Tuesday, January 21, 2025

మహాభారతం – ఆదిపర్వం – తృతీయాశ్వాసం

యయాతి – దేవయాని ఘట్టం

అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ

కుంకుమ చందన పంకములయు

వారివ ధమ్మిల్ల భారావకలిత ది

వ్యామోద నవపుష్ప దామములయు

వారివ ముఖ సకర్పూర తాంబూలాది

వాసిత సురభి నిశ్వాసములయు

వారివ పరిధాన చారు ధూపములయు

విలసిత సౌరభావలులు దాల్చి

అనిలుడను దూత వోయి తోడ్కొనుచు వచ్చె

దేవయాని పాలికి మృగతృష్ణ జేసి

కాననంబున గ్రమ్మరు వాని వీరు

నతి పరిశ్రాంతుడైన యయాతినంత

నన్నయ భట్టారకుడు

నూతిలో పడిన దేవయానిని ఉద్ధరించి యయాతి తన నగరానికి మరలిపోతాడు. ఇటు తప్పిపోయిన దేవయానిని వెదకుతూ ఘూర్ణిక అనే పరిచారిక అడవికి వస్తుంది. ఆమెను చూసిన దేవయాని “నేను వృషపర్వుని పురానికి రాను గాక రాను. శర్మిష్ఠ నాకు చేసిన అవమానాన్ని నా తండ్రి శుక్రునికి వివరించి చెప్పు” మని పరిచారికను వెనక్కు త్రిప్పి పంపుతుంది.

Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – దేవయాని యయాతి ఘట్టం

త్వరితగతిన ఆ పరిచారిక శుక్రాచార్యుని చెంతకు వెళ్ళి జరిగిన సంగతి వివరిస్తుంది.

తక్షణమే శుక్రుడు అరణ్యానికి వచ్చి “కోపఘూర్ణిత బాష్పపూరిత తయనయై” యున్న తన కుమార్తెతో ఇట్లా అంటాడు:

“నియమ నిష్టలతో గొప్పగొప్ప యాగాలు చేసినవారికన్న కోపతాపాలు లేని మానవుడే మిన్న.  ఎవరైనా కోపంతో మాట్లాడితే కోపపడని వాడు, ఎవడైనా నిందిస్తే, విననట్లే మారు పలకకుండా ఉండేవాడు, ఎంతటి అవమానం పొందినా నిశ్శబ్దంగా భరించేవాడే ధర్మజ్ఞుడు. కాబట్టి, బుద్ధి కలిగిన వారికి క్రోధం తగదు. శర్మిష్ఠ రాచబిడ్డ. వయస్సులో చిన్నది. దానితో నీకేమిటి తగవు?”

తండ్రి మాటలు దేవయానికి రుచించవు. “నిందలు పలికే జ్ఞానహీనుల వద్ద పడియుండడం కన్న నీచమైనది ఎక్కడైనా వున్నదా? ఈ వృషపర్వ పురానికి నేను వచ్చేది లేదు. మరెక్కడికైనా వెళతాను” అని  జవాబిస్తుంది.

ఆ మాటలకు నొచ్చుకొని, “నాకు నీవే గతివి. నీతోబాటు నేను కూడా వస్తాను” అంటూ శుక్రాచార్యుడు కూతురికి  ఓదార్పు మాటలు పలుకుతాడు.

Also read: మహాభారతం – తృతీయాశ్వాసం – నూతిలో పడిన దేవయానిని యయాతి పైకి తీసే ఘట్టం

వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకొన్న వృషపర్వ మహారాజు హుటాహుటిన శుక్రుని వద్దకు వచ్చి రెండు చేతులు జోడించి మ్రొక్కి ఆయనతో ఇట్లా అంటాడు:

“నీ విద్యా మహాత్యంచే దేవతలను సదా జయిస్తూ, సుస్థిరమైన సంపదలతో మా రాక్షసజాతి గర్వంతో జీవిస్తున్నది.  నీవు లేకపోతే, ఇవన్నీ మాకు సాధ్యమా? మా ఏనుగులు, గుఱ్ఱాలు, మాకు గల సమస్త సంపదలతో బాటు, రాక్షసులమైన మేము సైతం నీ సొమ్ములమే! దేవయాని ఏమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం”.

