Sunday, December 22, 2024

మురళీథరన్ ను బౌల్ చేసిన దుమారం

  • మూలాలు తెలుసుకోకుండా తీవ్రమైన ఆరోపణలు
  • బయోపిక్ కు విజయ్ సేతుపతి దూరం
  • సునామీ బాధితులకు విశేష సేవ చేసిన మురళీథరన్

ముత్తయ్య మురళీథరన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే తమిళ సోదరులు తొందరపడి ఆయనను శ్రీలంక తమిళులకు బద్ధశత్రువుగా చిత్రించి ఆయన బయోపిక్ 800 నుంచి ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తప్పుకునే వరకూ ట్వీట్లతో వేధించారు. తన తండ్రి వెన్నులో సింహళీయులు చాకు దించారనీ, ఆ దాడి సమయంలో తమ బిస్కట్ల ఫ్యాక్టరీనీ, ఇతర ఆస్తులనూ తగులపెట్టారనీ మురళీథరన్ చెప్పినా వినలేదు. తమిళుల ఊచకోతను తాను సమర్థించలేదనీ, అమాయక తమిళుల హత్య జరిగినప్పుడు తాను పండుగ చేసుకున్నట్టు వస్తున్న వార్తలు సత్యదూరమని ఆయన స్పష్టం చేశారు. 2009లో సైన్యం గెలుపొంది యుద్ధ విరమణ జరిగినప్పుడు రెండు వైపులా మరణాలు ఆగిపోయినందుకు సంతోషించానని మురళీథరన్ చెప్పినా వినిపించుకోలేదు.

జాత్యాభిమానం కమ్మితే హేతువు కనిపించదు

ఆవేశంలో వివరాలు వినిపించవు, కనిపించవు. మురళీథరన్ శ్రీలంక జాఫ్నా ప్రాంతంలో స్థిరపడిన తమిళుడు కాదు. చరిత్ర సూటిగా, సరళంగా ఉండదు. అరలుఅరలుగా సంక్లిష్టంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే సహనం కావాలి. పరిశ్రమ చేయాలి. మురళీథరన్ కు రాజకీయాలు సవ్యంగా మాట్లాడటం రాదు. అట్లాగని ఆయన రాజకీయాలు మాట్లాడకుండా ఉండడు. తనకు తోచిన రీతిలో తనకు తోచిన వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. అలాగని అతను హృదయం లేని రాక్షసుడు కాదు. క్రికెట్ చరిత్రలో ఈ క్రీడాకారుడూ చూడని కష్టాలు చూశాడు. ఏ ఆటగాడు చేయని విధంగా దానధర్మాలూ చేశాడు. సముద్ర ప్రయాణికులకు చాలా ప్రధానమైన మజిలీ అయిన శ్రీలంకలో అనేక జాతులవారూ వచ్చిస్థిరపడినారు.

సంక్లిష్టభరితం శ్రీలంక చరితం

చారిత్రకపరమైన, జాతిపరమైన, భాషాపరమైన సంక్లిష్టతలు అనేకం శ్రీలంక లో ఉన్నాయి. వేల సంవత్సరాలుగా గుంపులు గుంపులుగా సముద్ర తరంగాలలాగా వలసవచ్చినవారు కోట్లమంది ఉంటారు.  ఉత్తర, తూర్ప భారతదేశం నుంచీ, మలబార్ తీరం నుంచీ, అరేబియన్ గల్ఫ్ నుంచీ, జావా ద్వీపం నుంచి వరుసగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధంగా దక్షిణభారతం నుంచి తమిళులు కూడా 2,500 సంవత్సరాల పొడవునా వలసవచ్చి శ్రీలంకలో స్థిరపడ్డారు. ఆ విధంగా వచ్చినవారిలో మలయహ తమిళులు నిరుపేదలు. వారు గుట్టప్రాంతంలో స్థిరపడినవారు. ముత్తయ్య మురళీథరన్ ఈ సమూహానికి చెందినవాడు. కాఫీ తోటలలో పని చేయడానికి తక్కువ వేతనాలకు పనికి వస్తారని బ్రిటిష్ పాలకులు 150 సంవత్సరాల కిందట మలయహ తమిళులను శ్రీలంక తీసుకొని వెళ్ళారు.

కూలికోసమే వారి ఆరాటం, పోరాటం

మలహయ తమిళులు ఎక్కువగా కూలిపని చేసుకొని జీవితం వెళ్ళదీస్తున్నారు. వారికి రోజు వేతనం 320 రూపాయలు. ఈ వివరాలు ద హిందూ పత్రిక శుక్రవారం సంచికలో యాండ్ర్యూ ఫైడల్ ఫెర్నాండో ‘ ఎ కంపెలింగ్ స్టోరీ, లాస్ట్ ఇన్ ది ఫాగ్ ఆఫ్ ఇల్లాజిక్‘ అనే శీర్షికతో ప్రచురించిన వ్యాసంలో తెలియజేశారు.  జాఫ్నా ప్రాంతంలో స్థిరపడిన తమిళుల ఆత్మగౌరవ పోరాటాలు చేశారు. వేర్పాటువాద ఉద్యమాలు నిర్వహించారు. సాయుధపోరాటం చేశారు. ఈ ఉద్యమాలలో మలయహ తమిళులు లేరు. వారు ఎప్పటికీ కూడూ, గుడ్డా గురించి పోరాటంతోనే సతమతం అవుతున్నారు. కూలీలు పెంచాలన్నది మాత్రమే వారి డిమాండ్. వీరి కూలీల గురించి తమిళ వేర్పాటువాదులు కానీ వారి నాయకుడు ప్రభాకరన్ కానీ ఎన్నడూ ప్రస్తావించలేదు. వీరు కూడా వేర్పాటువాదంవైపు చూడలేదు. జాఫ్నాలో నివసించే తమిళులు మంచి భాష మాట్లాడతారు. అగ్రకులాలకు చెందినవారు. మలయహ తమిళుల బజారు తమిళం మాట్లాడతారు. వెనుకబడిన కులాలకు చెందినవారు. మురళీథరన్ తమిళులకు ద్రోహం చేశాడని ఆరోపించేవారు ఏ తమిళులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు? మలయహ తమిళులకు మురళి ఎన్నడూ అన్యాయం చేయలేదు. జాఫ్నా తమిళులకు సైతం అపకారం చేయలేదు.

