Sunday, December 22, 2024

ప్రజలను కన్విన్స్‌ చేస్తారా? కన్‌ఫ్యూజన్‌లోనే ఉంచుతారా?

సి. రామచంద్రయ్య

అవతలివారిని ఒప్పించడంలో విఫలం అయితే, వారిని గందరగోళ పరిస్తే సరిపోతుంది (ఇఫ్‌ యు కెనాట్‌ కన్విన్స్‌ అదర్స్‌, బెటర్‌ కన్‌ఫ్యూజ్‌ దెమ్‌) అన్నది రాజకీయాలలో ప్రసిద్ధి పొందిన ఓ నానుడి. ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్ర మోదీ పెద్దల సభగా పిలవబడే రాజ్యసభలో చేసిన ప్రసంగం విన్న తర్వాత పైన పేర్కొన్న నానుడి ఎవరికైనా గుర్తుకొస్తుంది. ఎందుకంటే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చేసే ప్రసంగంలో ‘ఆకాశమే హద్దుగా ఎన్నో అంశాలను ప్రస్తావించే అవకాశం ప్రధానమంత్రికి ఉన్నప్పటికీ. ప్రతిపక్షాలు లేవనెత్తిన ముఖ్యాంశాలను పూర్తిగా వదిలిపెట్టి పాతపురాణాలను తవ్వి తీయడం ద్వారా ఆయన పూర్తిగా పలాయనవాదం అనుసరించారని సామాన్య ప్రజలకు సైతం అర్ధమయింది.

నెహ్రూని విమర్శించడం పరిపాటి అయింది

సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే దేశ తొలి ప్రధాని అయిన పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రును ప్రత్యక్షంగా, పరోక్షంగా దుయ్యబట్టడం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ అలవాటుగా మారింది. ఈసారి కూడా రాజ్యసభలో మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోదీ పండిట్‌ నెహ్రును వదల్లేదు. ఆశ్చర్యం ఏమంటే నెహ్రు వారసులు తమ పేర్ల చివర నెహ్రు అనే ఇంటి పేరును ఉపయోగించుకోకుండా ‘గాంధీ’ పేరును తగిలించుకున్నారంటూ సోనియా, రాహుల్‌, ప్రియాంకలను తప్పు పట్టే ప్రయత్నం చేయబోయి తనే తప్పులో కాలేశారు. ఫిరోజ్‌ గాంధీని పెళ్లి చేసుకొన్న ఇందిరా ప్రియదర్శిని వివాహానంతరం ఇందిరాగాంధీ అయింది. ఫిరోజ్‌ గాంధీ కుమారులైన రాజీవ్‌, సంజయ్‌లకు ఇంటి పేరు తండ్రి నుండి వస్తుందా? లేక తాత నెహ్రు నుంచి సంక్రమిస్తుందా? నిజానికి ఇవి పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు కావు. కానీ, ఇటీవలి కాలంలో పార్లమెంట్‌ అందరికీ ఓ రాజకీయ వేదికగా మారిపోయింది. పనికి మాలిన అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావనకు రావడం ఓ రివాజుగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ అంబులపొదిలో ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలు ఉంటాయి. కానీ, ఈసారి మాత్రం ఆయన పాత ఆయుధాల్నే ప్రయోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అప్పడు కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా కుట్రపూరితంగా కూల్చివేసిందో కూడా ప్రస్తావించారు. అయితే, ఆ కుట్రలో ప్రధాన పాత్రధారి అయిన నాదెండ్ల భాస్కరరావును తమ పార్టీ అక్కున చేర్చుకొని పార్టీ తీర్ధం ఇచ్చిన విషయాన్ని నరేంద్ర మోదీ మర్చిపోయినట్లున్నారు.

