- ఖాతాదారులను వదులుకోలేమన్న ట్విట్టర్
- కఠిన చర్యలు తప్పవన్న కేంద్ర ప్రభుత్వం
- కొన్ని ఖాతాలను రద్దు చేయలేమన్న ట్విట్టర్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న కొన్ని ఖాతాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను మాత్రమే భారత్ లో నిలిపివేశామని ట్విటర్ తెలిపింది. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, మీడియాకు సంబంధించిన ఖాతాలను రద్దు చేయలేదని స్పష్టం చేసింది. అలా చేయడం భారత రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని ట్విట్టర్ అభిప్రాయపడింది. భావ ప్రకటనా స్వేచ్చను వ్యక్తిపరిచేందుకు ట్విట్టర్ యూజర్లకు ఉన్న హక్కును కాపాడతామని స్పష్టంచేసింది. దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న హ్యాష్ టాగ్ లు వైరల్ కాకుండా చర్యలు తీసుకున్నామన్న ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వం తెలిపిన 1200 ఖాతాలలో 500 ఖాతాలపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ట్విట్టర్ అయితే మాకేంటి ?
సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీచేసింది. సామాజిక మాధ్యమ వేదికలను ఆసరాగా చేసుకొని హింసను పురికొల్పుతూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న ఖాతాదారులను నిలువరించాలని హెచ్చరించింది. భారత్ లోని చట్టాలకు అనుగుణంగా సామాజిక మాధ్యమాలు వ్యవహరించాలని హితవు పలికింది. ఒక్కో దేశంలో ఒక్కోలా వ్యవహరిస్తూ ద్వంద్వ వైఖరి అవలంబించడం ప్రజాస్వామ్యానికి చేటని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
ద్వంద్వం ప్రమాణాలపై మంత్రి ఆగ్రహం:
రాజ్యసభలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత చట్టాలకు లోబడే సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో హెచ్చరించారు. ఆర్టికల్ 19 ఏ ప్రకారం స్వేచ్ఛా హక్కు ఉన్నప్పటికీ పరిమితులు ఉన్నాయని గుర్తుంచుకోవాలని అన్నారు.
సాధారణ పౌరులను చైత్యన్య పరుస్తున్న సామాజిక మాధ్యమాలను ఎల్లపుడూ గౌరవిస్తామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలోసామాజిక మాధ్యమాలు ఎనలేని పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా తప్పుడు వార్తల వ్యాప్తికి అడ్డుకట్టవేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాలన్నీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని అది ట్వట్టర్ అయినా ఎవరైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఆ ఖాతాలు తక్షణం బ్లాక్ చేయండి