దేశంలో విద్య అభివృద్ధికి తొలి బాట వేసిన విద్యాధికుడు అబుల్ కలాం ఆజాదే. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. నవంబర్ 11న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలుపేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కా నగరంలో 11 నవంబర్ 1888 న జన్మించారు. ఆయన వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు/ మౌలానాల వంశం నుండి వచ్చారు. ఆయన తల్లి అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు గల ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.
స్వీయ అధ్యయనం ద్వరా ఇంగ్లీషు నేర్చుకున్న ఆజాద్
1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వచ్చాడు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు. ఆయన విద్య ఇంట్లో సాగింది. మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించాడు. ఆజాద్ మొదట అరబిక్, పెర్షియన్ తరువాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం నేర్చుకున్నాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు. ఆయన దివ్య ఖురాన్ పై భాష్యం రాశాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టాడు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అయిన విషయం ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింలను విప్లవ వ్యతిరేకులుగా భావించ సాగారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించాడు.
1912లో ఉర్దూ వార పత్రిక స్థాపన
1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు. మౌలానా ఆజాద్, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయినారు. ఆయనను ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, 1946 వరకు ఆ పదవిలో ఉన్నాకె. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. ఆయన ప్రఖ్యాత పండితుడు, కవి. 1947 ఆగస్టు 15 నుండి అంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1958 ఫిబ్రవరి 2 వరకు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు.
జాతీయ దినోత్సవంగా అబుల్ జన్మదినం
ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది. అంతేకాదు ఆయన పేరిట పలు విద్యాసంస్థలు కూడా నెలకొల్పబడ్డాయి. అబుల్ కలాం మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సహా భారతదేశం అంతటా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఆయన సేవలకు గుర్తుగా 2008లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్ణయించింది.
అసలుపేరు మొహియుద్దీన్ అహ్మద్
స్వాతంత్య్ర సమర యోధుడిగా, భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు ‘మొహియుద్దీన్ అహ్మద్‘, ‘అబుల్ కలామ్‘ అనేది బిరుదు.. ‘ఆజాద్‘ అనేది ఆయన కలం పేరు. ఆయన అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ తదితర భాషలలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. స్వయంగా సాహితీవేత్త అయిన ఆయన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్‘ను రాశారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు, విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అంకిత భావంతో పనిచేశాడు. చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాాణానికి జాతీయ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించారు. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారు. అలాగే ‘‘ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను పొందడం వ్యక్తి జన్మహక్కుగా పరిగణించాలి. లేదంటే పౌరులుగా తమ విధులను పూర్తిగా నిర్వర్తించలేరు‘‘ అని అబుల్ కలామ్ ప్రాథమిక విద్య గురించి వివరించారు. ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో అనేక పథకాలను తీసుకొచ్చారు.
యూజీసీ ఏర్పాటు ఆజాద్ హయాంలోనే
ఆయన మార్గదర్శకత్వం, నాయకత్వంలో విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ (యుజిసి)ని విద్యా మంత్రిత్వ శాఖ 1953లో స్థాపించింది. 951లో అబుల్ నాయకత్వంలో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభమైది. ఆయన ఒక దూరదృష్టిగల వ్యక్తి, భవిష్యత్ సాంకేతిక నిపుణులను రూపొందించడంలో ఐఐటిల సామర్థ్యాన్ని నమ్ముతాడు. “ఈ ఇన్స్టిట్యూట్ స్థాపన దేశంలో ఉన్నత సాంకేతిక విద్య-పరిశోధనల పురోగతిలో ఒక మైలురాయిగా మారుతుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు” అని మౌలానా ఆజాద్ పేర్కొన్నారు.
గాంధీజీ ఆయనను భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఆయనను మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవాడు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
(నవంబర్ 11 అబుల్ కలాం ఆజాద్ జయంతి)