మోదీ ప్రసంగాన్ని అధికసంఖ్యాకులు మెచ్చరు

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన రాజకీయ ప్రసంగం దేశంలోని మెజారిటీ ప్రజలను సంతృప్తి పర్చదు. సెప్టెంబర్‌ 7న లోక్‌సభలో రాహుల్‌ గాంధీ లేవనెత్తిన కొన్ని కీలక ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ ధీటైన సమాధానం చెప్పగలరని ఆశించిన వారికి ఆశాభంగం మిగిలింది. దేశాన్ని కుదుపేస్తున్న అదానీ ఉదంతాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. గౌతమ్‌ అదానీ అనే వ్యాపారవేత్త గత 8 ఏళ్లల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ అందదండలు ఉన్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో 906వ స్థానంలో ఉన్న అదానీ స్వల్పకాలంలోనే 2వ స్థానానికి ఎలా ఎదగగలిగారన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా, గౌతమ్‌ అదానీకి బీజేపీ అందదండలు పుష్కలంగా ఉన్నాయని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ వెంట విదేశాలకు వెళుతున్నారని చాలాకాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినపుడు ఆయన వెంట భారతీయ వ్యాపార దిగ్గజాల బృందం ఉంటే దానిని తప్పుపట్టాల్సిన పని లేదు. అమెరికా అధ్యక్షుడైనా, మరే ఇతర దేశాల అధ్యక్షులైనా తాము చేసే విదేశీ పర్యటనలకు తమతోపాటు దేశీయ పారిశ్రామిక వేత్తలను తీసుకొని వెళ్లడం ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే, దేశంలోకి విదేశీ పెట్టుబడుల్ని, సాంకేతిక నైపుణ్యాల్ని ఆహ్వానించడానికి, వాటిని ఇచ్చిపుచ్చుకోవడానికి దేశాధినేతలు కేవలం ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలను మాత్రమే తమతో తోడ్మని వెళితే దానిని కచ్చితంగా తప్పుపట్టాల్సిందే. దేశంలోని పారిశ్రామిక వేత్తలందరికీ ప్రభుత్వాలు సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడే దేశం పారిశ్రామికంగా ముందంజ వేస్తుంది. అయితే, మిగతా పారిశ్రామిక వేత్తలకంటే గౌతమ్‌ అదానీ పట్ల ప్రత్యేక ప్రేమ ప్రదర్శిస్తున్నారని, అందుకు ఉదాహరణగా పలు కీలక ఒప్పందాలను ఎత్తి చూపుతున్నారు. అంతేకాకుండా, గౌతమ్‌ అదానీ సంస్థలకు విమానాశ్రమాల నిర్వహణలో ఏమాత్రం అనుభవం లేకపోయినా ఆ కాంట్రాక్టులు ఆ సంస్థలే పొందడానికి నిబంధనలను మార్చారని ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ ప్రతిస్పందించడం లేదు. వాటిపై ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.

పుట్ట పగిలింది

ఎప్పుడైతే న్యూయార్మ్‌కు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే ఓ రీసెర్చ్‌ సంస్థ గౌతమ్‌ అదానీ కంపెనీల ఆర్థిక వ్యవహారాలలో, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలలో జరిగిన అవకతవకలకు సంబంధించి 106 పేజీల నివేదికను బహిర్గతం చేసిందో, దాంతో పుట్ట పగిలినట్లయింది. గౌతమ్‌ అదానీ కంపెనీల షేర్లు రోజుల వ్యవధిలోనే శీఘ్రంగా పతనం అయ్యాయి. భారతీయ జనతాపార్టీ నేతలు కొందరు, ఆ పార్టీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న మరికొందరు మేధావులు చేస్తున్న ప్రచారం ఏమంటే… అదానీ కంపెనీలను టార్గెట్‌ చేయడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయట. అదానీని టార్గెట్‌ చేయడం అంటే దేశాన్ని టార్గెట్‌ చేయడమేనని వారు విశ్లేషిస్తున్నారు. ఆ వాదనను నిజమేనని నమ్ముదాం. సదరు విదేశీ శక్తులు ఒక్క అదానీ మీదనే ఎందుకు పడ్డాయి? దేశంలోని మిగతా పారిశ్రామికవేత్తలను ఎందుకు వదిలిపెట్టాయి? ఏ ఒక్క పారిశ్రామికవేత్తనో టార్గెట్‌ చేస్తే, అది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం అవుతుందా? తప్పుడు నివేదికల ద్వారా ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న కంపెనీలను దెబ్బ తీయడం ఎవరికీ సాధ్యం కాదు. తాత్కాలికంగా ఒడిదుడుకులు ఎదురైనా ఫండమెంటల్స్‌ బలంగా ఉందే సంస్థలు బొక్కబోర్లా పడవు. ఇది చరిత్ర చెప్పే సత్యం.

హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలు ముఖ్యం, వెనుక ఎవరున్నారనేది కాదు

హిండెన్‌బర్ట్‌ నివేదిక వెనుక “చైనా” హస్తం ఉన్నదని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. అందులో నిజం ఉండిఉండవచ్చు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశం కంటే ఆ సంస్థ లేవనెత్తిన అంశాలే ఎవరికైనా ముఖ్యం. హిండెన్‌బర్ల్‌ రిపోర్టు వండివార్చింది కాదు. తాము ఎక్కడెక్కడి నుంచి సమాచారం సేకరించిందీ  తెలియపరిచే 720 సైటేషన్స్‌ను ఆ సంస్థ ఉదహరించింది. అందులో 45 నిర్ధారణలు చేశారు. వాటన్నింటికీ డాక్యుమెంటరీ సాక్ష్యాలు ప్రజల ముందుపెట్టారు. సరే.. వీటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే.. అదానీ కంపెనీలలో ఎల్‌ఐసి; ఎస్‌బిఐ సంస్థలు వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా పెట్టాయి. హిండెన్‌బర్ల్‌ నివేదిక వెలుగు చూశాక అదానీ కంపెనీల షేర్లు నేలముఖం చూడటంతో ఎల్‌ఐసి; ఎస్‌బిఐలకు భారీ నష్టం వాటిల్లింది. ఆ రెండు సంస్థల్లో ఉన్నది ప్రజాధనమే కదా? ప్రజల సొమ్ము కళ్లముందే ఆవిరైపోతుంటే పాలకులు తమకు ఏమీ సంబంధంలేనట్లు వ్యవహరించడం సబబేనా? ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాలు పట్టుబడితే… ప్రైవేటు కంపెనీ విషయాలను పార్లమెంట్‌లో ఎలా చర్చిస్తాం? అంటూ బీజేపీ నేతలు గడుసుగా సమాధానం చెబితే ప్రజలు హర్షిస్తారా?

నియంత్రణ సంస్థలు ఏమి చేస్తున్నాయి?

దేశంలో ఐటి, ఈడీ, సెబీ వంటి రెగ్యులేటరీ సంస్థలు అనేకం ఉండగా, వాటి సూక్ష్మదృష్టిని దాటుకొని ఏ కంపెనీ అయినా ఎలా అవకతవకలకు పాల్పడగలదు? ఈ సంస్థల కళ్లు కప్పడం ఎవరికి సాధ్యం?! వీటికి తెలియని సమాచారం ఎక్కడో న్యూయార్క్‌లో ఉన్న హిందెన్‌బర్గ్కు ఎలా తెలుస్తుంది? అని కొందరు మేధావులు చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. నిజమే… ఈ దేశంలో అనేక చట్టబద్దమైన సంస్థలు నియంత్రణ చేసే నిఘా విభాగాలు ఉన్నమాట వాస్తవమే. కానీ, వాటి కళ్లు గప్పి దర్జాగా దేశం దాటిన విజయమాల్యా, నీరవ్‌మోదీల మాటేమిటి? దేశంలోని నిఘా వ్యవస్థల్ని తమపని తాము చేసుకోనిస్తే.. తప్పనిసరిగా చట్ట ఉల్లంఘనలు అదుపులో ఉంటాయి. కానీ, ఆ పరిస్థితి మన వద్ద ఉన్నదా? హర్షద్‌ మెహతా స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం గానీ, ఆ తర్వాత జరిగిన కేతన్‌ పరేఖ్‌ ఉదంతంగానీ భారీ నష్టం జరిగాకనే ప్రభుత్వాలు కళ్లు తెరవడం జరిగింది. “చట్టాలకు చిల్లులు ఉంటాయి. వాటిద్వారా కొందరు తేలిగ్గా తప్పించుకొంటారు” అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్‌ ఉంది. అది నిజం. అయితే, చట్టాలను తూట్లు పొడుస్తున్నది ఎవరు? పటిష్టవంతంగా అమలు చేయాల్సిన వారే చిల్లులు ఏర్పరిస్తే కంచే చేను మేసినట్లవుతుంది.

అవకాశవాద వేదికగా దేశం

భారత రాజ్యాంగం దేశాన్ని ఓ అవకాశాల గనిగా మార్చి అందరికీ ఆ ఫలాలు అందించాలని ప్రభుత్వాలకు నిర్దేశించింది. కానీ, ఏడు దశాబ్ధాల అనుభవం నుంచి చూస్తే కొంతమంది దేశాన్ని అవకాశవాద వేదికగా మార్చుకున్నారు. ఫలితంగానే, దేశంలోని సహజ వనరులన్నీ కొందరికి దఖలు పడుతున్నాయి. పైవేటీకరణతో ఇది మరింత ముమ్మరం అయింది. నిజానికి, ప్రైవేటీకరణ లక్ష్యం.. ఎక్కువ మంది పోటీపడితే తద్వారా నాణ్యతతో, చౌకతో సేవల్ని వస్తువుల్ని వినియోగదారులు పొందగలుగుతారు. కానీ, నేడు ఆ పరిస్థితి మారిపోయింది. టైలర్‌మేడ్‌ నిబంధనలతో ఎక్కువ సంస్థలు పోడీ పడకుండా ఒకటీ అరా సంస్థల్ని పోటీలో నిలిపి, వాటికే సమస్తం రాసిచ్చేసే దుస్థితి నెలకొంది. రాజకీయాలను పక్కనపెడితే, ఇప్పటికీ దేశ ప్రజలలో అత్యధిక శాతం మందికి ప్రధాని నరేంద్రమోదీ మీద అపారమైన విశ్వాసం ఉంది. ఆయన నాయకత్వంలో భారత్‌ త్వరలోనే చైనాను అధిగమిస్తుందన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. అందువల్ల ప్రధాని నరేంద్రమోదీ… హిందెన్‌బర్గ్‌ నివేదికలోని నిజనిజాలను విచారించాలి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో పసలేదని రుజువు పర్పాలంటే.. అదానీ వ్యవహారంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని (జేపీసి) నియమించి నిజాల నిగ్గు తేల్చాలి. ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి. ప్రజలను కన్విన్స్‌ చేస్తారా? లేక కన్‌ఫ్యూజన్‌లోనే ఉంచుతారా? అన్నది బీజేపీ నేతలు తేల్చుకోవాలి.

సి. రామచంద్రయ్య

శాసన మండలి సభ్యులు

ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్

Ramachandraiah C
Ramachandraiah C
C. Ramachandraiah is an MLC. He was earlier a member of Rajya Sabha and a minister in NTR cabinet. He is also an auditor.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles