒక వ్యవసాయ భూమిని సర్వే చేయాలంటే ముందుగా సరిహద్దు రైతులకు, సాగులో వున్న వారికీ నోటీసు ఇవ్వాలి. రాష్ట్రంలోని భూమి సర్వే అధికారులు ఎవరైనా ఈ చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే.
సాగులో వున్న ఆదివాసీలకు నోటీసులు ఇస్తే వారి అభ్యంతరాలను నమోదు చేయవలసి వుంటుంది. వారు భూమి మీద అనుభవంలో వున్నారని చెప్పక చెప్పినట్లు అవుతుంది. అది సర్వేయరుకు ఆయన వెనుక వున్న బ్రోకర్లకు, ఆ సర్వేయరు పైన వున్న అధికారులకు ఇష్టం లేదు.
మండల సర్వేయరు చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘించాడు. అంతేకాదు, బ్రోకర్లను వేసుకొని వచ్చి ఆదివాసీలను బెదిరించాడు. అది ఇంకా పెద్ద నేరం. 2015లో సవరణ చేయబడిన షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాలనిరోధక చట్టం ప్రకారం నేరం కూడా.
మహాప్రభువులకు మనవి చేసుకున్నాం
రాష్ట్రంలో సర్వే సిబ్బంది అందరూ కమీషనర్, సర్వే & భూమి రికార్డుల అధికారి అజమాయిషి కింద వుంటారు. ఆయన శాఖకు చెందిన సర్వేయరు చేసిన అక్రమాలపై ఆదివాసీలు ఫిర్యాదు చేశారు. ఇక అప్పుడు మొదలయ్యింది ‘ఫిర్యాదుల పరిష్కారo’ అనే తంతు, తమాషా.
15 నవంబర్ 2021న కొత్తవీధి, గుంటి ఆదివాసీలు కమీషనర్, సర్వే& భూమి రికార్డులకు మండలసర్వేయరు పై ఫిర్యాదు చేశారు.
ఆయన ఆదివాసీల ఫిర్యాదుపై విచారణ చేయమని రీజనల్ డిప్యూటి డైరెక్టర్(రి.డి.డి), సర్వే & భూమి రికార్డులు, కాకినాడకు2022 ఫిబ్రవరి 11న ఆదేశాలు ఇచ్చాడు (అంటే మధ్యలోమూడు నెలలు గడిచిపోయాయి)
ఆ మహాఘనత వహించిన రీజనల్ డిప్యూటి డైరెక్టర్ (రి.డి.డి), సర్వే & భూమి రికార్డులు, కాకినాడవారు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో వేంచేసి వున్న ‘సహాయ సంచాలకు’లకు విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు.
ఆ మహాఘనత వహించిన సహాయ సంచాలకులు (AD), సర్వే & భూమి రికార్డులు, విశాఖపట్నంవారు తన కింద వున్న డిప్యూటి ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ సర్వే (DIOS) వారికి ఆ భాద్యతను వప్పగించారు.
ఆ మహాఘనత వహించిన డిప్యూటి ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ సర్వే (DIOS), సర్వే & భూమి రికార్డులు వారు అటు ఇటు చూశారు. ఆయనకు దిగువన మరో మహాఘనత వహించిన వారు లేకపోవడంతో సదరు AD సర్వేగారి నుండి వచ్చిన లేఖను ఎంచక్క ముడ్డి కింద పెట్టుకొని కూర్చున్నారు.
Also read: ఉపాధి హామీ పధకoలో కేంద్ర తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు చేయాలి!
మహప్రభో విచారణ జరపండని ఆయన వెంటపడగా పడగా 31 మే 2022న ‘రాజు వెడలె రవి తేజములలరగ’ అన్నట్లుగా వెళ్ళారు. అక్కడ ఆదివాసీల సాగులను చూశారు. వారు నివాసం ఉంటున్నకొత్తవీధి ఆవాస గ్రామాన్ని చూశారు. కాని నేటికీ తన నివేదికను ఇవ్వలేదు.
అయ్యగారి దివ్యసముఖమును నేను అనేక సార్లు సందర్శించుకొని వారిని దర్శించుకున్నాను. ఆయన మహా దొడ్డ మనిషి. నిఖోలాయి గొగోల్ (Nikolai Gogol) మృత జీవులు (Dead Souls) నవలలోని ‘చిచికొవ్’ మన ముందు సాక్షాత్కారించినట్లే. మండల సర్వేయరుపై విచారణ జరగలేదు. ఆయన చేసింది తప్పో ఒప్పో తేల లేదు. అది తేలనంత వరకూ ఆయన రాసిన రాత, గీసిన గీత చెల్లుబాటు అవుతుంది. కనుకు దాని ఆధారంగా 13 జూన్ 2022న సాగులో వున్న ఆదివాసీల ప్రమేయం లేకుండా భూమి రికార్డు మారిపోయింది.