ఈ మాటలకు సంతసిల్లిన దేవయాని “అట్లైతే శర్మిష్ఠ తన సహస్ర కన్యకా పరివారంతో సహా దాసి కావలయును” అంటూ షరతు విధిస్తుంది. ఆ నిబంధనకు వృషపర్వుడు అంగీకరించి, అప్పటికప్పుడే తన కూతురిని, ఆమె కన్యకా సహస్రాన్ని అక్కడికి రావించి దేవయానికి వారినందరినీ దాసీలను గావించి భార్గవతనయకు మనఃప్రీతి కలిగిస్తాడు. తదాదిగా, శర్మిష్ఠ, కన్యకా సహస్రంతో సహా దేవయానికి ఊడిగం చేస్తూ వుంటుంది.

ఇట్లా వుండగా, ఒకరోజు, శర్మిష్ఠ, తదితర ఇష్టసఖులందరూ తనను సంతోషంతో సేవించి రాగా, ఒకప్పుడు ఎక్కడైతే ఇదే శర్మిష్ఠచే తాను అవమానం పాలైందో, అదే వనాంతరానికి, క్రీడాకౌతుకంతో, వైభవోపేతంగా దేవయాని తరలి వెళ్లింది.

ఆ విపినవాటికలో, “పుష్పాపచయంబు చేయుచు, విమల ప్రవాహ విలసితంబైన యొక్క సెలయేటి కెలన, నవవికచ కుసుమ సుకుమార కోరక నికర భరిత సహకార కురువక వకుళ, అశోక, తమాల సాల చ్ఛాయాశీతల సికతాతలంబున ఇష్ట వినోదంబుల” దేవయాని ప్రభృతులు మునిగి తేలుతున్న సమయాన (నేటి పద్యంతో అనుబంధం)

“ఒకదానితో ఒకటి హత్తుకొనే ఆ అంగనామణుల ఉత్తుంగ కుచద్వయాల నుండి వెలువడే కుంకుమ చందన సుగంధ పరిమళాలను”,

“ఆ అంగనలవే, బరువైన ధమ్మిల్లముల నుండి జారిపడిన నవపుష్ప దివ్యామోద సువాసనలను”,

ఆ అంగనలవే, ముఖపద్మాలనుండి వెల్లువలై విరిసే కర్పూర తాంబూలాది సురభి నిశ్వాసములను”,

“ఆ అంగనలే ధరించిన చారు వస్త్రాల సుమనోహర ధూప సౌరభాలను”,

“అతి పరిశ్రాంతుడై, మృగతృష్ణతో అడవిలో క్రమ్మరుతున్న వీరుడైన యయాతి వద్దకు వాయువనే దూత వెంట పెట్టుకొని వచ్చినాడు.”

Also read: మహాభారతం – తృతీయాశ్వాసం – వ్యాసుని జననం

నేటి పద్య ప్రాశస్త్యం

యయాతి జీవితంలో, దేవయాని, శర్మిష్ఠల జీవితాలలోనూ ప్రధానమైన మైలురాయి వంటి ఘట్టానికి నేటి పద్యం తెరతీస్తున్నది.

మొదటిసారి, దప్పికతో నీటి కోసం నూతివద్దకు తానే స్వయంగా యయాతి వెళతాడు.

ఈ సారి మాత్రం పలువురు అంగనామణుల సుకుమార దేహాల నుండి వెలువడే సువాసనలను మోసుకొని గంధవహుడే స్వయంగా యయాతి వద్దకు వెళుతున్నాడు.

మొదటిసారి జలం. రెండవసారి వాయువు. పంచభూత భాగస్వాములీ జలము, వాయువూ. మొదటిసారి నీటిబావి పుణ్యమా అని యయాతికి దేవయానితో పరిచయం ఏర్పడుతుంది. రెండవసారి అనిలుని పుణ్యమా అని కేవలం దేవయానియే గాక, శర్మిష్ఠ కూడా యయాతి జీవితంలో అడుగు పెట్టబోతున్నది. అనగా పూరు, కౌరవ, పాండవ వంశ క్రమాలకే పునాదియైన ఈ ఐతిహాసిక ఘట్టానికి స్వయానా పంచభూతాలే తోడ్పడుతున్న భావనను, నేటి పద్యమూ, నూతినుండి యయాతియే స్వయంగా దేవయానిని  చేదే పద్యమూ, కలిగిస్తున్నాయి.