పేదరికాన్ని విస్మరించలేదు

మురళికి దారిద్ర్యం తెలియదు. కానీ ఆయన చిన్నాన్నలూ, మేనమామలూ కారు వెనక నుంచి బిస్కెట్లు అమ్మే వ్యాపారం చేసేవారు. క్రికెట్ లో శిఖరాలు అధిరోహించినప్పటికీ మురళి తన చిన్ననాటి సంగతులు మరచిపోలేదు. తన తోటివారి జీవన ప్రమాణాలూ, వారు ఎదుర్కొన్న పేదరికం విస్మరించలేదు. 2004లో సునామీ వచ్చి శ్రీలంకలో విలయం సృష్టించినప్పుడు మురళీథరన్ క్రికెట్ లో ఎవరెస్టు సమానుడుగా వెలుగొందుతున్నప్పటికీ సునామీ బాధితులను ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. సునామీ బాధితుల కోసం వేయి ఇళ్లు కట్టించాడు. తన సుహృద్బావంతో మరే క్రికెటర్ చేయనంతగా అనేకమంది జీవితాలలో వెలుగు నింపారు. అంతటి వదాన్యుడైన క్రికెటర్ మరొకరు లేరు.

మురళీథరన్ జాఫ్నా తమిళుడు కాదు

బహుశా మురళీథరన్ మలయహ తమిళుడని, జాఫ్నా తమిళుడు కాదనీ స్పష్టమైన  ప్రచారం జరిగి ఉంటే అతనిపైన ఇంత దుమారం చెలరేగి ఉండేది కాదు. మురళీథరన్ అద్భుతమైన బౌలర్. బంతితో మాయాజాలం సృష్టించి ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాట్స్ మన్ ని బోల్తాకొట్టించగల మాంత్రికుడు. తన టెస్ట్ కెరీర్ లో 800 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును భవిష్యత్తులో ఎవ్వరూ అధిగమించే అవకాశం లేదు. అటువంటి అరుదైన క్రికెటర్ జీవితాన్ని చిత్రించే బయోపిక్ కు అనుమానాల కారణంగా, స్పష్టమైన సమాచారం లేనికారణంగా అతనిపైన దుమారం చెలరేగి విజయ్ సేతుపతి ప్రాజెక్టునుంచి నిష్క్రమించాడు. ‘అపాన్ ఎ స్లీప్ లెస్ ఐలాండ్ ’ అనే పుస్తకాన్ని రచించిన వ్యాసరచయిత ఫెర్నాండో బయోపిక్ కథ చదివి ముగ్థుడైపోయారు.

మురళీథరన్ యాక్షన్ పై పాశ్చాత్య క్రికెటర్ల అభ్యంతరాలు

క్రికెట్ లో ఆధిపత్యం వహిస్తున్న పాశ్చాత్య క్రీడాకారులూ, అధికారులూ మురళీథరన్ యాక్షన్ ని తప్పు పట్టి అతడి కెరీర్ పొడవునా వేధించేవారు. దక్షిణాసియా క్రికెటర్ల పట్ల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అధికారులకు ఈర్ష్యాద్వేషాలు ఉండేవి. ఈ చిత్ర కథారచయితలలో ఒకరైన శేహన్ కరుణతిలక శ్రీలంక అంతర్యుద్ధాన్ని నిశితంగా విమర్శించాడు. మురళి యుద్ధాన్ని సమర్థించాడని కానీ తమిళుల హత్యను స్వాగతించాడని కానీ చెప్పడం అన్యాయం. జాతీయాభిమానం వల్ల ఇటువంటి ఆవేశకావేశాలు పెల్లుబుకుతాయి. కానీ నిదానంగా ఆలోచిస్తే శ్రీలంకలో తమిళులందరూ ఒకే గూటికి చెందినవారు కారనీ, వారిలో నానా రకాల వారు ఉన్నారనీ, మురళీథరన్ కూ జాఫ్నా తమిళులకూ, సాయుధపోరాటానికీ ఎటువంటి సంబంధం లేదనీ తెలుస్తుంది. మానవీయ హృదయంతో సునామీ బాధితుల కోసం ఎంతో సహాయం చేసిన మురళీథరన్ ను తమిళులను వధిస్తుంటే ఫిడేల్ వాయిస్తూ ఆనందించాడనే అపవాదు వేయడం నిజంగా అన్యాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles