ఇది అప్పటి సంగతి.
బక్క చిక్కిన శరీరాన్ని కప్పుతూ
ఒదులు, ఒదులు ఎర్ర బట్టలు,
తలచుట్టు గట్టిగా చుట్టిన ఎర్ర కండువా,
ఆకలి అరుపులు,
మాటలలో ఆవేదన, ఆక్రోశం,
వళ్లంతా చెమట వాసన,
కళ్ళల్లో ఎర్ర జీరలు, తరచు బిగుసుకొనే పిడికిళ్లు
ఎర్రటి ఎండ లో తెగిన హవాయి చెప్పులు వేసుకొని,
ఎర్ర జెండాలు ఊపుతూ,
అటూ ఇటూ పరుగెడుతూ, ఆవేశంతో తానూగిపోతూ
ఎలుగెత్తి అరిచిన నినాదాలు,
తెల్లవారుఝామున గోడలపై రాసిన
రక్తాక్షరాలు, లాటీ దెబ్బలు, లాక్ అప్ లు…
ఇప్పుడు వేరు…
మాపెరుగని తెల్లని ఖద్దరు పంచ,
తరచు పొట్ట దగ్గర బొత్తాములు తెగి పడిపోతూ
పాయిసొన్ స్ప్రే సువాసన లు వెదజల్లు తున్న
తెల్లని ఖద్దరు చొక్కా…
భుజం పై పొద్దున్నే చలువ చేసిన
మూడు రంగుల ఖద్దరు కండువా,
కష్టం గా కదిలే శరీరం,
ఎన్ని కషాయాలు తాగిన కదలని కడుపు…
కళ్ళల్లో అనుమానం, భయం,
బొంగురుబోయి గర గర మనే గొంతు,
ఆచి, తూచి మాట్లాడే మాటలలో వ్యంగ్యం,
గుండెలో భయం, ఎవరిని చూసినా అనుమానం…
అప్పటిలా ఇప్పుడు గట్టిగా గొంతు పెగిలి చావదు,
పిడికిళ్లు ముడుచుకోవు,
కళ్ళల్లో ఆల్కహాల్ అరుణిమే గాని,
అప్పటి భావోద్వేగపు భాను జ్వాలలు అగుపించవు.
కానీ ఎప్పుడో తెల్లారుగట్ల పట్టిన మగత నిద్రలో
వినిపించీ వినిపించకుండా పలవరిస్తాడు
…పాత నినాదాలు.
Also read: వర్షం
Also read: అమ్మ
Also read: నూతన జీవితం
Also read: ఎవరతను?!
Also read: ప్రయాణం