మృగతృష్ణ

నేటి సీసానికి అనుబంధమైన తేటగీతిలో

అనిలుడను దూత వోయి తోడ్కొనుచు వచ్చె

దేవయాని పాలికి మృగతృష్ఢ జేసి”

అనే పదప్రయోగం “అంగనామణుల వివిధాంగ పరిమళాలను, అతి పరిశ్రాంతుడై, మృగతృష్ణతో, అరణ్యభూమిలో తల్లడిల్లుతున్న యయాతి వద్దకు అనిలుడనే దూత తీసుకొని వచ్చినాడు.

ఇది సామాన్యమైన అర్థం. అనగా, “విపినాంతరంలో వేటాడి వేటాడి విపరీతంగా అలసిపోయి, మృగాలు నీటికై ఎట్లా పరితపిస్తాయో, అదే మాదిరి పరితపిస్తున్న యయాతి వద్దకు వాయువు అనే దూత అంగనామణుల అంగాంగ పరిమళాలను తన వెంట తీసుకొని వచ్చినాడు” అని అర్థం.

Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం

కానీ ఈ అర్థం హేతు బద్ధమైనది కాకపోవచ్చు. కారణం? దప్పిక వేసిన వానికి సుగంధ పరిమళాలు దప్పిక తీరుస్తాయా?

ఇక రెండవ అర్థం: “అంగనల వివిధాంగ సువాసనలను వాయువనే దూత, అతి పరిశ్రాంతుడైన యయాతి వద్దకు తీసుకొని వచ్చి అతనికి మృగతృష్ణ కలుగజేసినాడు”.

ఈ రెండవ అర్థంలో మృగతృష్ణ అనగా మృగమద సౌరభ తృష్ణ. మద్యపాన ప్రవీణులు ఏ మద్యం ఏ జాతికి చెందినదో వాసన బట్టి చెప్పగలరు. భోగపరాయణులైన వారు అంగనామణుల ఏ అంగానికి  ఏ రకమైన పరిమళం పూనుకుంటారో చెప్పగలరు.

నేటి పద్యంలో అనేకమంది అంగనల వివిధాంగ పరిమళాలు యయాతి ముక్కు పుటాలను సోకుతున్నాయి. ఈ  సుగంధాలు ఏ అంగానికి చెందినవో యయాతి ఊహిస్తున్నాడు.

ఆయన ఊహలో ఒకజాతికి చెందిన సువాసన ఉత్తుంగ సంగత కుచద్వయాల నుండి జాలువారుతున్నది. ఒకరకమైన సువాసన వారి ధమ్మిల్లములలోని పూవుల గుత్తుల నుండి జారుతున్నది. మరొకరకమైన సువాసన వారి ముఖ నిశ్వాసముల నుండి ప్రభవిస్తున్నది. ఇంకొక జాతి సువాసన లలనామణుల పరిధాన (వస్త్రాల) చారు ధూపముల నుండి ఉద్భవిస్తున్నది. ఈ వాసనలన్నీ విడివిడిగానూ, సమ్మేళిథమయ్యూ, యయాతి మనస్సును శృంగార వీధుల్లో విహరింప జేస్తున్నాయి. ఈ పరిమళాలు వెదజల్లే అంగనాజనులు ఎక్కడ వున్నారో, ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయా అంగనామణులనే స్వయంగా దర్శించి, కృతార్థత గడించమని ఆ వాసనలన్నీ యయాతిని తొందర పెడుతున్నాయి. లోనారసి చూచినపప్పుడు, పద్యభావమిదే అన్న అబిప్రాయం కలగుక మానదు.

మనుచరిత్ర కావ్యంలోనూ ఇటువంటిదే ఒక ఘట్టం ఉన్నది. పాదలేపనం కరగిపోయి ప్రవరాఖ్యుడు మంచు కొండల్లో తిరుగు తున్నప్పుడు, దూరదూరాలనుండి వ్యాపించే  అంగనామణుల వివిధాంగ సౌరభాలు అతని ముక్కుపుటాలకు సోకుతాయి. వాటిని అల్లసాని పెద్దన వర్ణించే విధానం చూడండి:

మృగమద సౌరభ విభవ

ద్విగుణిత ఘనసారసాంద్ర వీటీ గంధ

స్థగితేతర పరిమళమై

మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మొలసెన్”

ఈ వాసనలు సోకిన ప్రవరుడు ఇంటికి పోవడానికీ దారి చెప్పేవారు లభ్యమైనారనే ఆనందంతో ఆ వాసన వెలువడిన దిక్కుకు పోతాడు. అక్కడ జగదేకసుందరి యైన వరూధిని అతనికి కనబడుతుంది. ఆ పద్యం చూడండి:

అతడావాత పరంపరా పరిమళవ్యాపార లీలన్ జనా

న్వితమిచ్చోటని చేరబోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్

శతపత్రేక్షణ, చంచరీక చికురన్, చంద్రాస్య, చక్రస్తనిన్,

నత నాభిన్, నవలాన్, ఒకానొక మరున్నారీ శిరోరత్నమున్!”

అల్లసాని ప్రవరాఖ్యుడు సువాసన వెలువడిన దిక్కుకు పోయిన పనివేరు. అతడు నిత్యాగ్నిహోత్రుడు. ఏకపత్నీ వ్రతుడు. ఒకచోట తనను తానే ఇట్లా నిందించుకుంటాడు:

బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్!”

యయాతి నన్నయ మహాకవి మాటల్లోనే “విషయ భోగోపరి లషణం” గలవాడు. కేవలం వాసన మాత్రంచే శృంగార రససిద్ధి లభ్యమయ్యే చోటెక్కడ ఉన్నదో పసి గట్టగలడు.

ప్రవరుని వలె కాకుండా,

యయాతికి పోయిన పని, లభ్యమైన పనీ ఒకటే.

Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

వాయువనే దూత అంగనా పరిమళాలను యయాతి వద్దకు మోసుకొని రావడం, యయాతిలో పేరుకొని వున్న శృంగార వ్యసనాన్ని పట్టి యిస్తుంది.

సర్వప్రాసాలంకృతమై “అక్షరరమ్యత” తో అలరారే నేటి పద్యం వాగనుశాసనుని వ్యంగ్యవైభవానికి, అర్థ చమత్కృతికీ, భావసౌందర్యానికీ ప్రతీక.

పలువురు సుందరాంగులను ఒకే వేదికపై దృశ్యమానం చేయడం నేటి పద్యంలోని మొదటి పార్శ్వం.  వారి అంగాంగ సౌగంధాలను మనచే ఆఘ్రాణింపజేయడం ఈ పద్యంలోని మరొక కోణం. తద్వారా ధ్వనిపూర్వకంగా యయాతి శృంగార వ్యసనాన్ని (romantic obsession) తెలపడం దీనిలోని మూడవకోణం. త్రిభుజాకృతి గల ఈ పద్యశిల్పం మహాకవి నన్నయ కవితా చాతుర్యానికి ప్రతీక. ఈ పద్యం చదివినప్పుడు

“చలువ గల వెన్నెలల చెలువునకు సౌరభము కలిగినను,

సౌరభము, చలువయుం గల కప్పురపు పలుకులకు కోమలత నెలకొనిన,

కోమలత, చలువ, జిగియుం గలిగి, జగముల మిగుల పెంపెసగు మలయ పవనంపు కొదమలకు మధురత్వం బలవడిన” అన్న పింగళి సూరన మల్టీ డైమన్షనల్ కవిత్వపు నిర్వచనం గుర్తుకు రాకమానదు. “కవిత్వానికి రంగు, రుచి, వాసనా వుంటాయి” అంటారు కృష్ణశాస్థ్రి గారు.

Also read: భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles