ఆవుల శ్రీలత
ఆత్మస్థైర్యం, అనుకువ, కష్టించి చెమటోడ్చేతత్వంతో జీవన యాత్ర సాగిస్తూ బేష్ అనిపించుకుంటున్న ఆదిలక్ష్మి నేటి యువతీ యువకులకు స్పూర్తి గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టైర్లకు పంచర్లు:
జూలూరుపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి చదువులేదు. ఆస్తి లేదని కలత చెందలేదు. తన భర్త వీరభద్రం ద్వారా టైర్లకు పంచర్లు వేయడం నేర్చుకుని వృత్తిగా మలుచుకున్న తీరు ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. తల్లిదండ్రులు పేదవారే. మనువాడినవాడు పేదరికంలో మగ్గిన వాడే. తన భర్త ఒక్కడి సంపాదన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టేక్కించలేక సతమతమవ్వడంతో వచ్చిన ఆలోచనతో తన భర్త ద్వారా నేర్చుకున్న విద్యతో టైర్లకు పంచర్లు వేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ కష్టపడుతుంది.
ఇదీ చదవండి: రామగుండం లో మహిళల హెల్మెట్ ర్యాలీ
కండలు కరిగే పని:
ఆదిలక్ష్మి చేస్తున్న పని కండలు తిరిగిన మగవాడు సైతం ఆయాసంతో అవస్థపడాల్సిందే. భారీ వాహనాల టైర్లకు పంచర్లు వేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. టైర్లకు పంచర్లు వేయడమంటే అంత తేలిక కాదు. అర్దరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా శ్రమించాలి. అదిలక్ష్మి అదరలేదు, బెదరలేదు. కుటుంబపోషణలో భర్త సంపాదన అరకొర మాత్రమే కావడంతో తల్లితండ్రుల కొద్ది పాటి భూమిని తాకట్టు పెట్టి లక్ష రూపాయిలతో రహదారిపై షెడ్డు వేసుకుని రెక్కలు ముక్కలైయ్యేలా శ్రమిస్తోంది. భారీ వాహనాల టైర్లకు పంచర్లు వేసి వాటిని బిగించడమంటే కఠినంగా శ్రమ పడాల్సిందే. పంటి బిగువున బాధ భరిస్తూ తన కుటుంబ ఆర్థిక పరిస్థితులకు మరమ్మతు చేస్తున్న తీరుకు అందరు ఫిదా అవుతున్నారు..
ఎదగాలనే పట్టుదల :
ఆదిలక్ష్మి టైర్లు పంచర్లు వేయడమే కాదు. గ్యాస్ వెల్డింగ్ తో టింకరింగ్ చేయడంతో అనారోగ్యం పాలైంది. వైద్యులు వెల్డింగ్ పనులకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబం ఆర్దిక పరిస్థితులు సరిదిద్దుకోవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వృత్తిలో ముందుకుసాగుతోంది. తను ఆర్థికంగా ఎదగాలి అనే పట్టుదల ముందు అన్నీ మరిచి పోతోంది. తను ఎదగడమే కాదు మరో నలుగురికి ఉపాధి కల్పించాలనే సంకల్పం ఇప్పుడు ఆసరా ఇస్తోంది. అందరు సలాం కొడుతున్నారు. రెంచీలు పట్టుకుని టైర్లు విప్పడం బిగించడం నుండి చిన్న చిన్న టింకరింగ్ పనులు నేర్చుకోవడమే కాదు. వాటిలో నైపుణ్యాన్ని సాధించింది. అలవోకగా భారీ వాహనాల టైర్లు విప్పదీయడంతో పాటు వాహనాలకు చిన్నపాటి మరమ్మతులు నేర్చుకోవడంతో వాహనాల డ్రైవర్లు యజమానులు ప్రోత్సహించడం సంతోషం కలిగిస్తుందని ఆదిలక్ష్మి మురిసిపోతోంది.
ఇదీ చదవండి: నల్ల బంగారు నేల ఆణి ముత్యం సాగర్
కవిత హామీ:
ఆదిలక్ష్మి విషయం తెలుసుకున్నసీఎం కేసీఆర్ కుమార్తె, ఎంఎల్ సీ కవిత ఆమెను హైదరాబాద్ పిలిపించుకొని మాట్లాడారు. అన్ని విషయాలూ అడిగి తెలుసుకున్నారు. తనకు చేతనైనంత సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. అననుకూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవనసమరం జయప్రదంగా సాగిస్తున్నందుకు ఆమెను అభినందించారు.
అందరి సహకారం:
ఆదిలక్ష్మిలో ఆత్మస్థైర్యంతో పాటు నలుగురికి ఆలంబనగా నిలిచే మనస్సుండటం అభినందించదగ్గ విషయం. ముసలి తనంలో ఉన్న తల్లి తండ్రులకు గ్రామీణాబివృద్ది శాఖ అధికారులు సహితం ఆదిలక్ష్మీకి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు రావడం అబినందించ దగ్గ విషయం. ఆదిలక్ష్మి తన శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుందాం.