ప్రభువు గారికీ దండం పెట్టూ
పాదం వంచీ భక్తిని పెట్టూ
పట్టు శాలువలు కప్పెదరంటా
కాసులు మువ్వలు పెట్టెదరంటా
డూడూడూడూ యెంకన్నా!
మోసము చేసును మునసబు గారు
కక్షలు కట్టును కరణం గారు
కలిమి కలిగినా కాపులు వీరు
డూడూడూడూ యెంకన్నా!
కుంచెడు మాయ కోమటి మాట
పత్తి కాయరా భేమ్మణ ధాటి
సలాము తెచ్చే సాయబు భేటీ
డూడూడూడూ యెంకన్నా!
చెన్న పట్టణం చేరువ రాదు
కాశీ పట్టం కానగ బోదూ
కాపవరమే కదలాలేదు
డూడూడూడూ యెంకన్నా!
చెట్టు కదిలినా పుట్ట పొదలదూ
నీరు పోయినా నాచు వదలదూ
గుడి పాడయినా గూబ వదలదూ
గుడి పొలాలు పూజారి వదలడూ
డూడూడూడూ యెంకన్నా!
యేడు కొండలా యీశ్శరుడండీ
యెండికొండలా యెంకన్నండీ
భమిడి కొమ్ములా బసవయ్యండీ
డూడూడూడూ యెంకన్నా!
ఆధునికాంధ్ర సాహితీ జగత్తు లోని తొలినాళ్ళ కవి పరంపరలో ఒకరు అడివి బాపిరాజు. తెలుగు నేలపై చెరగని పాదముద్రలు వీడి వెళ్లిన వాడు (1895-1955) కవి మాత్రమే గాక, నవలా రచయిత, విమర్శకుడు, గాయకుడు, చిత్రకారుడు, పాత్రికేయుడు, వృత్తి రీత్యా న్యాయవాది, బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రధాన అధ్యాపకుడు కూడా. 1939లో నిర్మించబడిన ధృవ, మీరాబాయి చిత్రాలకు కళాదర్శకుడుగా పనిచేసినవాడు. కొంతకాలం హైదరాబాద్ నుండి వెలువడిన ‘మీజాన్’ పత్రికకు సంపాదకుడు కూడా. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని కారాగార క్లేశం అనుభవించిన దేశభక్తుడు.
Also read: మహాభారతం అవతారిక
రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆ రోజుల్లో ఆంగ్లేయుడైన ఆస్వాల్డ్ కూల్డ్రే ఆంధ్రదేశంలో అనేకమంది విద్యార్థులకు తరిఫీదు నిచ్చి వారిని వేత్తలగా తీర్చిదిద్దినవాడు. కూల్డ్రే వద్ద చదువుకున్న వారిలో బాపిరాజు, కవికొండల వెంకటరావు ప్రముఖులు. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు (1897-1925) లోని ప్రతిభను గుర్తించి ఆయనను ముంబయి లోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు పంపే ఏర్పాట్లు చేసినవాడు కూల్డ్రే. 1988 లో రాజమండ్రి లోని దామెర్ల రామారావు ఆర్ట్ గాలరీ తొలిసారి దర్శించే అవకాశం నాకు కలిగింది. అక్కడ కూల్డ్రేకు సంబంధించిన అనేక పత్రాలు ఒక చెక్కపెట్టెలో భద్రపరచి వుండడం చూసినాను. ఆస్వాల్డ్ కూల్డ్రే స్వయానా కవి, రచయిత, చిత్రకారుడు, కళాతపస్వి. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు తెలుగునేలపై గ్రంధస్థం చేయబడినాయో లేదో నాకు తెలియదు.
పదవీవిరమణ తర్వాత ఆస్వాల్డ్ కూల్డ్రే ఇంగ్లండుకు మరలి వెళ్ళినాక అడివి బాపిరాజు మరణం సంభవించింది. బాపిరాజుపై వెలువడిన ఒక స్మారక సంచికలో బాపిరాజును స్మరిస్తూ ఆయన కుమార్తెకు కూల్డ్రే ఇంగ్లండు నుండి వ్రాసిన లేఖ ప్రచురింపబడింది. ఆ లేఖలో కూల్డ్రే హృదయ సౌకూమార్యము, బాపిరాజుపై ఆయనకు గల పితృ వాత్సల్యం ద్యోతకమౌతాయి.
ఆ స్మారకసంచికను 1966-67 ప్రాంతాల్లో నంద్యాల బ్రాంచి లైబ్రరీలో చదివినాను. చాల ఏళ్ల తర్వాత ఆ సంచిక ప్రతి ఒకటి అబిడ్స్ పేవ్ మెంట్లపై నాకు లభించింది.
కూల్డ్రే తన శిష్యులను తీసుకొని కొండలకు, గుట్టలకు, పిక్నిక్ వెళ్లే వాడు. అట్టి ఒకానొక పిక్నిక్ లో బాపిరాజు చేయి తలక్రింద పెట్టుకుని ఒక శిలపై నిదురిస్తుండగా కూల్ఠ్రే గీసిన నీటి రంగుల చిత్రం కూడా ఆ సంపుటిలో ఉన్నది.
Also read: ఎవరి కోసం?
ఆ సంచికలోనే బాపిరాజుపై, రాయప్రోలు, విశ్వనాథ, దాశరథి వంటివారలు రచించిన స్మృతిగీతాలు కూడా వున్నాయి. ఉదాహరణకు రాయప్రోలు రచన:
“నీ యమ్మ ఏ తార చాయలో నిను గాంచె
ఏ యోషధుల పాల పాయసంబిడి పెంచె
లేకున్న ఈ శిల్ప లీలాభిరుచి రాదు
కాకున్న ఈ స్వాదు కంఠమబ్బగ బోదు”
భావోద్వేగంలో, హృదయ మార్దవంలో, నిసర్గ కోమల కవితా ధారలో బాపిరాజు, బసవరాజు అప్పారావు, ఒకరికొకరు సరితూగుతారు. మహాకవి కృష్ణశాస్త్రి మాటల్లో ఇరువురూ “ఉన్మత్త పథికులే”. వర్డ్స్ వర్త్ కవిత్వపు నిర్వచనానికి వీరి మనస్తత్వాలు సరిగ్గా సరిపోతాయి: “Poetry is the spontaneous outflow of feelings. It takes its origin from emotion recollected in tranquillity”.
బాపిరాజు “వరద గోదావరి” లేదా “లేపాక్షి బసవయ్య” చదివితే ఈ విషయం చక్కగా బోధపడుతుంది.
“డూడూ బసవన్న” గేయం వంద యేళ్ళ నాటి తెలుగు దేశపు గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థను కళ్లకు కడుతుంది. తెలుగు పల్లెల్లోని భూకామందులు, మునసబులు, కరణాలు, కాపులు, కోమట్లు, సాయబులు, పూజారులు, వారి వారి నైజగుణాలతో, కట్టగట్టుకొని పై గేయంలో దర్శనమిస్తారు. ఒకానొకప్పటీ సామాజిక దోపిడీ వ్యవస్థపై చక్కని సెటైర్ పైగేయం. ఈశ్వరుణ్ణి ఏడుకొండలకు, వెంకన్నను వెండి కొండకు పరస్పరం బదిలీ చేయడం పై గేయంలోని కొసమెరుపు.
Also read: మహాభారతం అవతారిక
-నివర్తి మోహన్ కుమార్
Very nice congratulations
శుభోదయం!
నివర్తి మహోదయా !!
Good
Very good