Immediately/జరూరుగా/ ఖద్దున
నేను 12 ఏప్రిల్ 2023న మహారాజశ్రి కమీషనర్, సర్వే & భూమి రికార్డుల వారి దివ్యసముఖమునకు, ఆదివాసీలు ఇచ్చిన ఫిర్యాదుకు ఏ గతి పట్టింది తెలియజేయమని ఒక సమాచార హక్కు లేఖాస్త్రం సంధించాను. ఇక అప్పుడు మొదలయ్యింది రెండవ రౌండ్ తంతు, తమాషా.
నా లేఖను వారు తమ కవరింగ్ లేఖతో రీజనల్ డిప్యూటి డైరెక్టర్(రి.డి.డి), భూమి సర్వే & భూమి రికార్డులు, కాకినాడ వారికి తగు చర్యల నిమిత్తం పంపారు.
2022 అక్టోబరు నెలలో గౌరవ రీజనల్ డిప్యూటి డైరెక్టర్(రి.డి.డి)వారు అంతకు ఏమాత్రం తగ్గని గౌరవ డిస్ట్రిక్ట్ సర్వే లేండ్ ఆఫీసర్ (DSLO) (సహాయ సంచాలకులు– AD- అనే పేరు ఈ విధంగా మార్చబడినది) రాసిన లేఖ ఒకటి నా మొహన కోట్టారు. అందులో రెండు ఆసక్తికరమైన వాక్యాలు వున్నాయి. ఒకటి“ this issue is pending since last 9 months” (9 నెలలుగా ఈ సమస్య అపరిష్కృతoగా వుంది), రెండవది ‘requested to submit the detailed report immediately to this office” (వెంటనే మీ వివరణాత్మక నివేదికను ఈ కార్యాలయానికి పంపండి). ఈ‘immediately’ మాట ఎప్పుటిది? 2022 అక్టోబర్ నాటిది.
ఇక నిప్పుడు మహారాజశ్రీ రీజనల్ డిప్యూటి డైరెక్టర్(రి.డి.డి) వారు మహారాజశ్రీ డిస్ట్రిక్ట్ సర్వే లేండ్ ఆఫీసర్ (DSLO) వారికి, వారు మహారాజశ్రీ డిప్యూటి ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ సర్వే (DIOS) వారికీ నా లేఖను బట్వాడా చేస్తారు. అదే ఆ మహా దొడ్డ మనిషి ‘చిచికొవ్’ వద్దకు చేరుకుంటుంది.
గాంధి గారు అంత్యోదయం సాధించాలన్నారు. ఆఖరిన వున్న వాడికి ముందుగా మేలు చేయాలని కూడా అన్నారు. మరి! ఆదివాసీల కంటే ఆఖరున వున్నది ఎవరు ఈ దేశంలో..
అత్యున్నత అధికారైన కమీషనర్ విచారణ చేయమని ఆదేశాలు ఇస్తే దానికి పట్టిన గతి ఇది. ఇప్పుడు చెప్పండి మన “ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” గురించి.
2021 నవంబర్ లో ఆదివాసీలు ఫిర్యాదు ఇస్తే 2023 మే నాటికి ప్రాధమిక విచారణజగనప్పుడు ఇక చర్యలు ఎప్పుడు తీసుకుంటారు. లిప్తకాలంలో సమాచారం, పత్రాలు ఖండాoతరాలు దాటి పోయి నేటి 21 వ శతాబ్దంలో మన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇలా పని చేస్తున్నది.
చట్టం ముందు అందరూ సమానం కాదు
నిజానికి ఇదే సమస్య పెద్ద వారికి సంబదించింది అయితే కార్యాలయాల అధికారుల సెల్ ఫోన్, వాట్స్ అప్, వీడియో కాన్ఫరెన్స్ లతో గంటలలో పని జరిగిపోయివుండేది. అందుకే మన రాజ్యoగo ఆర్టికల్ 14లో రాసింది నిజం కాదు. ఈ మాట నేను అంటే నన్ను ‘నచ్చలైటు’ అని లోపల ఏస్తారు. అన్నది మాజీ పార్లమెంట్ సభ్యుడు, పీవీ నర్సిహంరావు శిష్యకోటిలో ముఖ్యడు, వైఎస్ రాజశేఖరెడ్డి ఆoతరంగికులలో ఒకడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కోసం మీడియా ముందు మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానం అన్నది అబద్దం అన్నాడు. ఆయన పేరు ఉండవల్లి అరుణ్ కుమార్. నిష్టురమైన నిజం చెప్పాడు.
Also read: దండోరా రిపోర్టు చెప్పిన భూసంస్కరణల కథాకమామీషూ
P.S. అజయ్ కుమార్