- సీఎం ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు ఆదిత్య నాథ్ దాస్ ఏపీ కొత్త సీఎస్ గా బాద్యతలు చేపట్టనున్నారు. 1987 బీహార్ బ్యాచ్ కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక పదవీ విరమణ అనంతరం నీలం సాహ్నిని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సీఎం జగన్ నియమించారు. అనుభవం రీత్యా ఆమె సేవలను కొంతకాలం వినియోగించుకోవాలని సీఎం జగన్ భావించడంతో పదవీ విరమణ అనంతరం ముఖ్యసలహాదారుగా నియమించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.
పలువురి బాధ్యతల్లో మార్పులు
మరికొందరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు జరిగాయి. ఆదిత్యనాథ్ సీఎస్ గా నియమితులైన నేపథ్యంలో జలవనరుల శాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారిన ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా, కె. సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎస్ నీలం సాహ్ని తరువాత రేసులో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ లు సీఎస్ రేసులో ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యంలు ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. అయితే టీడీపీ హయాంలో సీఎస్ గా పనిచేసిన సతీష్ చంద్రను మళ్లీ నియమించేందుకు సీఎం జగన్ సుముఖంగా లేనట్లు సమాచారం. మరో అధికారి నీరభ్ కుమార్ సర్వీస్ 2024 వరకు ఉంది. దీంతో గతంలో జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ నియామకానికి సీఎం జగన్ పచ్చజెండా ఊపారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వేకి సీఎం శ్రీకారం