నాయకుడుగా చిత్రరంగంలో ప్రవేశించి,, ప్రతినాయకుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించి చివరికి కథానాయకుడిగా ఎదిగిన కొద్దిమందిలో కృష్ణంరాజు ఒకరు. ఆరడుగుల కంటే ఎత్తయిన మనిషి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఐజీఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున (తెల్లవారితే ఆదివారం అనగా)3.25 గంటలకు శాశ్వతంగా కన్నుమూశారు. 20 జనవరి 1940లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ కు పెద్దనాన్న.
‘చిలకా-గోరికా’ చిత్రంతో 1966లో వెండితెరలో రంగప్రవేశం చేశారు. ‘అవేకళ్ళు’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి శెభాష్ అనిపించుకున్నారు. నంది అవార్డులను 1977లోనూ, 84లోనూ గెలుచుకున్నారు. 1986లో ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో దక్షిణాది నటుడిగా ఫిలింఫేర్ ఎంపిక చేసిన దరిమిలా జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.
‘తాండ్ర పాపారాయుడు’ సినిమా గురించి ఆలోచించినప్పుడు నాకు జర్నలిజం ప్రయాణం గుర్తుకొస్తుంది. అవి దాసరి నారాయణరావు ఉదయం పత్రిక అధిపతిగా అటు సినిమారంగంలో ఒక వెలుగె వెలుగుతూ, ఇటు పత్రికారంగంలోనూ భాసించిన సందర్భం. నేను విజయవాడ ఉదయం ఎడిషన్ లో రెసిడెంట్ ఎడిటర్ గా ఉండేవాడిని. ఏబీకే ప్రసాద్ హైదరాబాద్ లో ప్రధాన సంపాదకులుగా ఉండేవారు. తన దగ్గర ఉన్న డబ్బుతో, బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని పత్రికను అట్టహాసంగా ప్రారంభించారు. అమెరికా నుంచి హారిస్ ప్రింటింగ్ మెషీన్ ను విమానం ద్వారా తెప్పించారు. ప్రతి నెలా చెన్నై నుంచి సూట్ కేసులో డబ్బులు తెచ్చి ఇచ్చేవారు. సిబ్బంది జీతాలకూ, ఇతర ఖర్చులకూ, సినిమాల జోలికి వెళ్ళకుండా పత్రికా నిర్వహణకే పరిమితమై ఉంటే ఆయనే యజమానిగా కొనసాగేవారు. కానీ సినిమాలో నిర్మించడం, దర్శకత్వం వహించడం ఎక్కువ చేశారు. అవి వరుసగా బాక్స్ ఆఫీసు దగ్గర కుదైలయ్యేవి. ఈ పరిస్థితి గమనించి నేనే ఆయనకు సినిమాలు పక్కన పెట్టమని సలహా ఇచ్చాను. బ్రహ్మాండంగా నడుస్తున్న ‘ఉదయం’ పత్రికపైనే దృష్టి కేంద్రీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశాను. ‘ఇంతవరకూ తీసిన సినిమాలు పోయినమాట వాస్తవమే మూర్తిగారూ. ఎక్కడ పారేశామో అక్కడే వెతుక్కోవాలంటారు. మళ్ళీ సినిమా తీస్తున్నా. అది హిట్ అవుతుంది. ఆ డబ్బులు మీకే, మీ పేపర్ కే ఇస్తాను,’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పేవారు.
అప్పటికే నాలుగైదు సినిమాలు దెబ్బతిన్నాయి. చివరికి ఆరో సినిమాగా సర్దార్ పాపారాయుడు 1986లో విడుదలయింది. విజయవంతంగా నడిచింది. డబ్బులు వచ్చాయి. కానీ ‘ఉదయం’ పత్రికను దాసరిగారు నడపలేక 1989లో మాగుంట సుబ్బరామిరెడ్డిగారికి అమ్మివేశారు. ఆ విధంగా ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి మా జర్నలిజం చరిత్రలో భాగస్వామ్యం ఉంది.
భక్తకన్నప్ప చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వాజపేయి మంత్రిమండలిలో మంత్రిగా కృష్ణంరాజు పని చేశారు. భార్య శ్యామలాదేవి, ఇద్దరు కుమార్తెలూ ఉన్నారు. సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు ప్రభాస్. అనుభవజ్ఞులైన హీరోలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత తరానికి చెందినవారు కృష్ణంరాజు, హరనాథ్, కృష్ణ ప్రభృతులు.
నేను చాలాసార్లు కృష్ణంరాజుగారిని కలుసుకున్నాను. ‘సాక్షి’లో ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎక్సె లెన్స్ అవార్డు ప్రదానం చేయడానికి అంగీకరించవలసిందిగా అభ్యర్థించడానికి నేనూ, మరోో డైరెక్టర్ రాణిరెడ్డిగారూ కృష్టం రాజు నివాసానికి వెళ్ళాం. ఆయననూ, శ్యామలగారినీ కలుసుకొని చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. సహృదయుడూ, సన్మిత్రుడు. తెలుగు సినిమారంగానికి పెద్దదిక్కు.